గురువారం 02 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 11, 2020 , 00:36:27

పది రోజుల్లో పరిష్కరించాలి

పది రోజుల్లో  పరిష్కరించాలి

వనపర్తి, నమస్తే తెలంగాణ : ప్రజావాణి ద్వారా స్వీకరించిన దరఖాస్తులను పది రోజుల్లోగా పరిష్కరించాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా జిల్లా అధికారులను ఆదేశించారు. నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటి ప్రజావాణి కావడంతో సోమవారం జిల్లా అధికారులు అంతంత మాత్రమే హాజరయ్యారు. దాదాపు 15 మంది జిల్లా అధికారుల స్థానంలో రెండో స్థాయి వారు హాజరుకావడంతో కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కింది స్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతోనే కలెక్టరేట్‌కు వస్తారని, ఇక్కడ కూడా కింది స్థాయి సిబ్బందే వస్తే సమస్య ఎలా పరిష్కారం అవుతుందని, జిల్లా అధికారులకు సమస్యలు ఎలా తెలుస్తాయని సీరియస్‌ అయ్యారు. ప్రజావాణికి ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లా అధికారులు హాజరుకావాలని, మీరు వెళ్లి అధికారులను పంపించడంటూ ఆదేశాలు జారీ చేయడంతో ఒక్కొక్కరిగా దాదాపు 15 మంది కింది స్థాయి సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అరగంటలోగా జిల్లా అధికారులు ప్రత్యక్షమయ్యారు. జిల్లా కేంద్రంలోని కలెక్టట్‌ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణికి ఉదయం 10:15 గంటలకే జిల్లా అధికారులందరూ హాజరుకావాలని, అనుకోని పరిస్థితుల్లో మాత్రమే కింది స్థాయి అధికారులను పంపించాలని సూచించారు. దరఖాస్తుదారుడిని పిలిపించుకుని అర్థవంతమైన సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. ప్రజావాణి దరఖాసుల్తపై తాను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటానని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వినతులను వేగవంతంగా పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, జిల్లా అధికారులు హాజరయ్యారు. 


logo
>>>>>>