శనివారం 04 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 03, 2020 , 23:59:03

పాలనపై మొహంతి మార్క్‌

పాలనపై మొహంతి మార్క్‌

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నూతన జిల్లా ఏర్పడినప్పటి నుంచి కలెక్టర్‌ శ్వేతామొహంతి తనదైన మార్క్‌ ప్రదర్శించారు. వివిధ కార్యక్రమాల అమలులో జిల్లాలో పర్యటిస్తూ ఎక్కడికక్కడ అలర్ట్‌ చేస్తూ వచ్చా రు. వైద్య, ఆరోగ్యశాఖలో భారీ మార్పులు తీసుకువచ్చారు. ప్రభుత్వ దవాఖానల్లో కాన్పులు జరగని పరిస్థితి నుంచి నిత్యం కాన్పులు జరిగే పరిస్థితులను తీసుకురాగలిగారు. హరితహారం అమలులో కఠినంగా వ్య వహరించారు. ఏ గ్రామీణ స్థా యి రోడ్డును పరిశీలించినా హరితహారం మొక్కలు స్వాగతం ప లికేలా చేశారు. కింది స్థాయిలో బాధ్యతల నిర్వహణకు కఠిన చర్యలు తీసుకోవడంలోనూ వెనకాడలేదు. కలెక్టర్‌ వస్తున్నారంటే అధికారులకు, సిబ్బందికి గుండె దడ పుట్టించేలా పాలనపై పట్టు సాధించారు. కేవలం కార్యాలయానికి పరిమితం కాకుండా క్షేత్రస్థాయి పరిశీలనకు ప్రాధాన్యతనివ్వడంతో జిల్లా అధికార యంత్రాంగంలో ఒకరకమైన మార్పు వచ్చేలా దోహదపడింది. 

మహిళా సాధికారత దిశగా..

జిల్లాలో మహిళలు సాధికారత సాధించే దిశగా కలెక్టర్‌ శ్వే తామొహంతి పలు చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా మహిళలు కాన్పుల్లో పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈడీడీ (ఎగ్జామ్‌ డేట్‌ ఆఫ్‌ డెలివరీ) కార్యక్రమాన్ని క్రమ పద్ధతిలో అమలు చేయించారు. ప్రభు త్వ, ప్రైవేట్‌ దవాఖానల్లో శిశుమరణాలను పూర్తి గా తగ్గించడంలో తమదైన ముద్ర వేశారు. సిజేరియన్‌ ఆపరేషన్లకు పూర్తిగా చెక్‌ పెట్టించారు. సర్కార్‌ దవాఖానల్లో సాధారణ కాన్పులు జరిగేలా చర్యలు తీసుకున్నారు. సమత అనే కార్యక్రమం ద్వారా మహిళల్లో హిమోగ్లోబిన్‌ లోపం, ఐరన్‌ సక్రమంగా లేకపోవడంలాంటి చర్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. అంగన్‌వాడీల్లో ఇంగ్లీష్‌ మీడియం అమలును విజయవంతంగా నిర్వహించారు. ధరణి కార్యక్రమం అమలులో రాష్ట్ర స్థాయిలోనే ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చారు. భూ రికార్డుల ప్రక్షాళన నుంచి పల్లె ప్రగతి వరకు ఆయా పథకాల అమలులో కలెక్టర్‌ మార్క్‌ చూపించారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులను సమన్వయం చేయడంలోనూ సక్సెస్‌ సాధించారు. 

హైదరాబాద్‌కు బదిలీ..

జిల్లా కలెక్టర్‌గా పూర్తి స్థాయిలో పని చేసిన శ్వేతామొహంతి హైదరాబాద్‌ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. దాదాపు ఏడాది నుంచి బదిలీ అవుతారని తరచూ ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఇక కలెక్టర్‌ బదిలీ అవుతారని గుసగుసలు వినిపించాయి. కఠినంగా వ్యవహరించనప్పుడల్లా కలెక్టర్‌ బదిలీ చర్చకు వచ్చేది. 

కలెక్టర్‌ కూడా పలు బహిరంగ సమావేశాల్లో తన బదిలీ గురించి చర్చించి ఇప్పుడే వెళ్లను అంటూ అందరినీ ఆశ్చర్యానికి లోను చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవల ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో అనేక మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఇందులో భాగంగా శ్వేతామొహంతిని హైదరాబాద్‌ కలెక్టర్‌గా బదిలీ చేయడంతో సోమవారం ఆమె రిలీవ్‌ అయ్యారు.


logo