శనివారం 28 మార్చి 2020
Wanaparthy - Feb 09, 2020 , 03:05:44

నులి పురుగులను నిర్మూలిద్దాం

నులి పురుగులను నిర్మూలిద్దాం

వనపర్తి వైద్యం : నులిపురుగులను నిర్మూలిద్దామని, ఇందుకు గాను తప్పనిసరిగా నివారణ మాత్రలను వేయించాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని డీఎంహెచ్‌వో శ్రీనివాసులు ఆధ్వర్యంలో శనివారం వనపర్తి ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల మైదానం నుంచి నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. రాజీవ్‌ చౌక్‌, న్యూబస్టాండ్‌, వివేకనందా చౌరస్తాల మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నులిపురుగుల కారణంగా పిల్లలో శారీరక, మానసిక ఎదుగుదల తగ్గిపోతుందన్నారు. 19 ఏళ్లలోపు ఉన్న 1.05 లక్షల మంది పిల్లలకు తప్పనిసరిగా ఆల్బెండజోల్‌ మాత్రలను వేయించాలని కోరారు. ఇకటి నుంచి రెండేళ్ల లోపు పిల్లలకు సగం మాత్రల పంపిణీకి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూ పొందించామన్నారు. నులిపురుగులు ఉన్న పిల్లలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతారని, రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి లేకపోవడం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, అతిసారం, బరువు తగ్గుట వంటి సమస్యలు వస్తాయన్నారు. గోర్లను శుభ్రంగా, చిన్నవిగా ఉంచుకోవడం, పరిశుభ్రమైన నీటిని తాగడం, ఆహారాన్ని కప్పి ఉంచడం, పండ్లు, కూరగాయలు శుభ్రంగా కడిగి తినటం, భోజనానికి ముందు, మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవడం వంటివి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో డీఐవో డాక్టర్‌.శంకర్‌, హెచ్‌ఈ మద్దిలేటి, నరసింహా రావు, తాసిల్దార్‌ రాజేందర్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo