మంగళవారం 07 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 31, 2020 , 03:11:04

‘సహకార’ నగారా

‘సహకార’ నగారా
  • విడుదలైన నోటిఫికేషన్‌
  • ఓటు హక్కు వినియోగించుకోనున్న 1.37లక్షల మంది సభ్యులు
  • 15 విండోల పరిధిలో ఎన్నికలు
  • గ్రామాల్లో వేడెక్కనున్న రాజకీయం

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సహకార ఎన్నికల నగారా మోగింది. ఇటీవల మున్సిపల్‌ ఎన్నికల సమరం ముగిసిన నేపథ్యంలో ఇక మిగిలిన సహకార సంఘాల ఎన్నికలను సహితం పూర్తి చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ మేరకు గురువారం స్టేట్‌ కోఆపరేటివ్‌ ఎలక్షన్‌ అథారిటీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఫిబ్రవరి 3న ఆయా సంఘాల ప్రత్యేక అధికారులు ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేసే విధంగా సహకార సంఘాల ఎన్నికలకు శ్రీకారం చుట్టారు. ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు నామినేషన్లు వేయడం, పరిశీలన, ఉపసంహరణలు ఉంటాయి. ఫిబ్రవరి 15న  పోలింగ్‌, అదే రోజు కౌటింగ్‌ నిర్వహించేలా ఆదేశాలను జారీ చేశారు.


జిల్లాలో 1.37 లక్షల మంది సభ్యులు..

జిల్లా వ్యాప్తంగా ఉన్న 15 సహకార సంఘాల్లో దాదాపు లక్షా 37 వేలకు పైగా సభ్యులున్నట్లు అంచనా ఉంది. అయితే, వాటిలో మార్పులు ఉండే అవకాశం లేకపోలేదు. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్న సందర్భంగా అదేరోజు ఈ సభ్యుల జాబితా కూడా ప్రత్యేక అధికారులు విడుదల చేయనున్నారు. స్టేట్‌ కోఆపరేటివ్‌ ఎలక్షన్‌ అథారిటీ నిర్ణయం ప్రకారం సంఘాల్లో ఉన్న సభ్యుల జాబితా విడుదల కాబోతోంది. 


పాత సహకార సంఘాలకే ఎన్నికలు..

ప్రతి మండలంలో రెండు సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కొత్త జీవోను ప్రవేశ పెట్టింది. మూడు నెలల క్రితం నుంచి ఈ ప్రక్రియపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. అయితే, ఈ జీవోను ప్రస్తుతం ప్రభుత్వం రద్దు చేసింది. గతంలో ఉన్న పాత సహకార సంఘాల స్థానంలోనే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో కొత్త సంఘాల ప్రస్తావన ప్రస్తుతం రద్దు కాగా, పాత సంఘాల స్థానంలోనే ఎన్నికలకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో 15 సహకార సంఘాలున్నాయి. కొత్త సంఘాలు ఏర్పాటు చేయాలని తలపెట్టిన జీవో నెంబర్‌ 45ను పూర్తిగా రద్దు చేసి, పాత సంఘాలకే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 


జిల్లాలో ఎన్నికలు నిర్వహించే పాత సహకార సంఘాలు..

1)ఆత్మకూరు 2) ఖిల్లాఘణపురం 3)శ్రీరంగాపురం 4) పెద్దమందడి 5) పాన్‌గల్‌ 6) పెబ్బేరు 7) రేచింతల(ఆత్మకూరు) 8)గోపాల్‌పేట 9)తూంకుంట(వీపనగండ్ల) 10) నాగవరం(వనపర్తి) 11) రాజనగరం(వనపర్తి) 12) కొప్పునూరు(చిన్నంబావి) 13) కొత్తకోట 14) రామక్రిష్ణాపురం(మదనాపురం) 15) వనపర్తి 
logo