మంగళవారం 31 మార్చి 2020
Wanaparthy - Feb 09, 2020 , 03:07:55

ముగిసిన నామినేషన్లు

ముగిసిన నామినేషన్లు

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సహకార సంఘం ఎన్నికల్లో తొలిఘట్టం నామినేషన్ల పర్వం ముగిసింది. మూడు రోజుల పాటు కొనసాగిన సహకార డైరెక్టర్‌ స్థానాలకు నామినేషన్లను పోటాపోటీగా అభ్యర్థులు దాఖలు చేశారు. శనివారంతో ఈ ప్రక్రియకు తెరపడింది. జిల్లాలో 15 సహకార సంఘాలున్నాయి. వీటిలో 195 డైరెక్టర్‌ స్థానాలున్నాయి. ఈనెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు డైరెక్టర్‌ స్థానాలకు నామినేషన్లు వేసుకునేందుకు గడువు ఇచ్చారు. ఇందుకోసం జిల్లాలో మెజార్టీ స్థానాల్లో పోటీ చేసేందుకు చివరి రోజు అభ్యర్థులు పరుగులు తీశారు. తొలి రోజు అంతంత మాత్రంగా నామినేషన్లు వేయగా, రెండు, మూడో రోజుల్లో అధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి.

మొత్తం 700 నామినేషన్లు..

జిల్లాలోని సహకార సంఘాలకు నామినేషన్లు అధికంగానే వచ్చాయి. 195 డైరెక్టర్‌ స్థానాలకు గాను 700 నామినేషన్లు వచ్చాయి. వీటిలో మొదటి రోజు 66 నామినేషన్లు వస్తే.. రెండో రోజు 188, చివరి రోజున ఏకంగా 446 నామినేషన్లను వేశారు. ఇలా 15 సొసైటీల వారీగా నమోదైన నామినేషన్లను పరిశీలిస్తే.. అత్యల్పంగా రేచింతలలో 27 నామినేషన్లు రాగా, అత్యధికంగా కొత్తకోటలో 66 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇదిలా ఉంటే, పెబ్బేరు సహకార సంఘంలోని 3, 10వ వార్డుల నుంచి ఒకే నామినేషన్‌ దాఖలయ్యాయి. దీంతో నామినేషన్ల పరిశీలన అనంతరం ఈ రెండు డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది.

నేడు నామినేషన్ల పరిశీలన

జిల్లాలోని ఆయా సొసైటీల వారీగా దాఖలైన నామినేషన్ల పరిశీలన ఆదివారం కొనసాగుతుంది. అత్యధికంగా దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో అధికారులు వీటి పరిశీలనకు ప్రాధాన్యనిస్తున్నారు. సహకార నిబంధనల మేరకు వీటిని పరిశీలన చేసి సాయంత్రం తుది జాబితాను ప్రకటిస్తారు. ఇక సోమవారం ఉపసంహరణలకు గడువు ఉంది. వీటి అనంతరం చివరి జాబితాను ప్రత్యేక అధికారులు ప్రకటిస్తారు. ఇదిలా ఉంటే, అన్నదాతకు బాసటగా నిలిచే సహకార సంఘాల పీఠాలను కైవసం చేసుకునేందుకు ఆయా పార్టీల నాయకులు సన్నద్ధమయ్యారు. నామినేషన్లు వేసిన వారిలో మాజీ చైర్మన్‌లు, యువతి, యువకులు, పదవులను ఆశిస్తున్న నాయకులు, గతంలో ఓటమి చెందిన వారు ఇప్పుడు మళ్లి సహకారంలో నామినేషన్లు వేశారు. మండల స్థాయిలో పదవులు దక్కని వారు కూడా తీవ్రంగానే పోటీలు పడుతున్నారు. ఇక ఈ ఎన్నికలు ముగిసిన అనంతరం ఎలాంటి ఓట్ల సందడి లేకపోవడంతో ఇవే చివరి ఎన్నికలుగా భావించి ఆశావాహులు తమ ప్రయత్నాలను తీవ్రతరం చేస్తున్నారు. ఒక్కొక్క సంఘంలో 13 డైరెక్టర్‌ స్థానాలుండగా, మెజార్టీ స్థానాలను దక్కించుకుని చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ స్థానాలను కైవసం చేసుకునేందుకు పక్కా ప్రణాళికలు చేస్తున్నారు.

రేచింతల 27 నామినేషన్లు, శ్రీరంగాపురం 44 నామినేషన్లు, తూంకుంట 48 నామినేషన్లు, వనపర్తి 38 నామినేషన్లు, గోపాల్‌పేట 41 నామినేషన్లు, పెద్దమందడి 60 నామినేషన్లు, ఖిల్లాఘణపురం 59 నామినేషన్లు, పాన్‌గల్‌ 53 నామినేషన్లు, కొప్పునూరు 52 నామినేషన్లు, ఆత్మకూరు 62 నామినేషన్లు, నాగవరం 43 నామినేషన్లు, రాజనగరం 27 నామినేషన్లు, కొత్తకోట 66 నామినేషన్లు, రామకృష్ణాపురం 39 నామినేషన్లు, పెబ్బేరు 41 నామినేషన్లు వేయగా జిల్లా మొత్తంగా  700 నామినేషన్లు అభ్యర్థుల నుంచి వచ్చాయి.


logo
>>>>>>