గురువారం 02 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 01, 2020 , 01:41:45

‘సహకార’ కసరత్తు

‘సహకార’ కసరత్తు
  • బిజీబిజీగా అధికారులు రిజర్వేషన్లు, ఓటరు జాబితాలపై దృష్టి
  • ప్రతి సొసైటీలో 13 మంది డైరెక్టర్లు
  • రేపు సాయంత్రం వరకు సిద్ధం
  • సభ్యత్వాలు పొంది ఏడాది పూర్తయితేనే ఓటు

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లా సహకార శాఖ అధికారులు ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లపై బిజీ బిజీగా అయ్యారు. రాష్ట్ర సహకార ఎన్నికల అథార్టీ నుంచి నోటిఫికేషన్‌ వెలువడడంతో అవసరమైన చర్యలపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. ఫిబ్రవరి 3వ తేదీన ప్రతి సహకార సంఘానికి కేటాయించిన ప్రత్యేక అధికారి అక్కడి ఎన్నికపైన నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. ఈ క్రమంలోనే ఓటర్లు, డైరెక్టర్ల రిజర్వేషన్ల వివరాలన్నింటిని విడుదల చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా పరిధిలో 15 పూర్వపు సహకార సంఘాలున్నాయి. వీటి పరిధిలోనే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి.


ప్రతి సొసైటీలో 13 మంది డైరెక్టర్లు

ప్రతి సహకార సంఘంలో 13 మంది డైరెక్టర్లు ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ లెక్కన జిల్లాలోని 15 సొసైటీలలో 195 మంది డైరెక్టర్లుగా ఎంపికయ్యే అవకాశం ఉంది. గతంలో ఉన్న సభ్యుల సంఖ్య గుర్తించిన ఓటర్ల వివరాలన్నింటిని మరోసారి క్షణ్ణంగా పరిశీలనకు వస్తున్నాయి. ప్రతి డైరెక్టర్లకు 200 నుంచి 300 వరకు ఓట్లు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం రెండు రోజుల నుంచి డైరెక్టర్ల స్థానాలు, ఓటరు జాబితా, రిజర్వేషన్ల వివరాలపైనే పరిశీలన చేస్తున్నారు. జిల్లా సహకార శాఖ అధికారులు, సిబ్బంది జిల్లా కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియపై కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో రిజర్వేషన్లు, ఓటరు జాబితాలు సిద్ధం చేసేలా పనుల్లో నిమగ్నమయ్యారు.


ఏడాది సభ్యత్వం ఉంటేనే..

సహకార సంఘాల్లో సభ్యత్వం పొంది ఏడాదైన వారికి మాత్రమే సొసైటీల్లో ఓటు హక్కు ఉంటుంది. జిల్లాలో గత ఏడాదిలో మొత్తం 15 సొసైటీల్లో లక్ష 37 వేల మంది సభ్యులున్నారు. ఇక ఓటర్ల పరంగా చూస్తే.. 52,800 పైచిలుకు ఓటర్లు జిల్లాలో అప్పట్లో ఉన్నారు. ప్రస్తుతం ఈ సంఖ్యకు మరో రెండు వేల ఓటర్లు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 


గత రిజర్వేషన్లు మారే అవకాశం

గతంలో ఉన్న సహకార సంఘాల రిజర్వేషన్లు కొంతమేర మారవచ్చనే అంచనా ఉంది. ఆయా సంఘాల్లో కొత్తగా చేరిన సభ్యుల వివరాలను బట్టి ఈ రిజర్వేషన్లలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ప్రతి సొసైటీ వారీగా ప్రస్తుతం ఉన్న ఓటర్ల సంఖ్య అధారంగానే రిజర్వేషన్లు నిర్ణయం అవుతాయి. ఒక్కొక్క సొసైటీలో 13మంది మొదలుకుని 300 వరకు కొత్త సభ్యులు చేరినట్లు అంచనా ఉంది. ఈ లెక్కలను పరిగణలోకి తీసుకుని కొత్త ఓటర్ల జాబితా, రిజర్వేషన్లు ప్రకటిస్తారు. అయితే, పెబ్బేరు, ఆత్మకూరు, పాన్‌గల్‌, కొప్పునూరు సొసైటీల్లో 5 వేల వరకు ఓటర్లు ఉన్నారు. ఈ పెద్ద సంఘాల్లో ఒక్కొ డైరెక్టర్‌కు దాదాపు 550 వరకు ఓటర్లుండి పెద్ద సంఘాలుగా గుర్తింపు ఉంది. అలాగే చిన్న సొసైటీల్లో ఒక్కొ డైరెక్టరుకు 50 నుంచి 100లోపు కూడా ఓటర్లు ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, 2013 జనవరి, ఫిబ్రవరి నెలల్లో రెండు దఫాలుగా సహకార సంఘాలకు ఎన్నికలు జరిగాయి. వీటి పదవీ కాలం 2018 వరకు ముగిసిన క్రమంలో ఇన్‌చార్జి కమిటీల ఆధ్వర్యంలో పనులను కొనసాగిస్తూ వచ్చారు. 


logo