ఆదివారం 24 మే 2020
Wanaparthy - Jan 26, 2020 , 05:41:19

టీఆర్‌ఎస్‌ జయభేరి

 టీఆర్‌ఎస్‌ జయభేరి
  • -నాలుగు చోట్ల గుబాళించిన గులాబీ
  • -అమరచింతలో హంగ్‌
  • -టీఆర్‌ఎస్‌కు 47 వార్డులు
  • -12 వార్డులతో సరిపెట్టుకున్న బీజేపీ
  • -కాంగ్రెస్‌కు 11, టీడీపీకి రెండు వార్డులు

జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రశాంతంగా ముగిసింది.. ఐదు మున్సిపాలిటీలోని ఆయా లెక్కింపు కేంద్రంలో శనివారం ప్రక్రియ పూర్తి చేశారు.. 80 వార్డులకు గాను ఒక్క వార్డు స్థానానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. దీంతో 79 వార్డులకు కౌంటింగ్‌ చేశారు.. ఇందులో వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు బల్దియాలు టీఆర్‌ఎస్‌ కైవసమయ్యాయి. అమరచింతలో ఓటర్లు భిన్నంగా తీర్పునిచ్చారు.. ఏ పార్టీకి పూర్తి ఆధిక్యత రాలేదు. టీఆర్‌ఎస్‌ మాత్రం మూడు వార్డు స్థానాలు చేజిక్కించుకుంది.. ఆత్మకూరులోని 1వ వార్డు బ్యాలెట్‌ బాక్స్‌లో 5వ వార్డు బ్యాలెట్‌ పత్రాలు రావడంతో కొంతసేపు వివాదం జరిగింది. ఎన్నికల కమిషన్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయాన్ని ఖరారు చేస్తూ డిక్లరేషన్‌ ఇచ్చారు.. జిల్లాలోని 79 వార్డుల్లో 47 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ జయభేరి మోగించింది. కేవలం 12 వార్డుల్లో బీజేపీ, 11 వార్డుల్లో కాంగ్రెస్‌ గెలుపొందింది. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వ్యూహం ఫలించింది.

- వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ
వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల్లో ఊహించినట్లుగానే టీఆర్‌ఎస్‌ విజయభేరి మోగించింది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించగా, నాలుగు మున్సిపాలిటీల వార్డుల్లో అధిక్యం సాధించి గులాబీ దళం కైవసం చేసుకున్నది. ఇక అమరచింతలో ఏ పార్టీకి కూడా సరిపడా అధిక్యం ఓటర్లు ఇవ్వలేదు. శనివారం నిర్వహించిన మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ టీఆర్‌ఎస్‌లో మరింత జోష్‌ను పెంచింది. జిల్లాలో వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింతలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో మొత్తం 80 వార్డులుంటే, 79 వార్డులకు ఎన్నికలు జరిగాయి. జిల్లా కేంద్రంలోని 5వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శాంతకుమారి ఏకగ్రీవమైంది. ఇక మున్సిపాలిటీల వారీగా వెలువడిన ఎన్నికల ఫలితాలతో మరోసారి ఓటర్లు గులాబీ వైపేనన్న స్పష్టత వచ్చింది. కౌంటింగ్‌ సందర్భంగా నాలుగు మున్సిపాలిటీల ఫలితాలు దాదాపు ఒకేసారి బయట పడగా, వనపర్తి మున్సిపాలిటీ మాత్రం మిగిలిన వాటికంటే కాస్తా ఆలస్యమైంది.

నాలుగు మున్సిపాలిటీల్లో గులాబీ జయకేతనం

జిల్లాలోని వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు మున్సిపాలిటీల్లో గులాబీ దళం జయకేతనం ఎగుర వేసింది. జిల్లా కేంద్రంలో 33 వార్డులకు గాను, 32 వార్డులకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 20 వార్డుల్లో గులాబీ దళం గెలిచింది. వీటికి తోడు  ఏకగ్రీవమైన ఐదో వార్డు కూడా టీఆర్‌ఎస్‌ ఖాతాలోనే ఉండటం వల్ల 21 స్థానాలు టీఆర్‌ఎస్‌కు దక్కాయి. అలాగే పెబ్బేరులోని 12 స్థానాలకుగాను ఏడు స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అధిక్యత సాధించింది. కొత్తకోటలో 15 స్థానాలకు 10 స్థానాలు టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. అలాగే ఆత్మకూరులో 10 వార్డు స్థానాలకు 6 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొంది పైచేయి సాధించారు. ఇక అమరచింతలోని పది స్థానాలకు మూడు వార్డుల్లో మాత్రమే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందగా, మిగిలిన పార్టీలకు ఒక్కొక్క స్థానాన్ని ఓటర్లు అందించడంతో ఎవరికన్నది స్పష్టత లేకుండాపోయింది. ఈ ఫలితాల నేపథ్యంలో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ పార్టీ సునాయసంగా స్వాధీనం చేసుకున్నైట్లెంది.

11 స్థానాలతో కుదేలైన కాంగ్రెస్‌

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 79 వార్డులకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 46 వార్డులను టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుచుకుని తమ అధిక్యతను చాటుకున్నారు. అయితే, వనపర్తిలో స్వతంత్రంగా గెలుపొందిన నలుగురిలో టీఆర్‌ఎస్‌కు చెందిన వారే రెబల్స్‌గా నలుగురు అభ్యర్థులున్నారు. వనపర్తి 5వార్డు ఏకగ్రీవంతో కలిపి.. మొత్తం టీఆర్‌ఎస్‌కు 51 వార్డులు గెలుపొందినట్లు అవుతుంది. ఇక బీజేపీ పరంగా చూస్తే.. జిల్లాలో 61 వార్డులకు పోటీ చేసి కేవలం 12 వార్డులతో మమ అనిపించుకుంది. ఇక కాంగ్రెస్‌ పార్టీ ఐదు మున్సిపాలిటీల్లో 69 వార్డులకు పోటీ చేసి 11 వార్డులతో కుదేలైంది. మరో పార్టీ టీడీపీ కూడా ఐదు మున్సిపాలిటీల్లో 22 వార్డులకు పోటీ చేస్తే.. 2 వార్డుల్లో మాత్రమే బోని చేసుకుంది. ఇలా జిల్లాలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల సమరంలో తిరుగులేని పార్టీగా టీఆర్‌ఎస్‌ మరోసారి నిరూపించుకుంది. 



logo