మంగళవారం 07 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 25, 2020 , 00:47:28

పల్లెప్రగతితోనే అభివృద్ధి

పల్లెప్రగతితోనే అభివృద్ధి
  • -చెత్తను డంపింగ్ యార్డులకు తరలించాలి
  • -నివేదికను ఉన్నతాధికారులకు పంపుతా..
  • -రెండో విడుత ప్రగతి పనులు బాగున్నాయి
  • -మదనాపురంలో పర్యటించిన హైదరాబాద్ రేంజ్ ఐజీపీ స్టీఫెన్ రవీంద్ర
  • -కొత్తకోట సీఐ కార్యాలయం తనిఖీ

మదనాపురం: పల్లెప్రగతితోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, అభివృద్ధికి గ్రామాల్లోని యువత ముందుకు రావాలని పల్లెప్రగతి ప్రత్యేకాధికారి ఐజీపీ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. శుక్రవారం మండలంలోని శంకరమ్మపేట, రామన్‌పాడు గ్రామాలను ఎస్పీ అపూర్వరావుతో కలిసి ఆయన సందర్శించారు. రెండో విడుత పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని, సమస్యలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా గ్రామాల్లోని వీధుల్లో పర్యటిస్తు, ఇంకుడుగుంతల నిర్మాణాలను పరిశీలించారు. అభివృద్ధి పనులకు కేటాయించిన నిధుల రికార్డులను పరిశీలించారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించారు. శంకరమ్మపేటలో విద్యార్థులు నేలపై కూర్చొని విద్యనభ్యసిస్తున్న దృశ్యాన్ని గమనించిన ఆయన విద్యార్థులకు బేంచీలు ఏర్పాటు చేయలేదా అని ఉపాధ్యాయుడిని ప్రశ్నించారు. దాతలు సహకరిస్తే బేంచీలు ఏర్పాటు చేయవచ్చని తెలపగా, వెంటనే స్పందించిన ఆయన త్వరలో పాఠశాలకు నూతన బేంచీలు ఏర్పాటు చేస్తానన్నారు. డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, నర్సరీలోని మొక్కల పంపెకంలాంటి కార్యక్రమాలను పరిశీలించారు. ఆయా గ్రామాల్లో హరితహారం మొక్కలు నాటారు. మహిళా సంఘాల సభ్యులు తయారు చేసిన బట్టబ్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ ప్రతి ఇంటి ఎదుట మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టాలని ప్రజలకు సూచించారు. మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేయాలని, అంతర్గత రోడ్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తడిచెత్త, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డులకు చేర్చాలన్నారు. అనంతరం ఆయా గ్రామాల సర్పంచ్‌లు పద్మమ్మ, కురుమూర్తి మాట్లాడుతూ తమ గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాలు లేవని త్వరగా నూతన భవనాలు ఏర్పాటు చేయాలని, రైతులకోసం ధాన్యం ఆరబెట్టుకునేందుకు ఫ్లాట్‌ఫాంలు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ కిరణ్‌కుమార్, డీఆర్డీవో గణేష్, డీపీవో రాజేశ్వరీ, తాసిల్దార్ సింధూజ, ఎంపీడీవో నాగేంద్రం, సీఐ సీతయ్య, ఎస్సై సైదయ్య, ఎంపీపీ పద్మావతి, వైస్ ఎంపీపీ యాదమ్మ, జెడ్పీటీసీ కృష్ణయ్య, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ సెక్రెటరీ విక్రమ్‌గౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
డయల్ 100పై అవగాహన కల్పించాలి
కొత్తకోట: బాలికలు, మహిళలు, ప్రజలకు డయల్ 100పై అవగాహన కల్పించాలని ఐజీపీ స్టీపెన్ రవీంద్ర అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా కొత్తకోట పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ముందుగా ఆయనకు సాయుధ బలగాలచే కవాతు, గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఎస్పీ అపూర్వరావు ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం కొత్తకోట సర్కిల్ పరిధిలో నమోదైన కేసుల వివరాలను సీఐ మల్లికార్జున్‌రెడ్డిని అడిగి తెలుసుకుని పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తిచేయాలని దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఆ దిశగా అధికారులు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో సున్నితమైన ఆంశాల దృష్ట్యా సమస్యాత్మకమైనవిగా గుర్తించి ప్రత్యేక పోలీస్ నిఘాను ఉంచి నేరాలను అదుపులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని వర్గాల ప్రజలతో కలిసిమెలసి ఉండి ఫ్రెండ్లీ పోలిసింగ్‌ను పెంపొందించాలని అన్నారు.
ఎస్పీ అపూర్వరావుకు అభినందనలు
జిల్లాలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను నియమించి  శాంతి భద్రతలు కాపాడుతున్న ఎస్పీ అపూర్వరావును ఐజీపీ స్టీఫెన్ రవీంద్ర అభినందించారు. కార్డన్ సెర్చ్ కార్యక్రమంలో ప్రజలతో మమేకం కావడానికి వేదికగా మలుచుకున్న ఎస్పీ ఆలోచన సత్ఫలితాలను ఇచ్చిందని, తద్వారా జిల్లాలో మహిళలపై నేరాలు చాలా తక్కువ సంఖ్యలో నమోదైనట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్ ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ కిరణ్‌కుమార్, ఎస్సై విజయ్‌భాస్కర్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.


