బుధవారం 08 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 25, 2020 , 01:16:07

అట్టహాసంగా..

అట్టహాసంగా..

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ : ఆత్మకూరు పరమేశ్వరస్వామి బ్రహ్మోత్సవ వేడుకలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. చెరువులో స్వయంభుగా వెలసిన పరమశివుడి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం తరువాత వచ్చే అమావాస్య నుంచి ప్రారంభమయ్యే జాతర వేడుకలను పాలకవర్గం ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ మేరకు దేవాలయాన్ని విద్యుదీపాలతో శోభాయమానంగా అలంకరించారు. బ్రహ్మోత్సవ వేడుకల ప్రారంభం నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే దేవాలయంలో భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు స్వామివారికి దాసంగాలు పెట్టి నైవేద్యాలు సమర్పించారు. సాయంత్రం స్థానిక వేంకటేశ్వరస్వామి దేవాలయం నుంచి ఆరంభమైన స్వామివారి పల్లకీసేవ కన్నుల పండుగగా సాగింది. ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, వైస్‌ ఎంపీపీ కోటేశ్వర్‌, పీఏసీఎస్‌ అధ్యక్షుడు కృష్ణమూర్తి, మాజీ ఎంపీపీ శ్రీధర్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గాయిత్రిరవికుమార్‌ యాదవ్‌ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి పల్లకీసేవను ప్రారంభించారు. 


చైర్‌పర్సన్‌ దంపతులు స్వామివారికి పట్టువస్ర్తాలను సమర్పించారు. బాజా భజంత్రీలు, కుర్వడోళ్ల మేళాల నడుమ పెద్ద ఎత్తున పటాకులు కాల్చుతూ స్వామివారి పల్లకీసేవను నిర్వహించారు. ఊరేగింపు పొడవునా భక్తులు స్వామిని దర్శించుకునేందుకు పోటీపడ్డారు. పల్లకీసేవ చెరువులోని దేవాలయానికి చేరుకోగానే దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం స్వామి రథోత్సవంపై ఆసీనుడైన భక్తులకు దర్శమించాడు. అనంతరం మొదటి సవారీని ఘనంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు స్వామి రథోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో చేపట్టారు. మంగళవారం రెండో సవారీ జరగనున్నట్లు జాతర అభివృద్ధి కమిటీ ప్రతినిధులు తెలిపారు. మహోత్సవంలో రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, విశ్రాంత ఉద్యోగులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


logo