బుధవారం 01 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 15, 2020 , 23:45:40

పల్లెలన్నీ..ప్రగతి బాట పట్టాలి

పల్లెలన్నీ..ప్రగతి బాట పట్టాలి
  • గ్రామస్వరాజ్యం దిశగా ప్రభుత్వం అడుగులు
  • ఇన్‌చార్జిగా హాజరు కానున్నమంత్రి నిరంజన్‌రెడ్డి
  • 20, 21, 23న వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్‌లో పంచాయతీ సమ్మేళనాలు

వనపర్తి, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలో పల్లెలన్నీ ప్రగతి బాట పట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి శనివారం ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20వ తేదీన వనపర్తి జిల్లాలో, 21న జోగుళాంబ గద్వాల, 23న నాగర్‌కర్నూల్‌ జిల్లాలో జరుగనున్న పంచాయతీ సమ్మేళనాలకు ఇన్‌చార్జి మంత్రిగా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టుదలగా పనిచేయాలని, ప్రజలను భాగస్వాములను చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ వికాసం కోసం సీఎం కేసీఆర్‌ తపన పడుతున్నారన్నారు. ‘పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు’ అన్నది నినాదంగానే మిగిలిపోయిందని దానిని ముఖ్యమంత్రి నిజం చేస్తున్నారన్నారు. 


గ్రామాల అభ్యున్నతి కోసం పకడ్బందీ ప్రణాళికతో ప్రతి మనిషికి ఏడాదికి రూ.1655 చొప్పున కేటాయిస్తుందని, వాటిని గ్రామాల్లో కనీస వసతుల కల్పన, పరిసరాల పరిశుభ్రత, రోడ్లు, మురుగుకాల్వల నిర్మాణానికి వాడుకోవాలని, మొక్కల పెంపకం ఒక ఉద్యమంలా సాగాలని సూచించారు. క్షేత్ర స్థాయి ఇబ్బందులను సమగ్రంగా పరిశీలించిన ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, ఆరోగ్యవంతమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆయా జిల్లాల్లో నిర్వహించే సమావేశాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్‌ పర్సన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవో, గ్రామాభివృద్ధి శాఖ అధికారులు తప్పని సరిగా హాజరయ్యేలా సంబంధిత జిల్లా కలెక్టర్లు ఆదేశాలను జారీ చేయాలని సూచించారు. 


logo
>>>>>>