గురువారం 02 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 06, 2020 , 02:43:30

కొత్త రైళ్లు లేవు

కొత్త రైళ్లు లేవు

మహబూబ్‌ నగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కొత్త రైళ్లు, రైల్వే లైన్లు వస్తాయని ఉమ్మడి జిల్లా వాసులు బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఒక్క కొత్త రైలు కానీ, రైల్వే లైన్‌ కానీ ఇవ్వని కేంద్రం ఇప్పటికే కొనసాగుతున్న పనులకు మాత్రం నిధులనిచ్చింది. కొత్తగా ఏమీ ఇవ్వకపోయినా ఉన్న లైన్లను డబ్లింగ్‌ చేసేందుకు, విద్యుదీకరణకు ప్రాధాన్యం దక్కింది.  


ఊహించని విధంగా అకోలా- డోన్‌ డబ్లింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

మహబూబ్‌ నగర్‌- కాచిగూడ డబ్లింగ్‌ పనులు దాదాపుగా పూర్తి కావచ్చిన తరుణంలో మహారాష్ట్రలోని అకోలా నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని డోన్‌ వరకు డబ్లింగ్‌ కోసం రూ.6260 కోట్ల భారీ ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో ఇప్పటికే చేపట్టిన ఫలక్‌నుమా-మహబూబ్‌ నగర్‌ డబ్లింగ్‌ 85 కిలోమీటర్లు మినహాయిస్తే... 541 కి లోమీటర్ల పనులు చేపట్టాల్సి ఉంటుంది. అకోలా-పూర్ణ-ముద్ఖేడ్‌-నిజామాబాద్‌- బొల్లారం-కాచిగూడ-మహబూబ్‌ నగర్‌- గద్వాల-కర్నూ లు- ఢోన్‌ వరకు ఈ మార్గం ఉంటుంది. భారీ బడ్జెట్‌ ప్రతిపాదించిన ఈ రైల్వే లైన్‌ కోసం ప్రతి కిలోమీటర్‌కు 10కోట్ల మేర కేటాయించారు. 


మన్మాడ్‌- ముద్ఖేడ్‌- డోన్‌ విద్యుదీకరణకు రూ. 50కోట్లు

మన్మాడ్‌ నుంచి ముద్ఖేడ్‌ మీదుగా డోన్‌ వరకు ఉన్న రైల్వే లైన్‌ను రూ. 865 కోట్లతో విద్యుదీకరించేందుకు నిర్ణయించారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఇందుకు రూ.50కోట్లను విడుదల చేశారు. ముద్ఖే డ్‌ నుంచి నిజామాబాద్‌, కాచిగూడ, మహబూబ్‌ నగర్‌, గద్వాల, కర్నూలు, డోన్‌ వరకు రైల్వే లైన్‌ విద్యుదీకరణ పనులు జరుగనున్నాయి. ఈ పను లు పూర్తయితే ఈ మార్గంలో పూర్తిగా కరంటు రైళ్లు నడిచేందుకు అవకాశం ఏర్పడుతుంది.   


ఫలక్‌నుమా-మహబూబ్‌ నగర్‌కు రూ. 185 కోట్లు..

కాచిగూడ- డోన్‌ సెక్షన్‌లో ఉన్న ఫలక్‌నుమా-మహబూబ్‌ నగర్‌ మధ్య 85 కి.మీ మేర డబ్లింగ్‌, వి ద్యుదీకరణ పనులు ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్నాయి. 2015-16 బడ్జెట్‌లో రూ. 774 కోట్ల అంచనాతో చేపట్టిన ఈ పనులకు ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 185 కోట్లు కేటాయించారు. షాద్‌నగర్‌-గొల్లపల్లి మధ్య సుమారు 30 కి.మీ మేర ఇప్పటికే పనులు పూర్తికావచ్చాయి. మిగతా పనులు సైతం వేగంగా సాగుతున్నాయి. అక్కడక్కడ అం డర్‌ టన్నెళ్లు, వంతెనల నిర్మాణం ఉన్న చోట ప నులు నెమ్మదిగా జరుగుతున్నాయి. గత బడ్జెట్‌లో రూ. 200కోట్లు విడుదల చేయగా... ఈ ఏడాది విడుదల చేసిన రూ. 185 కోట్లతో పెండింగ్‌ పనులు అన్నింటినీ చేపట్టి పూర్తి చేయాల్సి ఉంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ లైన్‌ పనులు పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మా ల్యా ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తు తం విడుదలైన నిధులతో పనులు పూర్తి చేసేందుకు అవకాశం ఏర్పడింది. డబ్లింగ్‌, విద్యుదీకర ణ పనులు పూర్తయితే హైదరాబాద్‌ నుంచి మహబూబ్‌ నగర్‌కు డెమో, ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌లు, ప్యాసెంజర్‌ రైళ్లను పెంచేందుకు అవకాశం ఏర్పడనుంది. 


మునీరాబాద్‌-మహబూబ్‌నగర్‌కు రూ. 140కోట్లు ..

