బుధవారం 08 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 14, 2020 , 23:16:12

పండుగలా మొక్కల పెంపకం

పండుగలా మొక్కల పెంపకం

మణుగూరు, నమస్తే తెలంగాణ: పచ్చదనంలో పినపాక నియోజకవర్గాన్ని  జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలపాలని ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.  ఈ నెల 17వ తేదీన సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకల్లో భాగంగా 25 వేల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మణుగూరు మండలంలో 6వేలు, కరకగూడెంలో 5వేలు, ఆళ్లపల్లి, గుండాల మండలాల్లో 2వేలు, అశ్వాపురం మండలంలో 5వేలు, బూర్గంపహాడ్‌ మండంలో 5వేలు మొత్తం 25 వేల మొక్కలు నాటుతామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కడియం నుంచి పండ్ల మొక్కలు తీసుకువచ్చి ఇంటింటికీ అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు భాగస్వాలు కావాలని ఆయన పిలుపునిచ్చారు. 


ఇప్పటికే అత్యంత ప్రతిష్టాత్మకంగా సీఎం కేసీఆర్‌ చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని మొక్కలు నాటుతున్నారని, విజయవంతంగా హరితహారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా పెద్ద ఎత్తున నియోజకవర్గంలో మొక్కలు నాటామన్నారు. నాటిన మొక్కలను బాధ్యతగా సంరక్షించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సింగరేణి సంస్థ మణుగూరు ఏరియా ఆధ్వర్యంలో జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌క్లాస్‌ నూతన కోర్టు ఆవరణంలో హరితహారం నిర్వహించారన్నారు. ఇప్పటి నుంచే హరితహారం కార్యక్రమంలో భాగంగా లక్ష మొక్కలు నాటేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తామని తెలిపారు. లక్ష మొక్కలకు ప్రత్యేకంగా ట్రీగార్డులను ఏర్పాటు చేసేలా సర్వం సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు తెలిపారు. 


logo