గురువారం 13 ఆగస్టు 2020
Wanaparthy - Feb 14, 2020 , 01:19:23

ప్రతి ఓటూ కీలకమే!

ప్రతి ఓటూ కీలకమే!

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సహకార సంఘాల ఎన్నికల ప్రచారం జోరందుకుంది. డైరెక్టర్ల పరిధిలోని ప్రతి ఓటును అభ్యర్థులు కీలకంగా భావిస్తున్నారు. ఒక్క ఓటైనా గెలుపోటములను నిర్దేశించేదే కాబట్టి అభ్యర్థులు ఒక్కొ ఓటరును కలుస్తూ తమకు మద్దతివ్వాలని అభ్యర్థిస్తున్నారు. తమ వా రిని చేజారకుండా చూసుకుంటూనే, అవతలివారిని బేరసారాలతో తమవైపునకు తిప్పుకోవాలనే ప్రయత్నాలు అక్కడక్కడ వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితి లో సహకార ఎన్నికలు సాధారణ ఎన్నికలను మించి గ్రామాల్లో కనిపిస్తున్నా యి. జిల్లాలో 15 సహకార సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అయి ంది. వీటిలో రేచింతల సొసైటీలో అన్ని డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగిలిన 14 సొసైటీల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. 195 స్థానాలకు గాను మొత్తం 44  ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగిలిన 151 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. శనివారం నిర్వహించే పోలింగ్‌, కౌంటింగ్‌లపై అధికార యంత్రాంగం దృష్టిని సారించింది. ఈ మేరకు అవసరమైన ఎన్నికల సిబ్బందిని శిక్షణ ఇచ్చి సిద్ధం చేశారు. ఓటింగ్‌కు అవసరమైన భవనాలను కూడా ఆయా కేంద్రాల్లో గుర్తించారు. 13 వార్డులకు అనువుగా ఉండే భవనాలను ఎంపిక చేసి ఓటింగ్‌ నిర్వహించే ఏర్పాట్లు చేశారు.

ప్రతి ఓటు కీలకం..

ఎన్నికలు జరుగుతున్న డైరెక్టర్‌ కేంద్రాల్లో ప్రతి ఓటుకు ఎక్కువ ప్రాధాన్యత ఏర్పడింది. అభ్యర్థుల మధ్య నువ్వా.. నేనా అన్నట్లు పోటీ ఉండడంతో ఏ ఒక్క ఓటును వదులుకునే పరిస్థితుల్లో అభ్యర్థులు లేరు. హైదరాబాద్‌లో ఉన్నా.. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటుదారుడిని నాయకులు ఫాలో చేస్తున్నారు. ప్రతి ఓటరును ఇంటికి వెళ్లి కలుస్తూ తాయిలాలను ఆశగా చూపే ప్రయత్నాలను మొదలెట్టారు. ఇంకా అవసరమనుకుంటే ఓటర్లకు అనుకూలంగా ఉన్న వారి నుంచి సిఫారసు చేయించుకుంటున్నారు. అనేక చోట్ల ఓటర్లు ఇతర ప్రాంతాల్లో ఉన్నందునా వారిని రప్పించుకునే ఏర్పాట్లపైనా దృష్టి పెట్టారు. అత్యధికంగా పోలింగ్‌ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న సందర్భంలో తక్కువ ఓట్లతో ఫలితం తారుమారయ్యే అవకాశాలను అభ్యర్థులు పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈక్రమంలో ఒక్క ఓటును కూడా నిర్లక్ష్యం చేసే పరిస్థితి ఈ ఎన్నికల్లో కనిపించడం లేదు. 

సహకారంపై మంత్రి, ఎమ్మెల్యేల దృష్టి

జిల్లాలో కొనసాగుతున్న సహకార సమరంపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామోహన్‌రెడ్డిలు దృష్టి పెట్టారు. ఇటీవల మున్సిపల్‌ ఎన్నికల్లో అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న గులాబీ దళం ఈ సహకార ఎన్నికల్లోను గులాబీ జెండా ఎగురవేయాలని టీఆర్‌ఎస్‌ పట్టుదలతో ఉంది. ఈ మేరకు ఇప్పటికే ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు సహకారంలో వ్యవహరించాల్సిన వ్యూహంపై  మంత్రి సింగిరెడ్డితోపాటు ఎమ్మెల్యేలు దిశా.. నిర్దేశం చేశారు. జిల్లాలోని 15 సొసైటీలకు గాను ఇప్పటికే  రేచింతల సొసైటీలోని స్థానాలన్ని ఏకగ్రీవం చేసుకుని గులాబీ పార్టీ జయకేతనం ఎగుర వేసింది. మిగితా సొసైటీల్లోను ఇదే ఒరవడితో టీఆర్‌ఎస్‌ పోటీదారులు ఉత్సాహంగా సహకార సమరంలో ముందుకు వెళుతున్నారు.


logo