శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 28, 2020 , 04:44:30

మేస్త్రీలు వర్సెస్‌ కూలీలు

మేస్త్రీలు వర్సెస్‌ కూలీలు

జడ్చర్ల రూరల్‌ : రోజు కూలీకి వచ్చే కూలీలు.. వారికి పనికల్పించే మేస్త్రీలు ఇద్దరు పరస్పర దాడులు చేసుకుని పోలీసు స్టేషన్‌కు చేరిన సంఘటన సోమవారం జడ్చర్ల పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే జడ్చర్ల మేస్త్రీ సంఘం సభ్యులు ఇటీవల కొత్త కమిటీలను ఎన్నుకున్నారు. కాగా నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన కొందరు కూలీలు రోజు కూలీ కోసం జడ్చర్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ సమీపంలోని భీమయ్య హోటల్‌ వద్ద సమూహంగా ఏర్పడి దొరికిన పనులకు వెళ్తున్నారు. పనివాళ్లు సరిగ్గా దొరకపోవడంతో కొందరు మేస్త్రీలు, చిన్న చిన్న పనులు చేయించుకునే ఇంటి యజమానులు అక్కడి నుంచే వాళ్లను తీసుకెళ్లి పనులు చేయించుకుంటున్నారు. అయితే ఇతర జిల్లా నుంచి వచ్చినవారు పట్టణంలో కూలీల ధరలను ఆడమనిషికి రూ.400, పారగాడికి రూ.600, మేస్త్రికి రూ.800 వసూలు చేయడంతో  స్థానికుల నుంచి మేస్త్రీలకు వ్యతిరేకత మొదలైంది. దీంతో వారు కూలీల రేట్లను ఆడమనిషికి రూ.330, పారగాడికి రూ.430, మేస్త్రీకి రూ.550 నిర్ణయించి పట్టిక వేయించి బ్యానర్లు కట్టారు. దీంతో కొందరు కూలీలు ఆ బ్యానర్లను సోమవారం చించివేయడంతో మేస్త్రీల సంఘం నాయకులు మాట్లాడేందుకు పిలిపించారు. దీంతో పరస్పరం మాటలు పెరిగి కొందరు కూలీలు ఆవేశంతో మేస్త్రీల మీద చేయి చేసుకొని ఒకరికొకరు తోపులాట చేసుకున్నారు. దీంతో కొందరు కూలీలు పోలీసు స్టేషన్‌ ముందు హంగామా చేస్తూ ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. కూలీల ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని సీఐ వీరస్వామి తెలిపారు.logo