బుధవారం 08 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 24, 2020 , 04:51:38

గుండా రాజకీయాలు చేస్తే సహించం

గుండా రాజకీయాలు చేస్తే సహించం
  • -స్ట్రాంగ్‌రూమ్‌పై దాడి అప్రజాస్వామ్యం
  • - ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి వెల్లడి

కొల్లాపూర్‌, నమస్తే తెలంగాణ: మున్సిపల్‌ ఎన్నికల బ్యాలెట్‌ బ్యాక్సులను కొల్లాపూర్‌లో భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌పై బుధవారం రాత్రి అసాంఘీకశక్తులు ఆల్‌ ఇండియా పార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ నుంచి పోటీ చేసిన కొందరు కార్యకర్తలు దాడిచేయడం అప్రజాస్వామ్యమని, పిరికిపందల చర్యలని స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి విమర్శించారు. ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. గురువారం పట్టణంలోని తన స్వగృహంలో ఎమ్మెల్యే బీరం మాట్లాడారు. స్ట్రాంగ్‌రూమ్‌పై దాడి, ఇంక్‌ బాటిళ్లు తీసుకురావడం, భద్రత విధుల్లో ఉన్నా పోలీసులపై దాడి, వాహనాలు ధ్వంసం చేయడం చూస్తే ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్టేనని ఆయన పేర్కొన్నారు. బుధవారం మున్సిపల్‌ పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందన్నారు. ఎంతో విలువ గల ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీచేసినట్లు తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఈ సంఘటన చాలా దురదృష్టకరమని ఎమ్మెల్యే బీరం వ్యాఖ్యానించారు. కొల్లాపూర్‌లో ఫ్యాక్షన్‌ గుండా సంస్కృతిని నేర్పుతున్నారని, ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే సహించేది లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కించపరచడం శోచనీయమన్నారు. నేను కానీ ఇంకెవరైనా తప్పుచేస్తే చర్య తీసుకోవాలి కానీ, కర్రలు, రాళ్లు రప్పలు, ఇనుపరాడ్లతో పోలీసులు, అమాయకులపై దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు.

సోషల్‌ మీడియాల్లో అనవసరంగా పుకార్లు సృష్టించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇంతకాలంగా ప్రజలను మాయమాటలు చెప్పి అబద్ధాలు, స్వార్థంతో ఓట్లే జీవితంగా మేము ఎప్పుడూ వ్యవహరించలేదని, మాకు ప్రజల క్షేమమే ముఖ్యమన్నారు. గ్లోబల్‌ ప్రచారం చేసుకుంటూ అబద్దాలనే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. భౌతికదాడులు చేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేయాలనుకుంటే, భయపడే ప్రసక్తేలేదని బీరం స్పష్టం చేశారు. మీరు చేసిన తప్పుకు అమాయక ప్రజలు, మా కార్యకర్తలు కూడా దెబ్బలు తిన్నారు.. మీ రాజకీయ దాహం కోసం సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని ఎమ్మెల్యే బీరం అన్నారు. సమావేశంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గున్‌రెడ్డి నరేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు విజయరామారావు, జాఫర్‌, చంద్రశేఖరాచారి, కట్టా రాజేందర్‌గౌడ్‌, బండల వెంకటస్వామి, గడ్డం శేఖర్‌యాదవ్‌, లక్ష్మణ్‌రావు, చంద్రయ్యయాదవ్‌, వేణుగోపాల్‌యాదవ్‌, రామచందర్‌యాదవ్‌, ఎంపీటీసీ కొండ్ర బుచ్చయ్య, కట్టా శ్రీనివాసులు, గొల్లరాముడు, కాడం శ్రీనివాసులు ఉన్నారు.


logo