సోమవారం 30 మార్చి 2020
Wanaparthy - Jan 29, 2020 , 01:26:38

సమన్వయంతో సాగుదాం

సమన్వయంతో సాగుదాం

వనపర్తి ప్రతినిధి,నమస్తే తెలంగాణ: అధికారులు,ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ లోకనాథ్‌ రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తిలోని ఎంవైఎస్‌ పంక్షన్‌ హా ల్‌లో నిర్వహించిన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి లోకనాథ్‌ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ, మండల స్థాయిలో సమస్యలను ప్రజా ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకురావాల ని, అదేవిధంగా అధికారులు జెడ్పీటీసీలు, ఎంపీపీలు గు ర్తించిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నట్లయితే సమస్యలకు తక్షణ పరిష్కారం దక్కుతుందని చైర్మన్‌ పేర్కొన్నారు. కొన్ని మండలాల్లో నిర్వహించే మండల స్థాయి సమావేశాలకు అధికారులు హాజరుకావడం లేదని సభలో కొందరు ప్రజా ప్రతినిధులు సమావేశం దృష్టికి తీసుకు వ చ్చారు. దీనిపై చైర్మన్‌ స్పందిస్తూ అధికారులు తప్పనిసరి మండల, జిల్లా స్థాయి సమావేశాలకు హాజరుకావాలన్నారు. అప్పుడే జెడ్పీ, మండల సమావేశాలకు అర్థం ఉంటుందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు నిధులను కేటాయించినట్లుగానే మండల పరిషత్‌లకు కూడా నిధులు కేటాయించాలని పలువురు ఎంపీపీలు సమావేశంలో లేవనెత్తారు. అయితే, దీనిపైనా చైర్మన్‌ మాట్లాడుతూ నిధుల కేటాయింపు అంశం రాష్ట్రస్థాయిలో ఉందని, త్వరలోనే ఇందుకు పరిష్కారం ఉంటుందని, ఎంపీపీలు, జెడ్పీటీసీలు అధైర్యపడాల్సిన అవసరం లేదని చైర్మన్‌ చెప్పారు. ఈ సమావేశంలో ముందుగా విద్యాశాఖపై జరిగిన  చర్చలో వెల్టూరు పీఎస్‌కు మరమ్మతులు చేయాలని జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి కోరారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవణాల స్థానంలో కొత్తవి మంజూరు చేయాలని, ఉపాధ్యాయులు  లేనిచోట వలంటీర్లను ఇవ్వాలని, శ్రీరంగాపురం మం డలంలో బాలురు, బాలికలకు వేర్వేరుగా పాఠశాలలు నిర్వహించాలని జెడ్పీటీసీ రాజేంద్ర ప్రసాద్‌ కోరారు. పాన్‌గల్‌ మండలంలో ప్రవేశాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని జెడ్పీ కో -ఆప్షన్‌ సభ్యుడు మునీరుద్దీన్‌ కోరారు. చిన్నంబాయి మండలంలో కేజీబీవీ భవనాన్ని  త్వరగా ప్రారంభించడంతోపాటు పాఠశాలలకు వలంటీర్ల పోస్టులను మంజూరు చేయాలని, ఆత్మకూరు మండలం జూరాలలో పాఠశాల భ వనం శిథిలావస్థకు చేరుకున్నదని, అలాగే ఖిల్లాఘణపురం, కొత్తకోట, పెద్దమందడి మండలాలల్లోను అనేక పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయని, వాటి స్థానంలో కొత్త భవనాలు మంజూరు చేయాలని ఆయా మండలాల జెడ్పీటీసీలు వెంకట్రావమ్మ, శివరంజని, సామ్యానాయక్‌, రఘుపతి రెడ్డి, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ వామన్‌ గౌడ్‌ డీఈవో దృష్టికి తెచ్చారు. దీనిపై డీఈవో సుశీందర్‌ రావు మాట్లాడుతూ.. కొత్త పాఠశాల భవనాల విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పా రు. రైతుబంధు పథకం  కింద జిల్లాలోని రైతులందరికి నిధులివ్వాలని, సిరిధాన్య పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని శ్రీరంగాపురం జెడ్పీటీసీ రాజేంద్రప్రసాద్‌ కోరారు. మండలాల్లోని ఏవోలు, ఏఈవోలు విధులు సక్రమంగా నిర్వహించడంలేదని, కేవలం ల్యాబ్‌ట్యాబ్‌ల్లోనే మీకు నివేదికలు ఇస్తున్నారని పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి చెప్పారు. చిన్నంబాయి మండలంలో అకాల వర్షాలతో 550 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ఇందుకు నష్ట పరిహారం రైతులకు అందించాలని జెడ్పీటీసీ వెంకట్రావమ్మ కోరారు. అలాగే ఘణపురం మండలంలో గణపసముద్రం నింపడంతో 650 ఎకరాల పంటలు నీటి మునిగాయని, వీరికి కూడా పరిహారం ఇవ్వాలని జెడ్పీటీసీ సామ్యానాయక్‌ కోరారు. అయితే, పంటనష్ట పరిహారం ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడం జరిగిందని డీఏవో సుధాకర్‌ రెడ్డి సభకు వివరించారు. పశుసంవర్ధక శాఖ చర్చలో  విజయ డైరీపై విస్తృత ప్రచారం కల్పించాలని, ప్రమాదవశాత్తు గొర్రెల కాపార్లు చనిపోతే బీమా ఇవ్వాలని, పశుసంవర్ధక శాఖల ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని పలువురు సభ్యులు కోరారు. రేవల్లి మండలంలో పశువుల దవాఖాన భవనం శిథిలావస్థలో ఉన్నందునా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ భవనం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, వెంట నే కొత్త భవణంలోకి మార్చాలని జెడ్పీటీసీ కోరారు. గ్రామీణాభివృద్ధి శాఖ చర్చలో ఆసరా పింఛన్లు అప్‌డేట్‌ కావడం లేదని వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి, వాటర్‌ షెడ్‌ పథకం ద్వారా భూగర్భజలాలు పెరిగే అవకాశం ఉన్నందునా అన్ని మండలాల్లో ఈ పథకాన్ని చేపట్టాలని పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు కోరారు. పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌, గనుల శాఖలపై చర్చలో ప్ర భుత్వ పనులకు ఇసుక సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతున్నదని ఎంపీపీ మేఘారెడ్డి లేవనెత్తారు. అన్‌లైన్‌ కాకుండా గ్రామ పంచాయతీ ద్వారా నేరుగా ప్రభుత్వ పనులకు ఇసుక వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నా రు. ఇసుక రవాణాకు దరఖాస్తులు చేసుకున్న ప్రతి ట్రాక్టర్‌ యజమానికి అవకాశం కల్పించాలని ఎంపీపీ కిచ్చారెడ్డి కోరారు. జిల్లాలో ప్రభుత్వ పనులకు ఇసుక కొరత తీవ్రంగా ఉన్నందున త్వరలోనే దీనిపై మైనింగ్‌ అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సభ్యులంతా ఏకగ్రీవంగా నిర్ణయించారు. 


logo