గురువారం 02 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 15, 2020 , 03:56:48

గులాబీ దూకుడు

 గులాబీ దూకుడు


మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పుర పోరులో ప్రధాన ఘట్టం ముగిసింది. ఉపసంహరణలు పూర్తయి అభ్యర్థులెవరో తేలిపోయింది. దీంతో అభ్యర్థులు తమకే ఓటెయ్యాలంటూ ప్రచారం ప్రారంభించారు. ఇప్పటికే అభ్యర్థులుగా దాదాపుగా ఖరారైన వారు మాత్రం గతంలోనే ప్రచారం మొదలుపెట్టారు. అధికారికంగా బీ ఫారాలు అందచేసిన తర్వాత ప్రచారం మరింత ఊపందుకున్నది. టిక్కెట్లు దక్కని వారిని వివిధ పార్టీల నాయకులు బుజ్జగించి ప్రచారంలో పాల్గొనేలా జాగ్రత్త పడ్డారు. అయితే టీఆర్‌ఎస్‌ పార్టీలోనే టికెట్లు ఆశించిన వారు ఎక్కువగా ఉన్నారు. అయినా పార్టీ నిర్ణయం మేరకు తమకు టికెట్లు దక్కకపోయినా పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లాలో ఏకగ్రీవాలతో టీఆర్‌ఎస్‌ పార్టీ సత్తా చాటింది. అత్యంత పోటీ ఉండే పుర పోరులోనూ నాగర్‌కర్నూల్‌ మినహా అన్ని జిల్లాల్లో ఒక్కో స్థానం చొప్పున 4 స్థానాలను టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. మేమూ మున్సిపాలిటీల్లో సత్తా చాటుతామంటూ గొప్పలు చెప్పుకుంటున్న  కాంగ్రెస్‌, బీజేపీలకు చాలా చోట్ల కనీసం అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఎదురైంది. ఇక టీడీపీ ఉమ్మడి పాలమూరులో దాదాపుగా కనుమరుగైంది. వామపక్షాలు సైతం పోటీలో అభ్యర్థులను నిలబెట్టేందుకు కూడా అపసోపలు పడ్డారు. పోలింగ్‌కు ముందే ప్రతిపక్షాలు చేతులెత్తెయ్యడంతో అధికార పార్టీ అభ్యర్థులు రెట్టింపు ఉత్సాహంతో ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. తమ గెలుపు నల్లేరు మీద నడకే అని టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ పూర్తవ్వడంతో అభ్యర్థులు ప్రచార పర్వానికి తెర తీశారు. ప్రచారానికి ఇంకా కేవలం 6 రోజులు మాత్రమే గడువుండటంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

ఏకగ్రీవాలతో సత్తా చాటిన అధికార పార్టీ

ఉమ్మడి జిల్లాలోని 17మున్సిపాలిటీల పరిధిలో ఉన్న 338 వార్డుల్లో 4 వార్డులను ఏకగ్రీవంగా కైవసం చేసుకుని టీఆర్‌ఎస్‌ పార్టీ సత్తా చాటింది. మహబూబ్‌నగర్‌ 5వ వార్డులో కె. వనజ, కోస్గి 10వ వార్డులో అనిత, ఆలంపూర్‌ 5వ వార్డులో ఎరుకలి దేవన్న, వనపర్తి 5వ వార్డులో శాంతమ్మ ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా మినహా ఉమ్మడి జిల్లాలోని 4 జిల్లాల్లోనూ ఒక్కో వార్డు చొప్పున టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు సత్తా చాటారు. ప్రతిపక్షాల నుంచి కనీసం పోటీ చేసేందుకు అభ్యర్థులు సైతం నిలవని పరిస్థితి నెలకొన్నది. పోలింగ్‌కు ముందే 4 వార్డులు కైవసం చేసుకోవడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాల్టీలు సులభంగా కైవసం చేసుకుంటామనే ధీమాగా ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

ప్రతిపక్షాల ఢీలా..

