మంగళవారం 31 మార్చి 2020
Wanaparthy - Jan 17, 2020 , 01:25:57

ఎన్నికల సంక్రాంతి

ఎన్నికల సంక్రాంతి
  • - ఓవైపు పండుగ.. మరోవైపు ప్రచారం
  • - దూసుకుపోతున్న కారు
  • - కనుమరుగైన కాంగ్రెస్‌
  • - బీజేపీ బేజారు
  • - ప్రచారంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు

పండుగ పూట కూడా ప్రచారం జోరుగా సాగింది. నేతలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. పలుచోట్ల కారుగుర్తుకు ఓటేస్తామని ముగ్గుల ద్వారా గృహిణులు అభిమానాన్ని చాటారు. ఇదిలా ఉండగా కారుజోరుకు విపక్షాలు ఢీలా పడ్డాయి. కాంగ్రెస్‌, బీజేపీలకు అన్ని వార్డుల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకకపోవటం గమనార్హం. కమలనాథులు తమ పార్టీ కంచుకోటగా చెప్పుకుంటున్న పట్టణాల్లోనూ అన్ని వార్డుల్లో అభ్యర్థులను నిలుపలేకపోయారు. దీంతో టీఆర్‌ఎస్‌ గెలుపు నల్లేరుమీద నడకలాగే సాగనుంది. ఎన్నికలు జరుగుతున్న 17 మున్సిపాలిటీల పరిధిలోని 334 స్థానాలకు గాను కాంగ్రెస్‌ 293, బీజేపీ 283 వార్డులల్లో పోటీకి అభ్యర్థులను నిలిపాయి. కీలకమైన మున్సిపాలిటీల్లో ఈ రెండు పార్టీలకు అభ్యర్థులు దొరకకపోవడం విడ్డూరం. ఇదిలా ఉండగా అధికార టీఆర్‌ఎస్‌లో నూతనోత్తేజం నెలకొంది. 333 వార్డుల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపిన టీఆర్‌ఎస్‌ అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌,  నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ల బాధ్యులు ప్రచారంలోదూసుకుపోతున్నారు.

మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఓ వైపు సంక్రాంతి పండుగతో సందడి నెలకొంది. మరోవైపు అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు సైతం ఎన్నికల్లో ఓట్ల కోసం పోటీ పడ్డారు. పండుగ వేళ అంతా ఇంటి వద్దా దొరుకుతారనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి చేరుకుని తమకు ఓట్లేయమని ప్రాధేయ పడ్డారు. ఉద్యోగాలు, ఉపాధి, వ్యాపారాల కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన వారు సైతం సంక్రాంతి కోసం ఇళ్లకు చేరుకున్నారు. వీరిని సైతం కలిసి తమకు ఓట్లేయమని అభ్యర్థులు కోరారు. వలస ఓటర్లకు ఓటేసేందుకు రావాలని ఇప్పుడే చార్జిలు, ఖర్చులకు సైతం డబ్బులు ఇచ్చినట్లుగా సమాచారం. అభ్యర్థులు మాత్రం గెలిస్తేనే తమకు సంక్రాంతి అని ఓటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేసారు.

డీలా పడ్డ ప్రతిపక్షాలు

ఉమ్మడి జిల్లాలోని 17 మున్సిపాలిటీల పరిధిలో టీఆర్‌ఎస్‌ పార్టీ దూకుడుగా ప్రచారం ప్రారంభించింది. సంక్రాంతి రోజు కూడా పార్టీ నేతలు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిశారు. చేసిన అభివృద్ధిని వివరిస్తూ.. తమకు మద్దతు తెలపాలని కోరారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలను ప్రజలకు వివరించి మున్సిపాలిటీలోనూ అవకాశం కల్పించాలని కోరారు. పథకాలనే ప్రచారాస్ర్తాలుగా మార్చుకుని ఇంటింటికి తిరుగుతున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలకు ప్రజలు సైతం బ్రహ్మరథం పడుతున్నారు. 14వ తేదీ నాడు ఉపసంహరణలు పూర్తయి... అభ్యర్థులు ఎవరో తేలిపోయిన మరుక్షణం నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ పక్కా వ్యూహంతో ప్రచారంలోకి దిగింది. అప్పటికే దిశానిర్దేశం చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం వెంటనే కార్యక్షేత్రంలోకి దిగి ప్రచారంలో పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌లో గురువారం మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ 2,3,6,7,9,10,22 వార్డుల్లో సుడిగాలి పర్యటన చేసి ప్రచారంలో పాల్గొన్నారు. అభ్యర్థులను వెంటపెట్టుకుని ఓటర్లకు చేసింది చెబుతూ...

