సోమవారం 30 మార్చి 2020
Wanaparthy - Jan 27, 2020 , 03:56:56

త్రివర్ణ రెపరెలు

త్రివర్ణ రెపరెలు

జిల్లాలో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది.. ఆదివారం అన్ని గ్రామాలు, పట్టణాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకొన్నారు.. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో కలెక్టర్‌ శ్వేతామొహంతి జాతీయ జెండాను ఆవిష్కరించారు.. వేడుకల్లో ఎస్పీ అపూర్వరావు, జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి, జేసీ వేణుగోపాల్‌, ట్రైనీ కలెక్టర్‌ సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి కోసం పునరంకితమై పనిచేద్దామని పిలుపునిచ్చారు.. అభివృద్ది కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.. సాగునీటి వనరులతో సాగు గణనీయంగా పెరిగిందన్నారు.. పల్లె ప్రగతితో గ్రామాలు స్వయం సమృద్ధి సాధిస్తున్నాయని చెప్పారు.. గ్రామానికో నర్సరీ ఏర్పాటు చేసి ‘హరితహారం’ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నామని వివరించారు..

  • జిల్లాలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
  • పాలిటెక్నిక్‌ కళాశాలలో కలెక్టర్‌ జెండావిష్కరణ
  • అభివృద్ధికి పునరంకితమవుదాం
  • సబ్సిడీపై చేపపిల్లల పంపిణీ
  • ప్రాజెక్టుల నీటితో పెరిగిన సాగు
  • ‘పల్లె ప్రగతి’తో స్వయం సమృద్ధి
  • భవిష్యత్‌ తరాల కోసమే హరితహారం : కలెక్టర్‌ శ్వేతామొహంతి

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లా అభివృద్ధి కోసం పునరంకితమై పని చేద్దామంటూ కలెక్టర్‌ శ్వేతామొహంతి పిలుపునిచ్చారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్‌ ఆకాంక్షించారు. అహర్నిశలు విధి నిర్వహణ పట్ల అంకితభావంతో పని చేసి జిల్లాను అగ్రభాగాన నెలబెడతామని, ఇందుకు ప్రజలు సహకరించాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో కలెక్టర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి, ఎస్పీ అపూర్వరావు, జేసీ వేణుగోపాల్‌, ట్రైనీ కలెక్టర్‌ సంతోశ్‌, పట్టణ పుర ప్రముఖులు, జిల్లా అధికారులు హాజరయ్యారు. 


జాతీయ పతకావిష్కరణ అనంతరం కలెక్టర్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల నివేదికను  వివరించారు. జిల్లాలో సాగునీటి వనరులు అనూహ్యంగా పెరిగాయని, వ్యవసాయమే ప్రధాన వనరుగా ఉన్న జిల్లాలో  జూరాల, బీమా, ఎంజీకేఎల్‌ఐ ప్రాజెక్టుల ద్వారా సాగునీటి వసతులు ఏర్పడ్డాయన్నారు. వీటిలో జూరాల ద్వారా జిల్లాలో 69,975 ఎకరాలకు వానాకాలం సాగునీరందించామని, అలాగే  భీమా ద్వారా 120 చిన్ననీటిపారుదల చెరువులను నింపడం జరిగిందన్నారు. భీమా కాలువల ద్వారా 53,300 ఎకరాలకు సాగునీరు ఇచ్చామని, ఎంజీకేఎల్‌ఐ ద్వారా ప్యాకేజీ 28లో 27,827 ఎకరాలు, ప్యాకేజీ 29 ద్వారా 16,250 ఎకరాలకు వానాకాలంలో సాగునీరందించినట్లు కలెక్టర్‌ చెప్పారు. అయితే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, ఎంజీకేఎల్‌ఐ ప్రాజెక్టుల పరిధిలో 17,407 ఎకరాల భూసేకరణ చేసి 483కోట్ల రూపాయలను చెల్లించామన్నారు.


పల్లె ప్రగతితో స్వయం సమృద్ధి

ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాలు స్వయం సమృద్ధి సాధిస్తున్నాయని కలెక్టర్‌ చెప్పారు. స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడంతోపాటు ప్రజల ఆరోగ్యం పెంపుదల లక్ష్యంగా  ప్రభుత్వం వినూత్నంగా పల్లెప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి అద్బుతమైన ఫలితాలను రాబట్టిందన్నారు. 8407 చోట్ల  మురికి కంప చెట్ల తొలగింపు, 2327 పురాతన శిథిల భవనాల తొలగింపు జరిగిందని, 3015 ఖాళీ స్థలాలు, 703 ప్రభుత్వ స్థలాలను శుభ్రం చేసినట్లు  చెప్పారు. 695 వంగిపోయిన, 332 తుప్పు పట్టిన, 545వ విరిగి పోయిన విద్యుత్‌ స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశామన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌ను కొనుగోలు చేసినట్లు చెప్పారు. రెవెన్యూ స్థలాల్లో 2,55,706 మొక్కలు, కమ్యూనిటీ స్థలాల్లో 7,88,684 మొక్కలు, ఇన్సిట్యూషన్‌లలో 49వేల మొక్కలు నాటామన్నారు. అలాగే జిల్లాలో మత్స్య సంపద  అభివృద్ధికి చెరువులు, కుంటలు బాగా ఉపయోగపడుతున్నాయన్నారు. 2019-20లో వంద శాతం సబ్సిడీతో 400 చెరువుల్లో కోటీ 79 లక్షల 36వేల చేప పిల్లల విత్తనాలను ఉచితంగా వదలామన్నారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో ఉన్న సభ్యులకు ఉపయోగం జరుగుతుందని కలెక్టర్‌ చెప్పారు.


ప్రతి గ్రామానికి నర్సరీ

భవిష్యత్‌ తరాల కోసమే తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకున్నదని కలెక్టర్‌ చెప్పారు. 2020-21కి సంబంధించి 255 నర్సరీల ద్వారా టేకు, పండ్ల మొక్కలు, ఈత, తులసి మొక్కలతోపాటు ఇతర నీడనిచ్చే మొక్కల పెంపకం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 2019-20లో 24 లక్షల 57వేల మొక్కలు ఇప్పటి వరకు నాటడం జరిగిందన్నారు. గతంలో మాదిరి కాకుండా గ్రామాల్లో ప్రజల డిమాండ్‌ మేరకు మాత్రమే నర్సరీల్లో మొక్కలు పెంచడం జరుగుతుందన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, ఉపాధి హామీ, పశు సంవర్దక శాఖ, విద్యాశాఖ, మార్కెటింగ్‌, పేదరిక నిర్మూలన సంస్థ, విద్యుత్‌, పంచాయతీ రాజ్‌ ఇంజినీరింగ్‌ శాఖ, రహదారులు, భవనాల శాఖ, వైద్య, ఆరోగ్య శాఖ, షెడ్యూల్‌ కులాల సంక్షేమం, గిరిజన సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధిని కలెక్టర్‌ వివరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏఎస్పీ షాకిర్‌ హుస్సేన్‌, ఆర్డీవో చంద్రారెడ్డి, డీఎస్‌పీ కిరణ్‌ కుమార్‌, జిల్లా అధికారులు గణేశ్‌, రాజేశ్వరి, రవీందర్‌ రెడ్డి, సువర్ణసింగ్‌, రజినీకాంత్‌ రెడ్డి, డీపీఆర్‌వో వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ లక్ష్మయ్య, గొర్రెల కాపర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్‌ పాల్గొన్నారు.


logo