శనివారం 04 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 21, 2020 , 01:55:55

విజ్ఞతతో ఓటెయ్యండి

విజ్ఞతతో ఓటెయ్యండి


మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి/నమస్తే తెలంగాణ : ఇప్పటికే ఎంతో అభివృద్ధి చేశాం.. మరింతగా అభివృద్ధి చేసేందుకు సహకరించండి.. విజ్ఞతతో ఓటెయ్యండని కొత్తకోట, భూత్పూర్‌ ప్రజలకు దేరవకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో కొత్తగా రెండు మున్సిపాలిటీలను తీసుకువచ్చామని, వాటి సమగ్రాభివృద్ధి కేవలం టీఆర్‌ఎస్‌ సర్కారు వల్లే సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి ఇంటా టీఆర్‌ఎస్‌ సర్కారు అందిస్తున్న పథకాల లబ్ధిదారులే ఉన్నారని.. వారంతా తమను ఆశీర్వదిస్తారని తెలిపారు. కొత్తకోట, భూత్పూర్‌ మున్సిపాలిటీల ఎన్నికలపై ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సోమవారం ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఇప్పటికే రెండు మున్సిపాలిటీలకు సంబంధించి రూ. 40 కోట్లు విడుదల చేసినట్లు వివరించిన ఆయన.. ఆయా అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు వెల్లడించారు. గల్లీ నుంచి అసెంబ్లీ దాకా అన్ని చోట్లా టీఆర్‌ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధులే ఉన్నారని గుర్తు చేశారు. రాబోయే నాలుగేండ్లు టీఆర్‌ఎస్‌ పార్టే అధికారంలో ఉంటుందనే విషయాన్ని గుర్తించిన ప్రజలంతా అభివృద్ధి కోసం తమ వెంటే ఉన్నారన్నారు. ఢిల్లీలో కొట్లాడి గల్లీలో ఏకమయ్యే కాంగ్రెస్‌, బీజేపీలను బొంద పెట్టాలని ప్రజలకు సూచించారు. అభ్యర్థులు లేక కబ్జాకోరులను ప్రతిపక్షాలు ఎన్నికల బరిలో దింపాయని.. వారిని తరిమితరిమి కొట్టాలని సూచించారు.

కొత్తకోట, భూత్పూర్‌లను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం..

దేవరకద్ర నియోజకవర్గంలో కొత్తకోట, భూత్పూర్‌ కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసిన ఘనత మాకే దక్కుతుంది. గ్రామ పంచాయతీ స్థాయిలో ఉన్న భూత్పూర్‌ను మున్సిపాలిటీగా చేశాం. భూత్పూర్‌ మున్సిపాలిటీలో ఇప్పటికే రూ.20 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టాం. మరోవైపు కొత్తకోటలోనూ రూ. 20 కోట్లతో పనులు ప్రారంభించాం. పలు పనులు ప్రారంభం కావాల్సి ఉంది. జాతీయ రహదారి వెంట ఉండే ఈ రెండు మున్సిపాలిటీలు భవిష్యత్తులో ఎంతో అభివృద్ధి చెందుతాయి. భూత్పూర్‌లో ఇప్పటికే అలీప్‌ సంస్థ సహకారంతో 1000 మందికి ప్రత్యక్షంగా, 3వేల మందికి పరోక్షంగా ఉపాధినందించే ఓ మల్టీ ప్రొడక్ట్‌, బయో డీగ్రేడబుల్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే ఇందుకోసం అమిస్తాపూర్‌ వద్ద 10 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించాం. కొత్తకోట, భూత్పూర్‌లో ప్రజలు సేద తీరేందుకు పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. రోడ్ల విస్తరణ, డ్రైనేజీల నిర్మాణం, సెంట్రల్‌ లైటింగ్‌, సుందరీకరణ పనులు చేపట్టాం. ఒకప్పుడు తాగునీటికి కటకటలాడిన ఈ రెండు పట్టణాల్లోనూ నేడు మిషన్‌ భగీరథ ద్వారా శుద్ధ జలం అందిస్తున్నాం. భూత్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని సిద్దాయపల్లిలో 300 డబుల్‌ బెడ్రూం ఇండ్ల్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. త్వరలో భూత్పూర్‌లో 300 ఇండ్లను నిర్మిస్తాం. కొత్తకోటలో 500 ఇండ్లను నిర్మించి పేదలకు అందిస్తాం. స్థానికంగా ప్రజలు ఏ సమస్యను మా దృష్టికి తీసుకువచ్చినా వెంటనే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాం. రెండు మున్సిపాలిటీలను రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీలుగా మారుస్తా.

