శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 15, 2020 , 23:52:24

పెద్ద మొక్కలు నాటాలి

పెద్ద మొక్కలు నాటాలి
  • మొక్కల పెంపకంపై నిర్లక్ష్యం వీడాలి
  • హరితహారం పనులు పరిశీలించిన కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా

మదనాపురం : హరితహారంలో భాగంగా రహదారులకు ఇరువైపులా పెద్ద మొక్కలు నాటాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా సూచించారు. మండలకేంద్రం నుంచి ఆత్మకూరుకు వెళ్లే రహదారి వెంట నాటిన మొక్కలను శనివారం కలెక్టర్‌ పరిశీలించారు. ట్యాంకర్‌ ద్వారా మొక్కలకు నీరు పోస్తుండడం బాగుందని అభినందించారు. ట్రీగార్డులు కింద పడిపోవటంతో వాటిని సరిచేయాలని ఉపాధి సిబ్బందిని ఆదేశించారు. మొక్కలు చిన్నగా ఉన్నాయని, రహదారులకు ఇరువైపులా నాటే మొక్కలు పెద్దగా ఉండేటట్లు చూసుకోవాలని పంచాయతీ కార్యదర్శి రంగస్వామికి సూచించారు. మొక్కల సంరక్షణపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తమొక్కలు నాటాలని కిందిస్థాయి సిబ్బందికి కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని లక్ష్మీపురం కాలనీలో ఉన్న హరితహారం నర్సరీని తనిఖీ చేశారు. 


నర్పరీలో పెరిగిన పెద్ద మొక్కలను అలాగే ఉంచకుండా రహదారి పక్కన నాటాలని డీఆర్‌డీవో గణేశ్‌, డీపీవో రాజేశ్వరిలను ఆదేశించారు. నర్సరీలో ఎంతమంది పనిచేస్తున్నారని, బ్యాగులో నింపేందుకు మట్టిని ఎక్కడినుంచి తెచ్చారని, మొక్కలు బాగా పెరిగేందుకు మంచి ఎరువును వినియోగించాలని సూచించారు. కొత్త పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం నర్సరీలతో పాటు, రహదారి ప్లాంటేషన్‌, ఇతర సంస్థల్లో నాటిన మొక్కల సంరక్షణకు వందశాతం చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌ రాంనారాయణకు సూచించారు. సిబ్బంది తక్కువగా ఉన్నారని సర్పంచ్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగా, గ్రామ పంచాయతీలో అందుబాటులో ఉన్న సిబ్బందితో హరితహారం పనులు కూడా చేయించాలని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట డీపీఆర్వో వెంకటేశ్వర్లు ఉన్నారు.


logo