సోమవారం 01 మార్చి 2021
Wanaparthy - Feb 23, 2020 , 23:49:29

పట్టణాల్లో ప్రగతిబాట

పట్టణాల్లో ప్రగతిబాట

నారాయణపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పట్టణాల సమస్యలు పరిష్కారం కావాలి.. పచ్చదనం, పారిశుధ్యంతో అద్దంలా మెరవాలి అన్న తపనతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశానుసారం చేపట్టనున్న పట్టణ ప్రగతి సోమవారం నుంచి ఆరంభం కానుంది. 10 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలతో పట్టణాల ప్రధాన సమస్యలు పరిష్కారం కానున్నాయి. కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు వీలుగా జిల్లా కలెక్టర్‌ హరిచందన ఆధ్వర్యంలో అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు నారాయణపేటలోఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, మక్తల్‌లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి, కోస్గిలో కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.


మూడు మున్సిపాలిటీలు.. 56 వార్డులు

జిల్లాలో నారాయణపేట, కోస్గి, మక్తల్‌ మున్సిపాలిటీలలో మొత్తం 56 వార్డులు ఉన్నాయి. వీటిలో నారాయణ పేట మున్సిపాలిటీ ఆరు దశాబ్దాలుగా మున్సిపాలిటీగా కొనసాగుతుండగా.. మిగిలిన రెండు మున్సిపాలిటీలు నూతనంగా ఏర్పడినవి. పల్లెలు మురిసేలా చేపట్టిన పల్లె ప్రగతి ఇచ్చిన స్ఫూర్తితో పట్టణాలను అభివృద్ధి చేసేందుకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపడుతుం డటంతో సమస్యలు పరిష్కారం అయ్యి పచ్చదనం, పారిశుధ్యం కార్యక్రమాలతో రూపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రతి వార్డులోనూ వార్డు కౌన్సిలర్లు, 60 మందితో కూడిన కమిటీ సభ్యులు, ప్రతి వార్డుకు నియమించిన నోడల్‌ ఆఫీసర్లు వార్డులలో పర్యటించనున్నారు. వీరితో పాటు నారాయణపేట ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్‌, మక్తల్‌కు డీఆర్వో, కోస్గి ప్రత్యేక అధికారిగా ఆర్డీవో వ్యవహరిస్తారు. ప్రతి వార్డులో ఉన్న ప్రధాన సమస్యలను గుర్తించి వాటిని ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తారు.


పారిశుధ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి

పట్టణ ప్రగతి కార్యక్రమంలో పారిశుధ్య కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, కమిటీ సభ్యులు వార్డులలో పర్యటించి వాటిని గుర్తిస్తారు. 10 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ కాలువలు, గోతులు, మురుగునీటి గుంటలను పరిశీలిస్తారు. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉందా లేదా అన్న అంశాలను సైతం గుర్తిస్తారు. ఇదే సమయంలో ప్రధాన కూడళ్లు, ఇండ్లల్లో చెట్లు ఏ మేరకు ఉన్నాయి.. కొత్తగా ఎక్కడెక్కడ నాటవచ్చు అన్న విషయాలను పరిశీలిస్తారు. మంచినీటి సౌకర్యాలు, విద్యుత్తు సమస్యలను సైతం గుర్తిస్తారు. అందరికీ ప్రయోజనకరంగా ఉండేలా డంపింగ్‌ యార్డుల ఏర్పాటు, వైకుంఠధామాల కోసం అధికారులు స్థలాలను పరిశీలించి అవసరాల మేరకు ఎంపిక చేస్తారు. పట్టణాల పారిశుధ్యంపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటారు. 


ఆరంభించనున్న ఎమ్మెల్యేలు

పట్టణ ప్రగతి కార్యక్రమాలను జిల్లా ఎమ్మెల్యేలు వారి వారి నియోజక వర్గాల పరిధిలోని మున్సిపాలిటీలలో ప్రారంభిస్తారు. నారాయణపేటలో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి జిల్లా కలెక్టర్‌ హరిచందనతో ప్రారంభిస్తారు. మక్తల్‌లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, కోస్గిలో కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి కార్యక్రమాలను ఆరంభిస్తారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.


VIDEOS

logo