సోమవారం 06 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 30, 2020 , 01:59:07

పేద విద్యార్థులకు భోజనం

 పేద విద్యార్థులకు  భోజనం
  • వేతనాల నుంచి వెచ్చిస్తున్న ఉపాధ్యాయులు
  • చేయూతనందిస్తున్న 9 మంది అధ్యాపకులు
  • ఉత్తమ ఫలితాల సాధనకు 30 రోజుల కార్యాచరణ
  • వనపర్తి ప్రభుత్వ కళాశాలలో ప్రత్యేక తరగతులు

వనపర్తి విద్యావిభాగం: బాపూజీ సూచించిన 1937లో బేసిక్‌ విద్య విధానం రూపకల్పనలో భాగంగానే భారతదేశంలో వొకేషనల్‌ కోర్సులు ప్రారంభమయ్యాయి. తాను చదివిన చదువు జీవితంలో అనుభవ పాఠాలను అందించడం, గ్రామీణ స్థాయిలో అన్ని రంగాల్లో నైపుణ్యాలు కలిగిన నిపుణులను తయారు చేసేందుకే ఇంటర్‌ విద్యలో వొకేషనల్‌ కోర్సులను ప్రారంభించారు. అందులో భాగంగా వనపర్తి ప్రభుత్వ కళాశాలలో వొకేషనల్‌ కోర్సులలో పాత కోర్సులతోపాటు కొత్త కోర్సులను ప్రవేశపెట్టి విద్యాబోధన చేస్తున్నారు. బోధనతోపాటు మెరుగైన ఫలితాలు సాధించేందుకు గ్రామీణ పేద విద్యార్థులను చదువులో ప్రోత్సహించేందుకు వొకేషనల్‌ అధ్యాపకులు తమ ఔదార్యాన్ని చాటుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కళాశాల జూన్‌లో ప్రారంభమైనప్పటికీ పరీక్షల సమయం ఆసన్నం కావడంతో పేద విద్యార్థుల చదువుకు తోడ్పాటునిచ్చేందుకు కళాశాలలోనే తమ సొంత వ్యయంతో మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో మొత్తం 9 కోర్సులకు గాను 450 మంది వొకేషనల్‌ విద్యార్థులు ఉండగా వారిలో కనీసం 250 నుంచి 300 మందికి మధ్యాహ్న భోజనాన్ని అందించి చదువులు సాఫీగా సాగేలా 30 రోజుల ప్రణాళిక కార్యాచరణను అమలు చేస్తున్నారు. దీంతో వందశాతం ఫలితాలు సాధించేందుకు ఎంతగానో ఉపయుక్తం కానుంది. 

ప్రణాళిక అమలు ఇలా..

జనవరి 2 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు 30 రోజులపాటు ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు విద్యార్థులు కళాశాలలోనే ఉండేలా ప్రణాళిక రూపొందించి బోధన సాగిస్తున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కళాశాలకు ఉదయం వేళ అర్ధాకలితో వచ్చి సాయంత్రం వరకు ఉండి చదువుకోవడం కష్టసాధ్యమైంది. ఈ తరుణంలో వొకేషనల్‌  అధ్యాపకులందరూ ఒక సమాలోచన చేసి తనవంతు బాధ్యతగా ప్రతి అధ్యాపకుడు రూ.4 నుంచి రూ.5వేల చొప్పున 19మంది అధ్యాపకులు వెచ్చించి మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందిస్తున్నారు. విద్యార్థులు ఉదయం 9:30గంటలకు కళాశాలకు వచ్చి సాయంత్రం 5:00 గంటల వరకు తరగతి గదులు, స్టడీ అవర్స్‌, రోజుకు 5 ఆంశాలను నేర్చుకుని అప్పగించి వెళ్లాల్సి ఉంటుంది. అలా 30రోజుల పాటు ఇదే ప్రణాళికను అమలు చేస్తున్నారు. 

కళాశాలలో కోర్సులు ఇలా..

కళాశాలలో మెకానికల్‌, ఆటో మొబైలింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌ టెక్నిక్‌ తదితర కోర్సులు ఉన్నప్పటికీ మారుతున్న కాలానికి అనుగుణంగా నిర్మాణ రంగంలో ఉండే సర్వే, బిల్డింగ్‌ ప్లానింగ్‌, పబ్లిషింగ్‌ , ప్లానింగ్‌ అంచనా కోర్సులు, ఆటోమొబైల్‌ రంగంలో కార్లు, మోటార్‌సైకిల్‌ సర్వీసింగ్‌ సెంటర్లు, మెకానికల్‌ రంగంలో వర్క్‌షాపులు, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నిషియన్స్‌, మల్టీ పర్పస్‌ హెల్త్‌ వర్కర్స్‌ (నర్సు కోర్సు) ఈటీ (ఎలక్ట్రికల్‌ టెక్నీషీయన్‌), ప్రీ స్కూల్‌ టీచర్‌ ట్రెయినింగ్‌ ద్వారా పూర్వ ప్రాథమిక పాఠశాలలో ఉద్యోగాలు పొందేందుకు అవకాశాలు, అదేవిధంగా ఓఏ (ఆఫీస్‌ అకౌంటెంట్‌) తదితర కోర్సులను కళాశాలలో నిర్వహిస్తున్నారు.  ఈ రెండేళ్ల కాలపరిమితి కోర్సుల అనంతరం వివిధ కంపెనీలతో ఒప్పందం చేసుకొని ఉద్యోగాలు పొందేలా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. అదేవిధంగా సొంత గ్రామాలలో కూడా కార్లు, మోటార్‌ సైకిల్స్‌, హెల్త్‌ సెంటర్స్‌, కంప్యూటర్‌ టెక్నాలజీ, వైరింగ్‌, అంగన్‌వాడీ కేంద్రాలలో ఉపాధి పొందేందుకు అవకాశాలు ఉన్నాయి. 


logo