గురువారం 09 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 21, 2020 , 01:57:49

ష్‌..!

ష్‌..!
  • - ముగిసిన మున్సిపల్‌ ప్రచారం
  • - మూగబోయిన మైకులు
  • - ప్రశాంతంగా కాలనీలు
  • - రేపు 79 వార్డుల్లో ఎన్నికలు


వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఆరు రోజులుగా నిరంతరంగా మోగిన మైకులు గప్‌చుప్‌గా మారాయి.. పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారాలను నిలిపివేయాలన్న నిబంధనతో కాలనీలన్నీ ప్రశాంతంగా దర్శనమిస్తున్నాయి.. సోమవారం సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యర్థులు, ముఖ్య నాయకులు ప్రచారాలను నిలిపివేశారు.. చివరి నిమిషం వరకు ప్రచారం చేసి వాహనాలకు ఉన్న ఫ్లెక్సీలు, మైకులు తదితర వాటిని తొలగించుకున్నారు.. రేపు జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో 79 వార్డులకు 342 మంది పోటీ పడనున్నారు..

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో మైకులన్నీ మూగబోయాయి. సోమవారం సాయంత్రం ఐదు గంటల వరకు ఆయా పార్టీలు తమ ప్రచార పర్వాలను ముగించడంతో ఒక్కసారిగా కాలనీల్లో ప్రశాంత వాతావరణం కనిపించింది. వారం రోజులుగా మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనెల 8వ తేదీ నుంచి మొదలైన నామినేషన్ల ప్రక్రియ  రెండు రోజులు కొనసాగింది. అనంతరం ఈనెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నామినేషన్ల పరిశీలన, 14న ఉపసంహరణలు, అదే రోజు సాయంత్రం బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాలను ప్రకటించడం జరిగింది. ఇక అప్పటి నుంచి రంగంలో మిగిలిన అభ్యర్థులు తమ ప్రచారాలను నిర్వహించారు. మున్సిపల్‌ ఎన్నికల బరిలో జిల్లాలో 342 మంది 79వ వార్డుల్లో పోటీ చేసి తమ ఎన్నికల భవిష్యత్‌ను తేల్చుకో బోతుండటం ఆసక్తిని రేకెత్తిస్తున్నది.

కాలనీలు ప్రశాంతం..

ఒకపార్టీ మైకు ప్రచారం వచ్చి వెళితే.. మరొక పార్టీ మైకు ప్రచారాలతో కాలనీల జనం హోరెత్తిపోయారు. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఆటోల ద్వారా మైకు ప్రచారాలను విరివిగా చేపట్టారు. ఉదయం నుంచి రాత్రి వరకు మైకుల మోతలతో జనం తలలు పట్టుకున్నంత పని అయింది. ఎప్పుడు ప్రచారాలు నిలిచిపోతాయా అన్నట్లు రద్దీని.. మైకుల సౌండ్‌ను భరించలేని వారంతా ఎదురు చూశారు. కాలనీల్లోని ప్రధాన వీధులు, కూడళ్లలో ఎప్పుడు ఏదోఒక మైకు ప్రచారం తిష్ట వేసుకోవడంతో అక్కడున్న జనం బేజారెత్తారు. ప్రచారం జరిగింది తక్కువ రోజులే అయినా ఎక్కువగా ఆటోల మైకు ప్రచారాలు ప్రజలకు తలనొప్పిని తెప్పించాయి. ఎట్టకేలకు పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారాలను నిలిపి వేయాల్సిన నిబందనతో ఇక కాలనీలన్ని ఒక్కసారిగా ప్రశాంతంగా మారాయి.

చివరి నిమిషం వరకు..

చివరి రోజు ప్రచారాలకు ఆయా పార్టీలు అత్యంత ప్రాధాన్యతనిచ్చాయి. నిన్న.. మొన్నటి కంటే కూడా సోమవారం మరింతగా పార్టీలు ప్రచార జోరును పెంచాయి. రోజు వారిగా పది రౌండ్లు మైకు ప్రచారం వస్తే.. చివరి రోజు మరో ఐదు రౌండ్లు అధికంగా కాలనీల్లో ప్రచారాలు నిర్వహించారు. ప్రతి వార్డులో ఐదుకు పైగా ఆటో మైకుల ప్రచారాలు హోరెత్తించాయి. ఉదయం 7 గంటలకు మొదలయ్యే మైకుల హోరు చివరి రోజు సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగాయి. ఆటోలకు మైకులు, అభ్యర్థుల ప్లెక్సీలు, గుర్తులు తదితర వాటిని అలంకరించి పసందుగా ప్రచారాలు నిర్వహించారు. మైకుల మోతలు ఇలా ఉంటే, అభ్యర్థులు ఇంటింటి ప్రచారాలకు ప్రాధాన్యతనిచ్చారు. ముఖ్యమైన అభ్యర్థులు ప్రతి ఇంటికి వెళ్లి ఓటరును మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశారు. ఓటరు కూడా వచ్చిన వారందరికీ సరేనంటూ చెబుతుండటంతో అభ్యర్థులు తమ అంచనాలు వేసుకోలేక అటు.. ఇటు అవుతున్నారు.logo