నాణ్యమైన విద్యకు కృషి చేయాలి

పీయూ రిజిస్ట్రార్ పిండి పవన్‌కుమార్
పాలమూరు: నాణ్యమైన విద్యను మెరుగుపర్చేందుకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు కృషి చేయాలని పాలమూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్ పిండి పవన్‌కుమార్ అన్నారు. విద్యాసంస్థల్లో బయోమెట్రిక్ ఉపకరణలు ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధ్యాయ, అధ్యాపకుల హాజరును పునరుద్ధ్దరించే అవకాశం ఉందని అన్నారు. శుక్రవారం పీయూ, ఓయూ సంయుక్తంగా నిర్వహించిన పండిత్ మదన్‌మోహన్ మాలమియా నేషనల్ మిషన్ ఆన్ టీచర్ అండ్ టీచింగ్ అభ్యాస వనరులు బోధన అభ్యాస ప్రక్రియ ప్రయోజనం అనే అంశంపై పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించిన ప్రదర్శనలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నేర్చుకోకుండా డిగ్రీ పొందడం పనికిరాదని అన్నారు. ఆవిష్కరణ, అభ్యాస దిశలో విద్యార్థులను ప్రేరేపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. విద్యార్థి, అధ్యాపకుల ఆలోచనలో మార్పు చేయబడిన కొత్త అవకాశాలను ఉపయోగించుకొని ఇతరులతో  సులభంగా సంభాషించి ఆలోచనలు పంచుకోవచ్చని సూచించారు. అనంతరం  ఉస్మానియా యూనివర్సిటీ సీఈవో డాక్టర్ బీ భాగ్యమ్మ మాట్లాడుతూ విద్యార్థి, ట్రైనీల వివరణలను పరిగణలోకి తీసుకోవడం ద్వారా  వర్కింగ్ మోడల్‌పై మూల్యాంకనం జరుగుతుందన్నారు. పీయూ పరిధిలో ప్రదర్శించిన ఈ ప్రదర్శనలు విద్యావంతులకు ఎంతగానే ఉపయోగపడుతాయని అన్నారు. పీయూ మాజీ ప్రిన్సిపల్ నర్సిములు మాట్లాడుతూ వ్యక్తిగత బోధన సాధనలను ప్రదర్శించే ఇలాంటి కార్యక్రమాలు జ్ఞానాన్ని పెంపొందించడానికి ఉపయోగ పడుతాయని అన్నారు. ఓఎస్‌డీ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పనిపై చిత్తశుద్ధితో ఉండాలని అన్నారు. మీ నడవడికతో ఓ వ్యక్తిని ప్రభావితం చేసినప్పుడే గొప్ప వారవుతారని సూచించారు. ఈ ప్రదర్శనలో పీయూకు అనుబంధంగా ఉన్న 28 ఉపాధ్యాయ విద్యా సంస్థల నుంచి తక్కువ ఖర్చుతో కూడిన పర్యావరణ అనుకూల పదార్థాలను తయారుచేసి ప్రదర్శించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సరోజనమ్మ, డాక్టర్ ఎన్ చంద్రకిరణ్, పీయూ వైస్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. logo