బుధవారం 08 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 05, 2020 , 00:32:31

సస్యరక్షణ చర్యలు పాటించండి

సస్యరక్షణ చర్యలు పాటించండి

పెద్దమందడి : వరిసాగులో సస్యరక్షణ చర్యలు పాటించి రైతులు అధిక దిగుబడులు పొందాలని అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ రిసోర్స్‌ డాక్టర్‌ అవిల్‌కుమార్‌ అన్నారు. మంగళవారం మండలంలోని బలిజపల్లి, జంగమాయిపల్లి, మోజర్ల, మద్దిగట్ల తదితర గ్రామాల్లో రైతులు సాగు చేసిన వరిని జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్‌రెడ్డి, శాస్త్రవేత్తలో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అవిల్‌కుమార్‌ మాట్లాడుతూ జంగమాయిపల్లి, బలిజపల్లి గ్రామాల్లో సాగుచేసిన పంటలలో జింక్‌ లోపం ఉన్నట్లు గుర్తించామన్నారు. కావున రైతులు వరిచేలల్లో నీటిని ఎక్కువగా నిల్వ ఉంచరాదని, ఆరబెట్టుకుంటూ నీటిని పారించాలని, జింక్‌ సల్ఫెడ్‌ను వారానికి రెండుసార్లు పిచికారి చేసి ఎకరా పొలానికి సగం బస్తా యూరియాను చల్లుకుంటే తెగుళ్ల బారి నుంచి బయటపడతాయని అన్నారు. మోజర్ల, మద్దిగట్ల గ్రామాల్లో పంటలకు అగ్గి తెగులు వ్యాపించిందని, వాటి నివారణకు ట్రైసైకోజెల్‌ 120 గ్రా, ఐసోపోటోనిల్‌ 200 ఎంఎల్‌, కాస్గనైసిల్‌ 300 ఎంఎల్‌ను వారంలో మార్చి మార్చి పిచికారి చేయాలని సూచించారు. 


ఈ తెగుళ్లు 30-45 రోజుల వయస్సు ఉన్నప్పుడు సోకుతుందని చెప్పారు. ముదురు ఆకులపై మచ్చలు రావడం, మచ్చ మధ్యలో తెల్లని రంగు కలిగి ఉంటే తెగుళ్లు సోకినట్లు గుర్తించాలన్నారు. తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు చేను అంచుల నుంచి మాడిపోయినట్లు అవుతుందని చెప్పారు. రైతులు ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు కృష్ణ, రామకృష్ణ, టెక్నికల్‌ ఏవో రవికుమార్‌, మండల వ్యవసాయ అధికారి మల్లయ్య, వ్యవసాయ విస్తీరణ అధికారి రజిని, యుగంధర్‌, చెన్నరాయుడు, ఆయా గ్రామల రైతులు తదితరులు ఉన్నారు. 


logo