బీజేపీ, కాంగ్రెస్‌లను ప్రజలు నమ్మరు..

కాంగ్రెస్‌, బీజేపీ నిత్యం వివిధ అంశాలపై ఢిల్లీలో కొట్లాడుకుంటాయి.. గల్లీలో మాత్రం ఏకమవుతాయి.. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. వారి మోసాలు ఇకపై చెల్లవు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి వారే పాలించారు. వారి పాలనలో అభివృద్ధి మాత్రం భూతద్దం పెట్టుకుని వెతికినా కనిపించదు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలను దగ్గరి నుంచి గమనించింది టీఆర్‌ఎస్‌ సర్కారు. ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ వచ్చింది. ఒకప్పుడు తాగునీటి కోసం కిలోమీటర్ల మేర నడవాల్సి వచ్చేది. నేడు ఆ దయనీయ పరిస్థితికి సీఎం కేసీఆర్‌ చెక్‌ చెప్పారు. మిషన్‌ భగీరథతో ఇంటింటికి శుద్ధజలం అందిస్తున్నారు. రూ. 200 ఉన్న పింఛన్‌ నేడు రూ. 2016, రూ.3016కు చేరుకుంది. మౌలిక సమస్యలన్నీ తీరాయి. అభివృద్ధి చేస్తున్న టీఆర్‌ఎస్‌ సర్కారు ఓవైపు.. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చే కాంగ్రెస్‌, బీజేపీ లాంటి పార్టీలు మరోవైపు. అయితే ఎవరి వల్ల మేలు జరుగుతుందో ప్రజలే గుర్తిస్తున్నారు. మహబూబ్‌ నగర్‌- భూత్పూర్‌ మధ్య రోడ్డు విస్తరణ పనులు చేజిక్కించుకున్న ప్రతిపక్ష పార్టీ నేత ఒకరు రోడ్డు పనులు పూర్తి చేయకుండా ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ రోడ్డు పనులు పూర్తి చేస్తే అధికార పార్టీకి మంచి పేరు వస్తుందని వారు ఇలా చేస్తున్నారు. ఇలాంటి అభివృద్ధి నిరోధకులు ఇప్పుడు ఓట్ల కోసం మళ్లీ ప్రజల వద్దకు వస్తున్నారు. వారికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. కేసీఆర్‌ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తుంటే.. అలాంటి పథకాలు కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. అందుకే ఈ రెండు పార్టీలకు ఈ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవు.

కబ్జాకోరులను తరిమికొట్టండి..

బీజేపీ నేతలు కబ్జాకోరులను తమ వెంట ఉంచుకుని ప్రచారం చేపడుతున్నారు.. అలాంటి వారిని తరిమి కొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. సొంత సోదరుల భూములు కబ్జాలు చేసే వారు తప్ప బీజేపీ నేతలకు అభ్యర్థులే దొరకలేదా అని ఆ పార్టీ వారిని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన, చేస్తున్న అభివృద్ధిని చూసి అన్ని ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ కారుకే ఓటేసేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ఇది గుర్తించిన ప్రతిపక్షాల నేతలు... ఓటర్లను మభ్యపెట్టే కా ర్యక్రమాలు చేపడుతున్నారు. మందు, బిర్యానీలు అంటూ ప్రలోభపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు.

చైర్మన్‌ అభ్యర్థులు ఎంతో సౌమ్యులు..

భూత్పూర్‌ చైర్మన్‌ అభ్యర్థి బీసీ నాయకుడు బస్వరాజ్‌ గౌడ్‌, కొత్తకోట చైర్మన్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విశ్వేశ్వర్‌ ఎంతో సౌమ్యులు. రాజకీయం గా ఎంతో అనుభవం ఉంది. అందుకే ముందే ఇద్దరినీ అభ్యర్థులుగా ప్రకటించాం. అభివృద్ధి చేసే నేతలు కాబట్టే ప్రజల నుంచి వీరికి అనూహ్య స్పందన వస్తుంది. కొత్త మున్సిపాలిటీలను సరైన మార్గంలో తీసుకుపోతారనే నమ్మకం ఉన్నందుకే వీరికి ప్రజల నుంచి మద్దతు లభిస్త్తుంది. రెండు మున్సిపాలిటీలు బాగా అభివృద్ధి చేసేందుకు వీరు కష్టపడి పనిచేస్తారు. ఇంకా అభివృద్ధి చేసుకుందాం.. ప్రజలంతా విజ్ఞతతో అభివృద్ధి చేసే టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకు భారీ మెజార్టీతో గెలిపించాలి. ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంతు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా.logo