బుధవారం 01 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 27, 2020 , 03:47:10

ఇంటర్‌ పరీక్షలకు సన్నద్ధం

ఇంటర్‌ పరీక్షలకు సన్నద్ధం

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నది. మార్చి 4 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న పరీక్షలకు ఇంటర్‌ విద్యాశాఖ అధికారులు పటిష్ట  చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షల నిర్వహణపై దాదాపు ఏడు శాఖల వారితో సమావేశాలను ఏర్పాటు చేసి పరీక్షలకు సర్వం సిద్ధం చేశారు. 

15,269 మంది విద్యార్థులు

జిల్లాలోని 25 ఇంటర్‌ కళాశాలల ద్వారా మొత్తం 15,269 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. జిల్లాలో మొత్తం 47 ఇంటర్‌ కళాశాలలున్నాయి. వీటిలో ప్రభుత్వ కళాశాలలు 12, 11 గురుకులాలు, 6 ఒకేషనల్‌, 17 ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ఇంటర్‌ కళాశాలల్లో 13,643, ఒకేషనల్‌ కళాశాలల్లో 1,626 మంది ఉన్నారు. జిల్లాలో 24  పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 11 ప్రభుత్వ, 13 ప్రైవేట్‌ కళాశాలలున్నాయి. ప్రశ్నాపత్రాలను తెరిచే ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. పరీక్షల నిర్వహణకు 48 మంది చీఫ్‌ సూపరింటెండెంట్‌లను నియమించారు. అయిదుగురు కస్టోడియమ్స్‌, ఒక ఫ్లయింగ్‌ స్కాడ్‌, రెండు సిట్టింగ్‌ స్కాడ్‌ బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో పరీక్ష పేపర్ల స్టోరేజ్‌గా 9 కేంద్రాలను అధికారులు గుర్తించారు. 

యాప్‌తో సమస్యలకు చెల్లు

విద్యార్థులు పరీక్ష కేంద్రాలను సులువుగా గుర్తించేందుకు ప్రభుత్వం ఓ యాప్‌ను ఏర్పాటు చేసింది. గతంలో అభ్యర్థులు పరీక్షా కేంద్రాల చిరునామాలను తెలుసుకోవడంలో ఇబ్బంది పడాల్సి వచ్చేది. అయితే, ప్రస్తుతం ఎంసెట్‌ తరహలో కేంద్రాల గుర్తింపునకు ఎగ్జామ్‌ సెంటర్‌లో కేటీర్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో విద్యార్థులకు అవస్థలు తప్పనున్నాయి. అభ్యర్థుల హాల్‌టికెట్ల జారీలో ప్రైవేట్‌ కళాశాలలు పెట్టే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వెబ్‌సైట్లో కూడా నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తుండటం విద్యార్థులకు ఉపశమనం కలిగిస్తున్నది.logo
>>>>>>