మంగళవారం 31 మార్చి 2020
Wanaparthy - Jan 14, 2020 , 02:32:33

ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలి

ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలి
  • - రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నాగిరెడ్డి


వనపర్తి, నమస్తే తెలంగాణ : మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నాగిరెడ్డి జిల్లా కలెక్టర్లతో కోరారు. మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణ విషయమై సోమవారం ఆయన హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసినందున ఈనెల 14వ తేదీన ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థుల తుది జాబితా ప్రకటన, పోలింగ్‌ సిబ్బంది, అదనపు సిబ్బంది నిర్దారణ, శిక్షణ తరగతుల నిర్వహణ వంటి అంశాలలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల విషయంలో కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, అవసరమైన పోలింగ్‌ కేంద్రాలు, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేయాలని చెప్పారు. బ్యాలెట పేపర్‌ ముద్రణలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రత్యేకంగా ప్రతి బ్యాలెట్‌ పేపర్‌ను రిటర్నింగ్‌ అధికారులు తనిఖీ చేయాలని పోస్టల్‌ బ్యాలెట్‌కు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతి కేంద్రం వద్ద పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మున్సిపల్‌ పరిపాలన శాఖ సంచాలకులు టీకే శ్రీదేవి, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్‌లు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

గుర్తులపై జాగ్రత్తలు తీసుకోవాలి : కలెక్టర్‌

వనపర్తి, గద్వాలజోగుళాంబ జిల్లా అధికారులతో కలెక్టర్‌ మాట్లాడుతూ అభ్యర్థులకు గుర్తుల కెటాయింపు విషయంలో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బ్యాలెట్‌ పేపర్‌ ముద్రణ సందర్భంగా ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే సంబంధిత ఆర్డీవోల సాయం తీసుకోవాలని, వార్డుల వారిగా బ్యాలెట్‌ ముద్రణ ప్రారంభించాలని, వీటన్నింటిని పరిశీలించేందుకు అన్ని మున్సిపాలిటీ సూపర్వైజర్‌ అధికారులను నియమిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈనెల 18లోపు ఎన్నికలకు నియమించబడిన ఉద్యోగులు వారి పోస్టల్‌ బ్యాలెట్‌ ఫారాలను సమర్పించాలని కలెక్టర్‌ తెలిపారు. పెబ్బేర్‌ మున్సిపల్‌ కమిషనర్‌, జిల్లా ప్రత్యేక అధికారి సంతోశ్‌, జేసీ వేణుగోపాల్‌, వనపర్తి, గద్వాల జిల్లాల మున్సిపల్‌ కమిషనర్లు, నోడల్‌ అధికారులు, ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.

‘డాటా ఎంట్రీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి’

వనపర్తి, నమస్తే తెలంగాణ : ఈచ్‌వన్‌ టీచ్‌వన్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో గుర్తించిన నిరక్ష్యరాసుల డేటా ఎంట్రీ కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్‌ శ్వేతామొహంతి పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. సోమవారం ఆమె తన ఛాం బర్‌ నుంచి జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులతో ఈచ్‌వన్‌ టీచ్‌వన్‌ కార్యక్రమంపై వీడి యో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఆయా గ్రామ పంచాయతీల వారిగా జనాభా ఆధారంగా నిరక్షరాస్యులను గుర్తించడంతో పాటు డేటా ఎంట్రీ కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేయాలని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు లక్ష పదివేల మంది నిరక్షరాస్యుల సమాచారం సేకరించగా 60వేల మంది సమాచారాన్ని డేటా ఎంట్రీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. డేటా ఎంట్రీలో ఎలాంటి తప్పులు లేకుండా చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ వేణుగోపాల్‌, డీఆర్డీవో గణేశ్‌, డీపీవో రాజేశ్వరి ఉన్నారు.

ఒడిశా కోస్టర్‌ ట్రేకింగ్‌ శిబిరానికి ఎన్‌సీసీ విద్యార్థులు

వనపర్తి విద్యావిభాగం : రాష్ట్రస్థాయిలో ఒడిశా రాష్ట్రం లో కోస్తా తీరం వెంబడి జరుగనున్న ఎన్‌సీసీ శిక్షణ శిబిరానికి వనపర్తి ప్రభుత్వ డిగ్రీ పురుషుల కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారని ఎన్‌సీసీ అధికారి లెప్టినెంట్‌ శ్రీనివాసులు తెలిపారు. కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న పీ శంకర్‌, సతీశ్‌లు ఈ శిబిరానికి ఎంపికయ్యారని, ఈ శిబిరంలో ప్రతిరోజు సగటున 10కిలో మీటర్లు నడకతో తీర ప్రాంతం వెంబడి ఉండే కొండలలో కొనసాగుతుందని పేర్కొన్నారు. జనవరి 15 నుంచి 26వ తేదీ వరకు ఈ శిబిరం జరుగనుందని అన్నారు. ఎంపికైన సందర్భంగా విద్యార్థులను ఆయన అభినందించారు.logo
>>>>>>