శనివారం 04 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 24, 2020 , 04:51:38

అందరిలో గెలుపు ధీమా

అందరిలో గెలుపు ధీమా
  • - పోలింగ్‌ సరళిపై విశ్లేషణల్లో అభ్యర్థులు
  • - ఫలితాల కోసం ఎదురు చూపులు
  • - రేపటి కౌంటింగ్‌ వైపే అందరి చూపు
  • - స్ట్రాంగ్‌ రూంల్లో బ్యాలెట్‌ బాక్సులు భద్రం


వనపర్తి ప్రతినిధి,నమస్తే తెలంగాణ: మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన అనంతరం అభ్యర్థులు ఎవరి అంచనాల్లో వారు మునిగి తేలుతున్నారు. వారి తో పాటు నాయకులు, ముఖ్యకార్యకర్తలు సహితం అవే లెక్కలు వేసుకుంటూ గెలుపోటములపై అంచనాలు వేస్తున్నారు. కౌంటింగ్‌కు మరో 24 గంటల గడువున్న క్రమంలో ఎప్పుడు ఆ సమయం వస్తుందా అన్నట్లు ఆశావహులు ఎదురు చూస్తున్నారు. జిల్లాలో వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత మున్సిపాల్టీలకు ఎన్నికలు నిర్వహించారు. మొత్తం ఐదు మున్సిపాల్టీల్లో 80 వార్డులుంటే, 79 వార్డులకు ఎన్నికలు జరిగాయి. వనపర్తి మున్సిపాల్టీలో 5వ వార్డు ఏకగ్రీవం అయిన సంగతి విధితమే. జనవరి 8న ఆర్వోల నోటిఫికేషన్‌తో మొదలైన మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది.

అంచనాల్లో అభ్యర్థులు

పోలింగ్‌ ముగిసిన అనంతరం ఎవరికి వారుగా ఫలితాల అంచనాలను వేసుకుంటున్నారు. పోలింగ్‌ జరిగిన సరళిని నెమరు వేసుకుంటూనే తమకు పడ్డ ఓట్ల శాతాన్ని లెక్కలు వేస్తున్నారు. అభ్యర్థులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు ఓటింగ్‌ సరళినే అంచనా వేస్తున్నారు. వారం రోజుల పాటు ఎడతెరపిలేని ప్రచారాలు, కార్యక్రమాలతో గడిపిన అభ్యర్థులకు గురువారం కాస్త సేదతీరినైట్లెంది. అయినా నిద్ర పట్టడం లేదు. ఎవరో ఒకరు ఇదే చర్చను తీస్తూ కాలక్షేపం చే యడంతో ఎటు తిరిగినా మళ్లీ అంచనాల దారికే చర్చలన్నీ వస్తున్నాయి. దాదాపు అన్ని మున్సిపాల్టీల్లో భారీగానే పోలింగ్‌ జరిగింది. ఓటర్లు ఉత్సాహంగా పాల్గొనడంతో ఓటింగ్‌ శాతం పెరిగింది. ఏజెంట్లతో ఉన్న ఓట రు లిస్టుల ద్వారా పోలింగ్‌ జరిగిన తీరును అంచనాలు వేసుకుని అభ్యర్థులు లెక్కలు కడుతున్నారు. జిల్లా లో 342 మంది అభ్యర్థులు వార్డు సభ్యులుగా పోటీ చేశారు.

25వ తేదీ వైపే చూపంతా..

ఎవరిని కదిలించినా కౌంటింగ్‌ నిర్వహించే 25వ తేదీ గురించి మాట్లాడుతున్నారు. సాధారణ కార్యకర్తల నుంచి ప్రాధాన్యతగల నాయకుల వరకు ఇదే తీరు కనబడుతోంది. ఇక పోటీ చేసిన అభ్యర్థులు తమ రాజకీయ భవిష్యత్‌ను ఊహించుకుంటూ కౌంటింగ్‌ తేదీ వైపు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో తాజామాజీ కౌన్సిలర్లు, గతంలో పని చేసిన వారు, కొత్త అభ్యర్థులు వార్డు సభ్యులుగా పోటీ చేశారు. ఏడాది నుంచి ఈ అవకాశం కోసం ఎదురు చూసిన వారు కొందరుంటే, ఇప్పటికిప్పుడే రంగంలోకి దిగిన అభ్యర్థులు కూడా ఉన్నారు. ఇలా వీరంతా ఎప్పుడు ఎన్నికల ఫలితం తమకు వినిపిస్తుందా అన్నట్లు చెవులు కొరుక్కుంటున్నారు.

స్ట్రాంగ్‌ రూంల్లో పదిలం..

ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో ము న్సిపల్‌ ఎన్నికల బ్యాలెట్‌ బాక్సులు భద్రంగా ఉన్నా యి. ప్రత్యేక పోలీసుల నిఘా నీడలో స్ట్రాంగ్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. బ్యాలెట్‌ బాక్సులున్న గదుల ను పక్కాగా సీల్‌ వేసి ఉంచారు. ఐదు మున్సిపాల్టీలకు చెందిన బ్యాలెట్‌ బాక్సులను ఎక్కడికక్కడ భద్రపరిచారు. కౌంటింగ్‌ సహితం అక్కడే నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. కలెక్టర్‌ శ్వేతామొహంతి, ఎస్పీ అపూర్వరావుల పర్యవేక్షణలో కౌటింగ్‌ ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 160 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన బ్యాలెట్‌ బాక్సులను పటిష్టమైన ఏర్పాట్ల మధ్య భద్రత చర్యలు చేపట్టారు.

అభ్యర్థుల భవితవ్యానికి భద్రత

పెబ్బేరు : పుర ఎన్నికల్లో భాగంగా పెబ్బేరు మున్సిపాలిటీలో 12వార్డులకు జరిగిన ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వ తంత్ర అభ్యర్థులు 51మంది ఎన్నికల బరి లో ఉన్నారు.  12వార్డులకు సంబంధించిన 24పోలింగ్‌ కేంద్రాల్లో ఆయా వార్డులకు చెం దిన ఓటర్లు తమ అమూల్యమైన ఓటు హ క్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ సర ళి ముగిసిన వెంటనే 53 బ్యాలెట్‌ బాక్స్‌లను భారీ పోలీస్‌ భద్రత మధ్య ఎన్నికల అధికారులు స్థానిక వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయానికి తరలించి ఒక గదిలో భద్రపర్చి గదిని సీజ్‌ చేశారు.logo