సోమవారం 06 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 07, 2020 , 00:51:43

తొలి రోజు 66 నామినేషన్లు

తొలి రోజు 66 నామినేషన్లు
  • అత్యధికంగా ఖిల్లాలో 15
  • 3 సింగిల్‌విండోల్లో నిల్‌
  • రేపటితో ముగియనున్న గడువు
  • వేడెక్కుతున్న ‘సహకార’ రాజకీయం
  • నామినేషన్‌ కార్యక్రమంలో మంత్రి సింగిరెడ్డి


వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సహకార ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలోని 15 సహకార సంఘాల్లో 195 డైరెక్టర్ల స్థానాలకు నామినేషన్లు వేశారు. మొదటి రోజు 13 సొసైటీల పరిధిలో 66 నామినేషన్లు దాఖలయ్యాయి. ఖిల్లా ఘనపురం సొసైటీ పరిధిలో అత్యధికంగా 15 నామినేషన్లు దాఖలయ్యాయి. కొప్పునూరు, తూంకుంట, రాజనగరం సొసైటీల్లో తొలిరోజు ఒక్క నామినేషన్‌ రాలేదు. రామకృష్ణాపురం సహకార సంఘం నామినేషన్ల ప్రక్రియలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. కొన్ని సంఘాల్లో సరైన అభ్యర్థులు లేక ఆయా పార్టీల నాయకులు వేట మొదలుపెట్టారు. రెండురోజుల్లో నామినేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. గ్రామాల్లో సహకారం ఎన్నికల వేడి మొదలైంది. ఈ ఎన్నికల్లో 45వేల 673 మంది సభ్యులు ఓటు వేయనున్నారు. 


సహకార ఎన్నికల సమరంలో భాగంగా తొలిరోజు నామినేషన్లు  ప్రా రంభమయ్యాయి. జిల్లాలోని 15 సహకార సంఘాలకు గాను 12 సొసైటీల నుంచి అభ్యర్థులు నామినేషన్లు వేశా రు. ఇంకా మూడు సొసైటీల నుంచి నామినేషన్ల ప్రక్రి య మొదలు కాలేదు. సహకార ఎన్నికల్లో పోటీ చేయిం చే అభ్యర్థుల కోసం ఆయా పార్టీల నాయకులు వేటను కొనసాగిస్తున్నారు. తొలిరోజు నామినేషన్ల దాఖలులో శ్రీరంగాపురంలో 2 నామినేషన్లు వేయగా, ఖిల్లాఘణపురంలో 15 నామినేషన్లు అధికంగా వేశారు. ఇక మిగిలిన కేంద్రాల్లో నామమాత్రంగా దాఖలయ్యాయి. జిల్లా లో మొత్తం 195 డైరెక్టర్‌ స్థానాలుండగా, కొన్ని చోట్ల నుంచి మాత్రమే నామినేషన్లు తొలిరోజు దాఖలయ్యా యి. చిన్నంబాయి మండలం కొప్పునూరు, వీపనగండ్ల మండలం తూంకుంట, వనపర్తి మండలం రాజనగరం సంఘాల నుంచి ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలే దు. కొత్తకోట మండలం రామకృష్ణాపురం సొసైటీ పరిధిలోని పామాపురం గ్రామం నుంచి డైరెక్టర్‌గా పోటీ చేసిన వాసుదేవారెడ్డి నామినేషన్‌ దాఖలు సందర్భంగా మంత్రి నిరంజన్‌ రెడ్డి హాజరయ్యారు. వాసుదేవారెడ్డి స్వయాన మంత్రి అక్క కొడుకు కావడంతో మంత్రి నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.


మరో రెండు రోజులు..

తొలిరోజు నామినేషన్లు అంతంత మాత్రంగా వచ్చిన క్రమంలో రెండు, మూడు రోజుల్లో అత్యధికంగా నామినేషన్లు దాఖలవుతాయని అంచనా వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కేవలం ఒకటి రెండు, వార్డుల నుంచి మాత్రమే నామినేషన్లు వచ్చాయి. ఇంకా మెజార్టీ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు వేయాల్సి ఉంది. 15 సొసైటీల్లో లక్షా 37వేల 335మంది సభ్యులున్నారు. వారిలో 45 వేల 673 మంది ఓటర్లున్నారు. మూడు రోజుల నామినేషన్ల గడువులో ఒక్కరోజు ముగిసిపోగా, మరో రెండు రోజులు ఉంది. చివరి రోజే అధికంగా నామినేషన్లు దాఖలు చేస్తారనే అంచనా ఉంది. సహకార ఎన్నికల వ్యవహారం ఇప్పుడిప్పుడే వేడెక్కుతోంది. నామినేషన్ల పర్వం ముగిస్తే ఇంకాస్త వేగం పుంజుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం డైరెక్టర్ల కోసం సరియైన అభ్యర్థుల ఎంపిక చేసే పనులకు నాయకులు ప్రాధాన్యతనిస్తున్నారు.


అభ్యర్థుల కోసం వేట

సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం ఆయా పార్టీల నాయకులు వేట ప్రారంభించారు. నామినేషన్ల ప్రక్రియ షురూ అయినా ఇంకా పలుచోట్ల అభ్యర్థులు ఖరారు కాలేదు. అందుకే మొదటి రోజు నామినేషన్ల దాఖలు అంతంత మాత్రంగా ఉన్నాయి. సహకార ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి అంతగా లేకపోయినా, నాయకుల ఒత్తిళ్లమేరకు అభ్యర్థులకు ముందుకు రాక  తప్పడం లేదు. ఉత్సాహం ఉన్న వారికి ఓటు హక్కు లేకపోవడంలాంటి చర్యలతో నాయకులు సరియైన అభ్యర్థుల కోసం వేటను కొనసాగిస్తున్నారు. గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రిజర్వేషన్లు కలిసిరాని ఆశావహులు ప్రస్తుతం కొన్ని చోట్ల పోటీ చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇప్పటి వరకు ఆయా సొసైటీలకు అధ్యక్షులుగా కొనసాగిన వ్యక్తులు సహితం మళ్లీ తమకే చైర్మన్‌ అవకాశం ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని సొసైటీల్లో ఈ పరిస్థితి కూడా పునరావృతమవుతుంది.


logo