ఆదివారం 24 మే 2020
Wanaparthy - Feb 23, 2020 , 23:26:31

‘ప్రగతి’ బాటలు

‘ప్రగతి’ బాటలు

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పట్టణ ప్రగతి కార్యక్రమ నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు జరిగాయి. పది రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సిద్ధమయ్యారు. ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారడంతో పట్టణ ప్రగతికి సర్కార్‌ శ్రీకారం చుట్టింది. సోమవారం నుంచి మార్చి 4వ తేదీ వరకు పట్టణ ప్రగతి పథకాన్ని జిల్లాలోని వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీల్లో కొనసాగించనున్నారు. జిల్లాలో రెండు విడుతలుగా నిర్వహించిన పల్లె ప్రగతి విజయవంతంగా చేపట్టారు. ఇదే స్ఫూర్తితో పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, కలెక్టర్‌ షేక్‌యాస్మిన్‌ బాషాలు అధికార యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు ఇటీవల దిశా నిర్దేశం చేశారు. వనపర్తి, పెబ్బేరు మున్సిపాలిటీలలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని లాంఛనంగా మంత్రి సింగిరెడ్డి, కలెక్టర్‌ యాస్మిన్‌ బాషాలు ప్రారంభించేలా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రణాళికతో నిర్వహించాలని పలు దఫాలుగా అధికారులు సమీక్షలు నిర్వహించారు. మున్సిపల్‌ కమిషనర్లు, చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లతో కలెక్టర్‌ ఇటీవల వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి చేపట్టాల్సిన చర్యలపై వివరించారు. డివిజన్ల వారీగా చేపట్టాల్సిన పనులు, వార్డు కమిటీలు, వాటి పనితీరుపైన కలెక్టర్‌ స్పష్టతనిచ్చారు.


ప్రజల భాగస్వామ్యం..

పట్టణ ప్రగతిలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేసే చర్యలకు ప్రాధాన్యనిస్తున్నారు. వీటిలో యువకులు, వృద్ధులు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు, మహిళా సంఘాల సభ్యులను భాగస్వామ్యం చేసేలా కార్యాచరణ రూపొందించాల్సి ఉంది. మున్సిపాలిటీల్లోని ఆయా డివిజన్‌ పరిధిలోని కాలనీల్లో పారిశుధ్యం నిర్వహణ, పిచ్చిమొక్కలు, ముళ్ల పొదలు, చెత్తతొలగింపులాంటిపై దృష్టి సారించాలి. ఎక్కువ మందిని చైతన్య పరిచి ప్రజల భాగస్వామ్యాన్ని పంచే దిశగా అధిక ప్రధాన్యతను ఇస్తున్నారు. 


చిరు వ్యాపారులపై నజర్‌

జిల్లా కేంద్రం మున్సిపాలిటీలో ప్రధాన రోడ్లను అనుసరించి చిరు వ్యాపారాలు చేస్తున్న వారిపై మంత్రి సింగిరెడ్డి ప్రత్యేక నజర్‌ పెట్టారు. ముందే ఇరుకుగా ఉన్న రోడ్లపై ఈ చిరు వ్యాపారాలు ఆటంకంగా ఉన్నాయి. వీరికి ప్రత్యామ్నాయ మార్గాలను చూయించి మార్పు చేయాలని మంత్రి ఇటీవల పంచాయతీరాజ్‌ సమ్మేళనం కలెక్టర్‌కు వివరించారు. ప్రధాన రోడ్డును అనుసరించి ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను అనుసరించి షాపుల నిర్మాణంతో ఈ చిరువ్యాపారులకు తోడ్పాటునందించే దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. పట్టణ ప్రగతిలో ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుని చిరువ్యాపారాల నిర్వహణపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు.


వార్డుల వారీగా కమిటీలు

పట్టణ ప్రగతి కార్యక్రమ విజయవంతానికి అన్ని వర్గాల ప్రజలతో వివిధ కమిటీలను వేయబోతున్నారు. ప్రతి వార్డులోను నాలుగు రకాల కమిటీల ఏర్పాటు ఉండేలా చర్యలున్నాయి. సామాజిక కార్యకర్తలు, రిటైర్డ్‌ ఉద్యోగులు, యువజన, విద్యార్థి, మహిళా సంఘాల సభ్యులకు ఈ కమిటీల్లో భాగస్వామ్యం కల్పించనున్నారు. ఒక్కొక్క కమిటీలో 15 మందికి తగ్గకుండా సభ్యులను ఏర్పాటు చేస్తూ నాలుగు కమిటీల్లో 60 నుంచి 70 వరకు సభ్యులకు అవకాశం కల్పించనున్నారు. పట్టణ ప్రగతిలో ఈ కమిటీలు ప్రధాన భూమికను పోషించబోతున్నాయి.


ప్రగతి మార్గదర్శకాలివే..

పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రత్యేకంగా కొన్ని మార్గదర్శకాలను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో శిథిలావస్థలో ఉన్న గృహాల తొలగింపు, ఎండిపోయిన, పాడుబడిన బోరు బావుల్ని మూసేయడం, సామూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి స్థలాల గుర్తించాలి. అలాగే ఒరిగిపోయిన విద్యుత్‌ స్తంభాలను తొలగించడం, వదులుగా ఉన్న తీగలను క్రమబద్ధీకరించడం, బాటసారులకు ఇబ్బందిగా స్తంభాలను తొలగించడం, ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయాలి. నాటిన మొక్కలకు ట్రీ గార్డులను ఏర్పాటు, చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటాలి. డంపింగ్‌ యార్డు, శ్మశాన వాటికలు, సమీకృత మార్కెట్‌కు స్థలాలను గుర్తించాలి. హరిత ఉద్యానవనాలు, పార్కులు, ఆటస్థలాలు ఏర్పాటులాంటివి ప్రధానంగా పట్టణ ప్రగతిలో తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.


logo