మంగళవారం 31 మార్చి 2020
Wanaparthy - Jan 15, 2020 , 03:55:22

బల్దియాల బరిలో 342 మంది

బల్దియాల బరిలో 342 మంది


వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల్లో బరిలో నిలిచే వారెవరో తేలిపోయింది. మంగళవారం ఉపసంహరణల గడువు ముగియడంతో మిగిలిన వారి జాబితాలను ఎన్నికల అధికారులు విడుదల చేశారు. ఉపసంహరణల అనంతరం మిగిలిన అభ్యర్థులకు ఆయా పార్టీల బీఫాంలను అందజేయడంతో ఆయా కాలనీల్లో మున్సిపల్‌ రాజకీయం రక్తి కడుతుంది. వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింతల్లో ఉపసంహరణల గడువు ముగియడంతో మున్సిపల్‌ రాజకీయం వేడెక్కుతుంది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో మొత్తం 80 వార్డులుంటే, 342 మంది బరిలో నిలిచారు. వీరిలో స్వతంత్రులు 92 మంది వరకు ఉన్నారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో ఏకాభిప్రాయ సాధనలో మెజార్టీ వార్డుల్లో పైచేయి సాధించారు. మరికొన్నింటిలో ససేమిరా అన్న వారిని వదిలి గెలుపు గుర్రాలను గుర్తించారు. అన్ని వార్డుల్లో ఒకటి నుంచి నలుగురు వరకు అభ్యర్థులు బీఫాంలను ఆశించి నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, ప్రధాన నాయకులు మూడు రోజులుగా వార్డుకు సరియైన అభ్యర్థిని గుర్తించి మిగిలిన వారిని ఉపసంహరణ చేసుకునేలా దారికి తెచ్చారు. ఇక ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీలు కూడా ఆయా వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థులకు బీఫాంలను పంపిణీ చేయడంతో మున్సిపల్‌ రాజకీయం వేడెక్కుతుంది. రెబల్స్‌ బెడదను నివారించేందుకు పార్టీలు అత్యంత ప్రాధాన్యతనిచ్చాయి. ఇదిలా ఉంటే, వనపర్తి మున్సిపాలిటీలో ఒక్క 5వ వార్డు టీఆర్‌ఎస్‌కు ఏకగ్రీవమైంది. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణకు గురికావడం, మిగిలిన మరో ఇద్దరు ఉపసంహరణ చేసుకోవడంతో శాంతి (టీఆర్‌ఎస్‌) అనే మహిళకు అదృష్టం కలిసి వచ్చింది.

అందిన బీఫాంలు..

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు అన్ని పార్టీల నుంచి బీఫాంలు చేతికందాయి. ఉపసంహరణ గడువుకు ముందే కొన్ని ముఖ్య అనుచరుల వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని ఆయా పార్టీలు పూర్తి చేశాయి. గడువులోపు బీఫాంలను అందించడం ద్వారానే ఆ అభ్యర్థులను ఆయా పార్టీ వారిగా గుర్తించేందుకు వీలవుతుంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలు బీఫాంలను అందించడంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నాయి. రెండు రోజుల కిందట పార్టీలోని కొందరు ముఖ్యులకు పార్టీ బీఫాంలను అందించారు. కొన్ని వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నచోట ఏకాభిప్రాయం తెచ్చిన అనంతరం బీఫాంలను అందజేశారు. బీఫాంలు చేతపట్టుకోవడం.. బరిలో నిలవడం అన్నది తేలిపోవడంతో ఇక పూర్తి స్థాయిలో ఎన్నికల సమరానికి సై అంటూ అభ్యర్థులు కాలనీల వైపు దారికట్టారు.

సంక్రాంతి సంబురంలో..

జిల్లాలో సంక్రాంతి పండుగ ఒకవైపు సంబురంగా సాగుతుంటే.. మున్సిపల్‌ ఎన్నికల కోలాహలం అదనంగా తోడైంది. మంగళవారం భోగి మంటల వేడి పట్టణాల్లో ఉంటే, ఇందుకు ఆయా పార్టీల నాయకుల పర్యటనలు మరింత రాజకీయ వేడిని రగిలించాయి. ఓటర్లకు రెండు పండుగలు కలిసి వచ్చినట్లుగా మున్సిపాలిటీల్లో కనిపిస్తుంది. ప్రచారాలకు వార్డులకు వెళ్లినప్పుడు పండుగతోనే అభ్యర్థుల పలకరింపు మొదలవుతుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పండుగ సందర్భం కూడా అభ్యర్థులకు కలిసి వచ్చింది. మరికొందరు ఔత్సాహిక అభ్యర్థులు ఓటర్లతోనే కలిసి భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను చేసుకునేందుకు కూ డా ప్రణాళిక చేసుకుంటుండటం ఆసక్తిని కలిగిస్తుంది.logo
>>>>>>