మంగళవారం 07 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 23, 2020 , 03:55:21

ఏ నోట విన్నా.. కారు.. సారే..

ఏ నోట విన్నా.. కారు.. సారే..


మహబూబ్ ప్రధాన ప్రతినిధి /నమస్తే తెలంగాణ : ‘కొంత మంది నాయకులు ఓటర్ల చెవిలో పూలు పెట్టేందుకు ప్రయత్నించారు.. కులం, మతం.. మంత్రం వేశారు.. అదీ పనిచేయలేదు.. ఇక చేయి కనిపించకుండా పోయింది.. ఎవరిని అడిగినా కారు.. సారు తప్ప వేరే మాట వినిపడటం లేదు.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే జనం ఓటేశారు’.. అని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ అన్నారు. సీఎం కేసీఆర్ ఓ పక్క గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తూనే మరోపక్క అర్బన్ పాలసీతోపట్టణాల రూపురేఖలు మారుస్తున్నట్లు ఆయన తెలిపారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బుధవారం మహబూబ్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలోని పద్మాలయ ఉన్నత పాఠశాలలో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అనంతరం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్ ఆంధ్రప్రదేశ్ టీఆర్ పార్టీ పోటీ చేయాలని అక్కడి ప్రజలు అడుగుతున్నారని మంత్రి తెలిపారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించాల్సి వస్తే మాత్రం చక్కని పాలన అందించే నాయకుడు కేటీఆర్ మాత్రమేనని ప్రజలు విశ్వసిస్తున్నారని ఆయనన్నారు. ఇప్పటికే పంచాయతీరాజ్ మంత్రిగా గ్రామాలను బాగు చేసిన మంత్రి కేటీఆర్, ఇప్పుడు మున్సిపల్ మంత్రిగా విజయవంతమయ్యారని అన్నారు. కేటీఆర్ ప్రచారం చేయకుండా మున్సిపాలిటీలు గెలవాలని ప్రతిపక్షాలు సవాల్ విసిరాయని.. ఆ సవాల్ స్వీకరించిన ఆయన ఎక్కడా ప్రచారం కూడా చేయలేదన్నారు. మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ చేపట్టిన అభివృద్ధి కారణంగానే రాష్ట్రంలో 110 మున్సిపాలిటీలకు పైగా విజయం సాధిస్తామని శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ప్రజాతీర్పును గౌరవించాల్సి ఉంటుందన్నారు. 

110కి పైగా సీట్లు.. 25 ఏళ్ల పాలన..

  రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలకు గాను 110 పైగా స్థానాలను టీఆర్ పార్టీ కైవసం చేసుకుంటుందని మంత్రి శ్రీనివాస్ అంచనా వేశారు. 110 స్థానాలు వస్తే టీఆర్ పార్టీ రాష్ట్రంలో మరో 25 ఏళ్లపాటు అధికారంలో ఉంటుందని.. అలా కాకుండా పొరపాటున 100 స్థానాలు వస్తే 20 ఏళ్లు, 100లోపు వస్తే 10 ఏళ్లు టీఆర్ పాలన ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. అయితే ప్రతిపక్షాలు ఎన్ని ఆశలు పెట్టుకున్నప్పటికీ నైతికంగా దిగజారిన వారికి సింగిల్ డిజిట్ కూడా దాటదన్నారు. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నా.. అభివృద్ధిని కాంక్షించే మంత్రి కేటీఆర్ రాష్ర్టానికి పరిశ్రమలు తీసుకువచ్చేందుకే దావోస్ వెళ్లారని తెలిపారు.

అభివృద్ధిని చూసి గుండెలకు హత్తుకున్నారు..

70 ఏళ్లుగా అధికారంలో ఉన్న వారు ఏం అభివృద్ధి చేశారో.. ఇప్పుడు తమ ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలు గమనిస్తున్నారని, అందుకే గుండెలకు హత్తుకుంటున్నారని మంత్రి తెలిపారు. గతంలో పట్టణంలో ఇండ్లు కట్టుకోవాలంటే ప్రజలకు స్వేచ్ఛ ఉండేది కాదని.. ఇప్పుడు ఇక ఆ పరిస్థితి ఉండబోదన్నారు. ప్రజలకు ఏం అవసరమో తెలుసుకుని అన్ని పనులు చేస్తామన్నారు. హైదరాబాద్ నుంచి ఉద్యోగాలు చేసేందుకు మహబూబ్ వలస వచ్చే విధంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. పనిచేయని కౌన్సిలర్లు, చైర్మన్లను తొలగించే అధికారం కొత్త చట్టంలో ఉందని, ప్రజలను పట్టించుకోని నాయకులను పక్కన పెట్టేస్తామన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, పనిచేసే మాలాంటి నాయకులను ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని, ఇలాంటి వారికి ప్రజల నుంచి ఛీత్కారాలు తప్ప ఒరిగేదీమీ లేదన్నారు. విపక్షాలకు కనీసం అభ్యర్థులు కూడా లభించలేదని.. కొన్ని చోట్ల లభించినా వారిని ప్రపోజ్ చేసేందుకు జనం ముందుకు రాలేదన్నారు.

అవినీతి మరకలు లేకుంటేనే చైర్మన్ గిరి

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరిగిన అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్ పార్టీ అభ్యర్థులే చైర్మన్లుగా ఎంపికవుతారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎలాంటి అవినీతి మరకలు లేని వారినే చైర్మన్, వైస్ చైర్మన్, ఫ్లోర్ లీడర్లుగా ముఖ్యమంత్రి ప్రకటిస్తారని ఆయన తెలిపారు. గతంలో డబ్బులు ఉన్న వాళ్లకే పదవులు దక్కేవని.. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదన్నారు. ధనవంతుడు కాదు.. గుణవంతుడు చైర్మన్లుగా ఎంపికవుతారని మంత్రి వెల్లడించారు.


logo