బుధవారం 08 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 03, 2020 , 23:56:32

వేరుశనగ సిరి..

వేరుశనగ సిరి..

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : వ్యవసాయ మా ర్కెట్‌ యార్డులో ఎటు చూసిన వేరుశనగ రాసులే కనిపిస్తున్నాయి. వేరుశనగ పంటల సిరి రైతులను మురుపిస్తుంది. ప్రాజెక్టుల నీటితో పెరిగిన సాగుబడుల పుణ్యమా అంటూ ధాన్యరాసులు కళకళలాడుతున్నాయి. పరదేశాలకు వలసలు వెళ్లే ప్రజలు గడచిన రెండు, మూడేళ్లుగా పంటల మొఖం చూస్తున్నారు. వర్షాలు అంతంత మాత్రమే ఉన్నా కృష్ణానదికి వరదలు రావడంతో ఎంజీకేఎల్‌ఐ, బీమా ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు పుష్కలంగా రైతాంగానికి అందింది. తద్వారా యాసంగిలో వేరుశనగ పంటల సిరి కనిపిస్తున్నది. జిల్లా వ్యాప్తంగా యాసంగిలో వేరుశనగను 50వేల హెక్టార్లలో సాగు చేశారు. కాలువల నీళ్లు అనుకూలంగా ఉన్నందున ముందస్తుగా బుడ్డల పంటను సాగు చేశారు. సమృద్ధిగా నీళ్లు అందడంతో రైతులు కూడా నమ్మకంగా సాగుబడులు చేసుకున్నా రు. గతంలో యాసంగికి నీటి ఎద్దడులు ఎదరయ్యే పరిస్థితి ఉండేది. ఈ ఏడాది అలాంటి ఘటనలు వేరుశనగకు ఎదురుకాలేదు. దీంతో అన్ని ప్రాంతాల్లోను రైతులు విస్తారంగా వేరుశనగ పంటను సాగు చేశారు.

లక్షా 82వేల క్వింటాళ్లు

జిల్లా వ్యవసాయ మార్కెట్‌ యార్డులో వేరుశనగ కొనుగోళ్లు జోరుమీదున్నాయి. ఇప్పటి వరకు 1,82,694 క్వింటాళ్ల వేరుశనగ కొనుగోలు జరిగింది. ఇంకాను మ రో నెల వరకు వేరుశనగ మార్కెట్‌ వచ్చే అవకాశం ఉందని మార్కెట్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. కాలువల నీటి ప్రవాహం ఇప్పటికి ఉన్నందునా ఇంకా వేరుశనగ పంట మార్కెట్‌ రావచ్చనే అభిప్రాయానికి వస్తున్నారు. వేరుశనగకు ధర క్వింటాళుకు రూ.4800 నుంచి రూ.5వేల వరకు కొనుగోళ్లు జరుగుతున్నాయి. సరుకుల నాణ్యతలను బట్టి ధరలు కొంత అటు.. ఇటుగా నడుస్తున్నాయి. రెండేళ్లుగా మార్కెట్‌కు వేరుశనగ ఇదే తీరున వస్తున్నది. దేశంలోనే వనపర్తి వేరుశనగ సాగులో అధిక ప్రాధాన్యతను సంతరించుకున్న ది. నవంబర్‌లో 16వేల క్వింటాళ్లు, డిసెంబర్‌లో 56 వేల క్వింటాళ్లు, జనవరిలో లక్షా 10 వేల క్వింటాళ్ల వ రకు వేరుశనగ ధాన్యం మార్కెట్‌ యార్డుకు వచ్చింది. 

మూడు నెలలుగా కొనుగోళ్లు

జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మూడు నెలలుగా వేరుశనగ కొనుగోళ్లు జరుగుతున్నాయి. గతంలో జనవరి నెలలో ప్రారంభమయ్యే వేరుశనగ కొనుగోళ్లు ఈ ఏడాదిలో నవంబర్‌లోనే మార్కెట్‌కు బుడ్డల పంట రావడం ప్రారంభమైంది. ఇలా నవంబర్‌, డిసెంబర్‌, జనవరి నెలల్లో కొనుగోళ్లు జోరుగా సాగాయి. ఇంకాను ఫిబ్రవరి చివరి వరకు వేరుశనగ పంట మార్కెట్‌కు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఒక్కొక్క రోజు 2వేల క్వింటాళ్ల నుంచి 10 వేల క్వింటాళ్ల వరకు యార్డుకు వేరుశనగ క్రమంగా వచ్చిన పరిస్థితులున్నాయి. 

దిగుబడి ఆశాజనకమే

యాసంగిలో భారిగా సాగు చేస్తున్న వేరుశనగ పంటల దిగుబడులు గతంతో పోల్చితే ఓ మోస్తరుగా వచ్చాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. కేవలం బోరు బావులపైనే ఆధారపడ్డ రైతులు ఇప్పుడు నదుల నీటి పారుదలకు అవకాశం రావడంతో పంటల దిగుబడులు పెంచుకునే దిశగా ప్రయత్నిస్తున్నారు. 4ఏళ్ల కిందట ఎకరా వేరుశనగ సాగులో కేవలం 5 లేదా 6 క్వింటాళ్లు మాత్రమే వచ్చేది. ఇదిలా ఉంటే, ఇప్పుడు ప్రాజెక్టుల నీళ్లు పుష్కలంగా రావడంతో వేరుశనగకు 6 తడుల వరకు నీటిని పెడుతున్నారు. దీంతో ఎకరాకు ఆరు నుంచి ఎనిమిది క్వింటాళ్ల వరకు దిగుబడులు వచ్చినట్లు రైతులు పేర్కొంటున్నారు. ఇలా వేరుశనగ పంట దిగుబడులు కూడా రెండేళ్లుగా ఆశాజనకంగా కనిపిస్తున్నాయి.


logo