శనివారం 28 మార్చి 2020
Wanaparthy - Jan 14, 2020 , 02:30:44

పండుగకు ఊరేళ్తున్నారా.. జర భద్రం

పండుగకు ఊరేళ్తున్నారా.. జర భద్రం
  • - ఎస్పీ అపూర్వరావు

వనపర్తి టౌన్‌ : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఇండ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లేవారు తమ ఇళ్లపై ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ అపూర్వరావు అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి కొత్త వ్యక్తుల కదలికపై దృష్టి సారించాలని ఆమె సూచించారు. ఈ పండుగకు కార్యాలయాలకు, విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వడంతో అందరు తమ తమ స్వగ్రామాలకు వెళ్లి బంధువులతో కలిసి పండుగను సంతోషంగా జరుపుకుంటారని అన్నారు. ఇదే అదునుగా తీసుకొని కొన్ని దొంగల ముఠాలు తాళాలు వేసిన ఇండ్లను ముందుగా రెక్కి చేసుకొని దొంగతనాలకు పాల్పడుతుంటారని ఆమె అన్నారు.  ఊళ్లకు వెళ్లే వారు ముందుగానే సమాచారాన్ని సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో తెలియజేయాలని తెలిపారు. ఎక్కువ మొత్తంలో నగదు, బంగారు, విలువైన వస్తువులు ఇంట్లో వదిలి వెళ్లరాదని జిల్లా ప్రజలకు ఆమె చెప్పారు. కాలనీలలో కొత్త వ్యక్తులు కనిపిస్తే సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లకు గానీ పోలీస్‌ అధికారులకు కానీ తెలపాలన్నారు. అదేవిధంగా ఊళ్లకు వెళ్లేటప్పుడు ప్రయాణం చేసే సమయంలో కూడా దొంగలు ఉంటారని అందుకు తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. బస్సులో ప్రయాణం చేసేటప్పుడు విలువైన అభరణాలు, నగదు ఉన్న బ్యాగులను బస్సు సీట్లపై ఉంచి టీ త్రాగడానికి, టాయిలెట్స్‌కు వెళ్లవద్దని, బస్సు ఎక్కే సమయంలో పక్కన ఉన్నవారిని గమనిస్తు బస్సు ఎక్కాలని సూచించారు. కొత్త వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్‌ 100, కంట్రోల్‌ రూం 0854521100 నంబర్లకు లేదా సంబంధిత పోలీస్‌ అదికారులకు పోన్‌ చేసి సమాచారం ఇచ్చి దొంగతనాలు జరుగకుండా పోలీసులకు సహాకరించాలని ఆమె కోరారు. ఎల్లప్పడు  ప్రజల రక్షణకు వనపర్తి జిల్లా పోలీసులు ముందుంటారని అన్నారు. పండుగలు సంతోషంగా కుటుంబ సభ్యులు, బందువులతో కలిసి జరుపుకోవాలని జిల్లా ఎస్పీ అపూర్వరావు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
logo