సోమవారం 30 మార్చి 2020
Wanaparthy - Jan 29, 2020 , 01:25:30

పారిశుధ్యంపై అవగాహన కల్పించాలి

పారిశుధ్యంపై అవగాహన కల్పించాలి

పాన్‌గల్‌ : పల్లెప్రగతితోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, ఇందుకు గాను ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం అవసరమని ఫ్లయింగ్‌ స్కాడ్‌ రాష్ట్ర కో ఆపరేటివ్‌ సొసైటీ కమిషనర్‌ వీరబ్రహ్మయ్య అన్నారు. మంగళవారం మండలంలోని తెల్లరాళ్లపల్లి, చింతకుంట గ్రామాలను జిల్లా సహకార సొసైటీ అధికారి కోదండరాములు, ఎంపీడీవో సాయిబ్రిందతో కలిసి పర్యటించారు. ఆయా గ్రామాల్లో మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు, మురుగు కాలువలు, వననర్సరీ కేంద్రాలు, శ్మశానవాటిక, అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు తదితర అభివృద్ధి పనులపై ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెల్లరాళ్లపల్లి నర్సరీలో పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. చింతకుంటలో సర్పంచ్‌ అనూష, ఎంపీటీసీ రమాదేవి, వార్డు మెంబర్ల పాలకమండలి సభ్యులతో మాట్లాడారు. అంటువ్యాధులు ప్రబలకుండా ప్రతి ఇంటిముందు ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. తడి, పొడిచెత్తను వేరుచేసి డంపింగ్‌యార్డుల్లో వేయాలని కోరారు. సంపూర్ణ పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వయోజన విద్యాకేంద్రాల ద్వారా అక్షరాస్యతను పెంపొందించాలని అధికారులను ఆదేశించారు. రెండోవిడత పల్లెప్రగతిలో చేపట్టిన పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఈవోఆర్డీ రామస్వామి, సర్పంచులు అనూష, రేణమ్మ, ఎంపీటీసీ రమాదేవి, టీఆర్‌ఎస్‌ నాయకులు తిరుపతయ్య, రవీందర్‌గౌడ్‌, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


logo