కర్ణాటకలోని మునీరాబాద్‌ నుంచి రాయిచూరు మీదుగా దేవరకద్ర వరకు జరుగుతున్న 243 కి.మీ. రైల్వే లైన్‌ కోసం ఈ బడ్జెట్‌లో రూ. 140 కోట్లు కేటాయించారు. ఇప్పటికే దేవరకద్ర నుంచి మక్తల్‌ మండలం జక్లేర్‌ వరకు 29 కి.మీ మేర ఇ ప్పటికే పనులు పూర్తయి రైళ్లు కూడా తిరుగుతున్నాయి. భూసేకరణ ఆలస్యం వల్ల పనులు కాస్త మందగించినా ఇటీవలే పుంజుకున్నాయి. 243 కి.మీ.కు గాను దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 66 కి.మీ పనులు జరుగుతున్నాయి. దక్షిణమధ్య రైల్వే పరిధిలో రూ. 452 కోట్ల పనులు జరుగుతున్నాయి. 1997-98లో మంజూరైన ఈ లైన్‌ రూ. 1723 కోట్ల అంచనాతో పనులు ప్రారంభమయ్యాయి. మిగతా పనులు హుబ్లీ కేంద్రంగా ఉన్న నైరుతి రైల్వే పరిధిలో ఉన్నాయి. జక్లేర్‌-మక్తల్‌, మాగనూరు- కృష్ణా మధ్య పనులు ప్రస్తుతం వే గంగా సాగుతున్నాయి. ప్రస్తుతం రూ.140 కోట్లు కేటాయించినందున పనులు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది.


గద్వాల-రాయిచూరు ఎలక్ట్రిఫికేషన్‌కు రూ. 10కోట్లు..

దశాబ్దం కిందటే పూర్తయినా కేవలం ఒక్క రైలు నడిచేందుకు మాత్రమే పరిమితమైన గద్వాల- రాయచూరు రైల్వే లైన్‌ ను విద్యుదీకరించాలనే ఆలోచన వచ్చింది రైల్వే శాఖకు. అస్సలు పట్టించుకోని ఈ మార్గానికి కనీసం రూ. 10కోట్లు విడుదల చేసి స్థానికుల్లో ఆశలు రేకెత్తించారు. కర్నూ లు- గద్వాల మీదుగా గతంలో ముంబయి వరకు ప్రతిపాదనల్లో ఉన్న రైలును ఇప్పుడైనా ప్రారంభిస్తే బాగుండేదని స్థానికులు పేర్కొంటున్నారు.


కర్నూలు కోచ్‌ మిడ్‌లైఫ్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌కు రూ. 30కోట్లు..

జోగులాంబ గద్వాల జిల్లా సరిహద్దుల్లో 280 ఎకరాల్లో నిర్మించేందుకు ప్రతిపాదించిన రైల్వే కోచ్‌ మిడ్‌లైఫ్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌ (బోగీల మరమ్మతు కేంద్రం) కోసం రూ. 30 కోట్లు విడుదల చేశారు. ఆలంపూర్‌ మండలం సరిహద్దుల్లో ఉన్న ఈ కేంద్రం ప్రతిపాదిత ప్రదేశంలో తెలంగాణకు చెందిన 20 ఎకరాల భూమి కూడా ఉంది. ఈ కేంద్రంలో లక్ష కి.మీ. తిరిగిన ప్రతి బోగీ పరిస్థితిని సమీక్షించి అవసరమైన మరమ్మతులు చేయనున్నారు. ఈ సెంటర్‌ వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. 


భద్రతకే ప్రాధాన్యం..

ఈ రైల్వే బడ్జెట్‌లో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. అన్ని కాపలాలేని రైల్వే గేట్లను దశలవారీగా మూసేస్తున్నారు. వాటి స్థానంలో అండర్‌ పాస్‌లను ఏర్పాటు చేస్తున్నారు. కొత్త ఆర్వోబీలు, ఆర్‌యుబీలను సైతం పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికుల సదుపాయాలకు ఈ బడ్జెట్‌లో భారీగానే కేటాయింపులు జరిపారు. రూ. 672 కోట్లను మన జోన్‌ పరిధిలో సదుపాయాలకు కేటాయించారంటేనే అర్థం చేసుకోవచ్చు. 


పోరాటం కొనసాగుతుంది

ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా పరిధిలో పలు కొత్త రైల్వే లైన్ల కోసం ఆశించాం. ఇప్పటికే కేంద్ర రైల్వే మంత్రిని కలిసి వినతి పత్రాలు సమర్పించాం. వారి నుంచి సానుకూల స్పందనే వచ్చింది. కానీ యాద్గిర్‌- ఖమ్మం, గద్వాల- మాచర్ల, కృష్ణా- వికారాబాద్‌ తదితర రైల్వే లైన్ల ఏర్పాటుకు నిధులు ఇవ్వకపోవడం నిరాశ పర్చింది. అయినా పోరాటం ఆపం. బడ్జెట్‌పై జరిగే సెషన్స్‌లో వీటిపై ప్రశ్నిస్తాం. 

- మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, ఎంపీ, మహబూబ్‌ నగర్‌


రాష్ట్రం వాటా అడుగుతున్నారు

గద్వాల- మాచర్ల రైల్వే లైన్‌ చేపట్టాలనేది ఈ ప్రాంత వాసుల చిరకాల వాంఛ. దీనిపై అనేకమార్లు కేంద్ర రైల్వే మంత్రిని కలిసి పరిస్థితిని వివరించాం. నాగర్‌ కర్నూలు, వనపర్తి వంటి కొత్త జిల్లా కేంద్రాలకు రైల్వే సదుపాయం కల్పించే లైన్‌ ఇది. అయినా బడ్జెట్‌లో ఈ లైన్‌ ఊసేలేదు. అయితే రాష్ట్రం 50 శాతం భరిస్తే ఈ లైన్‌ పనులు చేపైట్టేందుకు కేంద్రం అంగీకరిస్తామంటోంది. వెనకబడిన ప్రాంతాల్లో కూడా జాయింట్‌ వెంచర్‌ ప్రతిపాదన ఆశ్చర్యం కలిగిస్తోంది. పార్లమెంట్‌లో ఈ లైన్‌ కోసం గళమెత్తుతాం. 

- పోతుగంటి రాములు, ఎంపీ, నాగర్‌ కర్నూలు


logo