శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 27, 2020 , 03:04:06

కన్నుల పండువగా రథోత్సవం

కన్నుల పండువగా రథోత్సవం

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ : ఆత్మకూరు పరమేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం స్వామివారి రథోత్సవం (మూడో సవారి) కన్నుల పండుగగా సాగింది. మున్సిపాలిటీ పాలకవర్గం, జాతర అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో రథోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కిక్కిరిసిన భక్తజనుల మధ్య జాతర ప్రాంగణం శివనామస్మరణంతో మార్మోగింది. మూడో సవారీని పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచే దేవాలయంలో భక్తులు బారులుదీరారు. మొక్కుబడి ఉన్న భక్తులు జాతర ప్రాంగణంలో దాసంగాలు పెట్టారు. ఉపవాస దీక్షలు చేపట్టిన మహిళలు స్వామివారికి నైవేద్యం సమర్పించి దీక్షలను విరమించారు. సాయంత్రం జరిగిన పల్లకీసేవ ఊరేగింపులో చైర్‌పర్సన్‌ గాయిత్రియాదవ్‌ దంపతులు స్వామివారి పట్టువస్ర్తాలను తీసుకొచ్చారు. కుర్వడోళ్లు, మేళతాళాలు, పటాకులతో పురవీధుల్లో ఊరేగింపు కొనసాగింది. దేవాలయానికి చేరిన పల్లకీసేవ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజల అనంతరం స్వామి రథోత్సవంపై అసీనుడయ్యాడు. ప్రభారథోత్సవంపై నయనానందముగా దర్శనమిచ్చిన స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. ఓం.. నమః శివాయ నామస్మరణంతో భక్తులు రథాన్ని(తేరు) లాగారు. బసవేశ్వర సన్నిధి వరకు సాగిన ప్రభారథోత్సవంలో శివసత్తులు పూనకాలతో హోరెత్తించారు. నందికోళ్ల సేవలో భక్తులు ఖడ్గాలు వల్లించారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ అధ్యక్షుడు కృష్ణమూర్తి, జెడ్పీటీసీ శివరంజని, వైస్‌ చైర్మన్‌ విజయభాస్కర్‌రెడ్డి, కౌన్సిలర్లు, జాతర ఫిట్‌ పర్సన్‌ రవికుమార్‌యాదవ్‌, నాయకులు వెంకటనర్సింహరావు, వీరేశలింగం, భాస్కర్‌, రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.logo