గురువారం 02 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 10, 2020 , 00:35:10

ఆర్డీఎస్‌ ఆనకట్ట పటిష్టతకు చర్యలు

ఆర్డీఎస్‌ ఆనకట్ట పటిష్టతకు చర్యలు

అయిజ : కర్ణాటకలోని ఆర్డీఎస్‌ ఆనకట్ట స్థితిగతులపై తెలుసుకు నేందుకు ఇరిగేషన్‌ అధికారులు కదిలారు. నిజాం కాలంలో నిర్మించిన ఆర్డీఎస్‌ ఆనకట్టను పటిష్టం చేయకపోవడంతో ఆనకట్ట శిథిలావస్థకు చేరుకుంటుండటంతో ఇరిగేషన్‌ అధికారులు కేఆర్‌ఎంబీ అధికారులకు నివేదికను అందించేందుకు పరిశీలన చేసింది. శనివారం సాయంత్రం ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టుల సీఈ అనంతరెడ్డి, పీజేపీ ఎస్‌ఈ రఘునాథరావు, కర్ణాటక ఎస్‌ఈ రమేశ్‌, ఆర్డీఎస్‌ ఈఈ శ్రీనివాసులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఎస్‌ ఆనకట్ట ఆధునీకరణలో భాగంగా పెండింగ్‌లో ఉన్న ప్యాకేజీ -1, ఆర్డీఎస్‌ ప్రధాన కాల్వ ఆధునీకరణ ప్యాకేజీ - 2 పనులపై సీఈ అనంతరెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత పదేళ్లుగా ఆర్డీఎస్‌ ఆధునీకరణ పనులు పెండింగ్‌లో ఉండటానికి కారణాలు అడిగి తెలుసుకున్నట్లు ఆర్డీఎస్‌ ఏఈ ఆంజనేయులు తెలిపారు. త్వరలో కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు సమావేశం జరుగనుండటంతో ఆ సమావేశంలో ఆర్డీఎస్‌ ఆధునీకరణ పనులపై వివరించనున్నట్లు పేర్కొన్నారు. ఆర్డీఎస్‌ ఆనకట్టను పటిష్టం చేయకపోతే ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయని, ప్యాకేజీ -1 పనులు రివైజ్‌ చేసి, ఆధునీకరణ పనులు చేపట్టడంతో పాటు ఆనకట్ట పటిష్టం చేయాల్సిన అవరం ఉందని సీఈ అభిప్రాయం వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. ఆయన వెంట కర్ణాటక ఏఈ శాంతరాజు, టీవో భాస్కర్‌ తదితరులు ఉన్నారు. 

నీటి విడుదలకు టీబీ బోర్డుకు ఇండెంట్‌ 

తెలంగాణ రాష్ట్రంలోని అలంపూర్‌ నియోజక వర్గంలోని ఆర్డీఎస్‌ ఆయకట్టులో యాసింగిలో సాగు చేసిన ఆరుతడి పంటలకు సాగునీరు అందించేందుకు టీబీ డ్యాం ద్వారా నీరు విడుదల చేయాలని టీబీ బోర్డుకు ఇండెంట్‌ పెట్టినట్లు ఏఈ ఆంజనేయులు తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 1.537 టీఎంసీల నీటిని కేసీ కెనాల్‌ ఇండెంట్‌తోపాటు టీబీ డ్యాం నుంచి నీరు విడుదల చేయాలని ఈఎన్‌సీ మురళీధర్‌ లేఖ ద్వారా తుంగభద్ర బోర్డుకు తెలిపినట్లు పేర్కొన్నారు. మొదట నాలుగు రోజుల పాటు 2,500 క్యూసెక్కులు, 6 రోజులు 1300 క్యూసెక్కులు విడుదల చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. కేసీ కెనాల్‌, ఆర్డీఎస్‌ జాయింట్‌ ఇండెంట్‌ను విడుదల చేయడం వల్ల అటు కర్నూల్‌ జిల్లాతో పాటు, జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్‌ తాలూకాలోని ఆర్డీఎస్‌ ఆయకట్టుకు సాగునీరు అందుతుందని ఆయన తెలిపారు. 


logo