ప్రతిపక్షాలకు ఈ ఎన్నికలు ఇబ్బందికరంగా మారాయి. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా పోవడంతో ఏ అంశాన్ని తీసుకుని ఎన్నికల బరిలో నిలవాలో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. అన్ని మున్సిపాలిటీల్లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ బలంగా ఉండటంతో పలుచోట్ల కనీసం పోటీ చేసేందుకు కూడా అభ్యర్థులు చిక్కని పరిస్థితి తలెత్తింది. కొత్తగా ఏర్పడిన అమరచింత మున్సిపాలిటీలో 10 వార్డులకు గాను కాంగ్రెస్‌ నుంచి కేవలం 5 వార్డులకు మాత్రమే పోటీ చేశారు. బీజేపీ నుంచి 9 వార్డులకు మాత్రమే పోటీ చేశారు. ఇక కొత్తగా ఏర్పడిన మరో మున్సిపాలిటీ కొత్తకోటలోనూ 15 వార్డులకు బీజేపీ నుంచి 12 వార్డులకు మాత్రమే పోటీలో అభ్యర్థులు నిలిచారు. ఇక వనపర్తిలో పరిస్థితి చూస్తే ప్రతిపక్షాల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మొత్తం 33 స్థానాలకు గాను టీఆర్‌ఎస్‌ 5వ వార్డును ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నది. ఇక మిగిలిన 32 వార్డులకు గాను కాంగ్రెస్‌ 27, బీజేపీ 26, టీడీపీ 10 వార్డుల్లో పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్‌, టీడీపీ ఇంకా తమ తెరచాటు బంధాన్ని చాటుతూనే ఉన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ నామినేషన్లు వేసిన 13,22,25 వార్డుల్లో కాంగ్రెస్‌ నుంచి అభ్యర్థులు పోటీ చేయలేదు. మొత్తానికి 5 చోట్ల కాంగ్రెస్‌ పార్టీకి అభ్యర్థులే లేని పరిస్థితి. ఇక టీడీపీ ముఖ్య నేత రావుల ఉన్న వనపర్తిలో ఆ పార్టీ కేవలం 10 చోట్ల మాత్రమే పోటీ చేస్తోంది. అంటే రెండు పార్టీలు సైతం వనపర్తిలో కనీసం అభ్యర్థులు సైతం దొరకని పరిస్థితిని ఎదుర్కుంటున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గద్వాలలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. 37 వార్డులకు గాను 25 మంది మాత్రమే పోటీ చేస్తున్నారు. బీజేపీ 36 వార్డుల్లో మాత్రమే అభ్యర్థులను నిలిపింది. అయిజలో 20 వార్డులకు గాను బీజేపీ 15 వార్డుల్లో మాత్రమే పోటీ చేస్తోంది. వడ్డేపల్లిలో 10 వార్డులకు గాను బీజేపీ 6 చోట్ల మాత్రమే పోటీలో ఉంది. ఆలంపూర్‌లో ఒక వార్డు ఏకగ్రీవం కాగా 9 వార్డులకు గాను బీజేపీ 6 చోట్ల మాత్రమే అభ్యర్థులను దించింది. మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీలో 49 వార్డులకు గాను ఒక వార్డు ఏకగ్రీవం కాగా టీఆర్‌ఎస్‌ పార్టీ అన్ని వార్డుల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ 40 వార్డుల్లో, బీజేపీ 38 వార్డుల్లో మాత్రమే పోటీ చేస్తోంది. జాతీయ పార్టీలుగా గొప్పలకు పోతున్న కాంగ్రెస్‌, బీజేపీలు అభ్యర్థులను నిలిపే పరిస్థితి లేదు.

చేతులెత్తేసిన ప్రతిపక్షాలు..!

పురపోరులో ప్రతిపక్షాలు కనీసం అభ్యర్థులను సైతం నిలిపే పరిస్థితి లేకపోవడంపై రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుని ఊపుమీదున్న టీఆర్‌ఎస్‌ పార్టీ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించింది. అసెంబ్లీ, పార్లమెంట్‌, పంచాయతీ, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌... ఇలా అన్ని ఎన్నికల్లోనూ విజయం టీఆర్‌ఎస్‌ పార్టీనే వరించింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఎంతో ఉత్సాహంగా మున్సిపల్‌ పోరుకు సిద్ధమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో జాగ్రత్తగా ఎన్నికల బరిలో నిలవాల్సిన ప్రతిపక్షాల్లో కనీసం ఓ వ్యూహం అంటూ కనిపించలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కనీసం అభ్యర్థులను నిలపకుండా ఎలా ఎన్నికల్లో విజయం సాధిస్తారో అర్థం కావడం లేదని అంటున్నారు. ఎన్నికలకు ముందే ప్రతిపక్షాలు చేతులెత్తేసినట్లు కనిపిస్తోందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గెలుపు ధీమాలో..

వరుసగా జరిగిన అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధించిన అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మున్సిపల్‌ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రతిపక్షాలు ఎన్నో గొప్పలు చెప్పుకుని ఎన్నికల బరిలోకి దిగినా.. కనీసం అభ్యర్థులను సైతం పోటీలో పెట్టే పరిస్థితి లేక ఎన్నికలకు ముందే చేతెలెత్తేశారని టీఆర్‌ఎస్‌ నేతలు పేర్కొంటున్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలను గెలిపిస్తాయని గులాబీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే ఊపుతో ప్రచారంలో పాల్గొంటున్నారు.logo
>>>>>>