చేయబోయేది వివరిస్తూ ముందుకు సాగారు. మహబూబ్‌నగర్‌ నుంచి ప్రతిపక్షాలు పూర్తిగా డీలా పడ్డాయి. 49వార్డులకు గాను ఇప్పటికే ఓ వార్డును అధికార పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకోగా... బీజేపీ కేవలం 36 వార్డుల్లో, కాంగ్రెస్‌ 40 వార్డుల్లో మాత్రమే పోటీ చేస్తున్నాయి. వనపర్తిలో మంత్రి నిరంజన్‌ రెడ్డి సుడిగాలి ప్రచారం చేపట్టారు. పట్టణంలోని 1,2,3,5,7,11,18,19,20, 30, 31, 32, 33 వార్డుల్లో ఇప్పటికే ప్రచారం పూర్తి చేశారు. పెబ్బేరు మున్సిపాలిటీలకు సంబంధించి మంత్రి నిరంజన్‌ రెడ్డి ఇప్పటికే ఓ కార్యచరణ రూపొందించారు. వనపర్తిలో 5వ వార్డు టీఆర్‌ఎస్‌ పార్టీకి ఏకగ్రీవమైంది. వనపర్తిలో మిగిలిన 32 స్థానాలకు గాను టీఆర్‌ఎస్‌ పార్టీ అన్నిచోట్ల పోటీ చేస్తుంటే కాంగ్రెస్‌ 27, బీజేపీ 26 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను దింపింది. ప్రతిపక్షాలకు అభ్యర్థులు కూడా దొరకకపోవడం చూస్తే పోటీ ఎలా ఉందో అర్థం అవుతున్నది. పెబ్బేరులో బీజేపీ 12 స్థానాలకు గాను కేవలం 6 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్నది. భూత్పూర్‌, కొత్తకోట ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. నారాయణపేటలో ఎమ్మెల్యే రాజేందర్‌ రెడ్డి ఇప్పటికే తన ప్రచారం విస్తృతంగా చేపట్టారు. జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సైతం నారాయణపేటలో ప్రచారం నిర్వహిస్తున్నారు. నారాయణపేటలో కాంగ్రెస్‌ పార్టీ 6 చోట్ల అభ్యర్థులనే నిలపలేకపోయింది. ఇక మక్తల్‌, ఆత్మకూరు, అమరచింతలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు.

మక్తల్‌లో కాంగ్రెస్‌కు 3 చోట్ల అభ్యర్థులు కరువయ్యారు. కోస్గిలో ఎమ్మెల్యే నరేందర్‌ రెడ్డి ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. గద్వాలలో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ రెడ్డి ముమ్మర ప్రచారం చేస్తున్నారు. అందరికంటే ముందే చైర్మన్‌ అభ్యర్థిని ప్రకటించి రేసులో ప్రతిపక్షాలకు ఛాన్స్‌ లేకుండా చేశారు. గద్వాలలో 37 స్థానాలకు గాను కాంగ్రెస్‌ కేవలం 25 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలంపూర్‌, వడ్డేపల్లి, అయిజలో ఎమ్మెల్యే అబ్రహం అన్నీతానై ప్రచారం చేస్తున్నారు. అయిజలో 20 స్థానాలకు గాను బీజేపీ 15చోట్ల, వడ్డేపల్లిలో 10 స్థానాలకు గాను 6చోట్ల, 10కి గాను 6 చోట్ల మాత్రమే పోటీ చేస్తోంది. నాగర్‌ కర్నూలులో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి అభ్యర్థుల తరఫున జోరుగా ప్రచారం చేస్తున్నారు. కల్వకుర్తిలో ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక్కడ22 స్థానాలకు గాను బీజేపీ 17 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది. కాస్తో కూస్తో బలంగా ఉండే స్థానమని చెప్పుకునే బీజేపీకి ఇక్కడ అభ్యర్థులు లభించకపోవడం విశేషం. ఇక కొల్లాపూర్‌లో ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ రెడ్డి ప్రచారంలో ముందున్నారు. పార్టీకి చెందిన వారు రెబెల్స్‌గా పోటీ చేస్తున్నా... పార్టీ  అభ్యర్థుల కోసం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎంపీలు రాములు, మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, దామోదర్‌ రెడ్డి, జెడ్పీ చైర్‌ పర్సన్లు, పార్టీ ఇంచార్జులు, ఇతర ముఖ్యనేతలు అంతా ఒక్కటై ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు.

స్టార్‌ క్యాంపెయినర్లు కాదు కదా...

అధికార పార్టీ అట్టహాసంగా ప్రచారం చేస్తుంటే ప్రతిపక్షాల పరిస్థితి మాత్రం దయనీయంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కనీసం ప్రచారంలో ఓ స్థాయి నేతలు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. స్టార్‌ క్యాంపెయినర్లు కాదు కదా కనీసం ఎమ్మెల్యే కూడా లేకుండా ప్రచారం చేస్తున్నారని... ఇలాంటి చోట్ల వారికి జనం నుంచి ఆదరణ కష్టం అని అంచనా వేస్తున్నారు. చాలా చోట్ల అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితితో విపక్షాలు సతమతమవుతున్నాయి. ఇప్పటికే అన్ని ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిన ప్రతిపక్షాలు కనీసం ఈ ఎన్నికల్లో పరువైనా నిలుపుకునేందుకు పాకులాడుతున్నాయి. నేతల మధ్య సఖ్యత లేమి, ముఖ్యమైన నేతలు ప్రచారంలో కనిపించకపోవడం ప్రతిపక్షాలకు ఇబ్బందిగా మారింది. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో హంగామా చేసిన ముఖ్య నేతలు ఇప్పుడు ముఖం చాటేయడంపై ఆ పార్టీల కార్యకర్తలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.logo
>>>>>>