మంగళవారం 31 మార్చి 2020
Wanaparthy - Jan 12, 2020 , 03:56:08

పరిశీలన పూర్తి

పరిశీలన పూర్తి
  • -రెండు నామినేషన్ల తిరస్కరణ
  • -వనపర్తి, పెబ్బేరులో ఒక్కోటి చొప్పున..
  • -గులాబీని వరించిన వనపర్తి ఐదో వార్డు
  • -ఏకగ్రీవమైన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శాంతి
  • -ప్రజల ఆశీస్సులు టీఆర్‌ఎస్‌కే..
  • -మరింత అభివృద్ధి చేసి చూపిస్తాం
  • -అభినందించిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శనివారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల వారీగా జరిగిన కార్యక్రమంలో అధికారులు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలన జరిపారు. ఫలితంగా కొన్ని నామినేషన్లు తిరష్కరణకు గురయ్యాయి. అయితే, వయస్సు సరిపడని రెండు నామినేషన్లు తిరష్కరణకు గురయ్యాయని ఎన్నికల అధికారులు ప్రకటించారు. వీటిలో వనపర్తి, పెబ్బేరు మున్సిపాలిటీలకు చెందిన ఒక్కొక్క వార్డులో వయస్సు సరిపడని రీత్యా వారి నామినేషన్లపై అనర్హత వేటు పడింది. అయితే, ఈ రెండు నామినేషన్లు కూడా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అభ్యర్థులకు చెందినవిగా గుర్తించారు. కాగా, వనపర్తి ఐదో వార్డు ఎస్టీ మహిళలకు రిజర్వు అయింది. ఈ వార్డులో మొత్తం ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి నలుగురు నామినేషన్లు వేస్తే.. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఒక్కరు నామినేషన్‌ వేశారు.

కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థికి చెందిన మహిళ ఎస్‌ఎస్‌ఎస్సీ సర్టిఫికెట్‌ను విద్యార్హతకు జత చేసింది. కాగా, ఈ సర్టిఫికెట్‌ ఆధారంగా వయస్సు సరిపోనందునా ఈ నామినేషన్‌ను తిరష్కరించినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే పెబ్బేరులోను 3 వార్డులోను కాంగ్రెస్‌ పార్టీ బీఫాం ఆశించి నామినేషన్‌ వేసిన అభ్యర్థి నామినేషన్‌ వయస్సు రీత్యా తిరష్కరణకు గురైంది. అయితే, ఎన్నికల్లో పోటీ చేయాలంటే 21 సంవత్సరాలు నిండి ఉండాలనే నిబంధనతో ఈ రెండు నామినేషన్లు పరిశీలనలో తిరష్కరించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇక మిగిలిన కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీల నుంచి వేసిన అన్ని నామినేషన్‌ పత్రాలు సక్రమంగానే ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. కాగా, పరిశీలన అనంతరం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల వారీగా మిగిలిన నామినేషన్ల వివరాలు పరిశీలిస్తే.. టీఆర్‌ఎస్‌ 204, కాంగ్రెస్‌ 125, బీజేపీ 97 , టీడీపీ 31, సీపీఎం 22, సీపీఐ 7, ఎంఐఎం 1, స్వత ంత్రులకు సంబంధించి 86 నామినేషన్లు ఉన్నాయి.

టీఆర్‌ఎస్‌కు కలిసొచ్చిన అదృష్టం

నామినేషన్ల పరిశీలనలోను అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి అదృష్టం కలిసి వచ్చిందని చెప్పాలి. కలిసొచ్చే కాలానికి.. ఎదురొచ్చే కొడుకన్నట్లుగా సునాయసంగా ఒక వార్డును టీఆర్‌ఎస్‌ ఖాతాలో జమ చేసుకుంది. వనపర్తి మున్సిపాలిటీలోని ఐదో వార్డు ఎస్టీ మహిళలకు రిజర్వు అయింది. అక్కడ ఐదు నామినేషన్లు వేస్తే, వాటిలో నాలుగు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులవే. మిగిలిన ఒక్కటి కాంగ్రెస్‌కు చెందిన మహిళ వేసింది. అయితే, కాంగ్రెస్‌ పార్టీ నుంచి వేసిన నామినేషన్‌లో వయస్సు సరిపడనందునా తిరష్కరణకు గురైంది. అనంతరం టీఆర్‌ఎస్‌లోని మిగిలిన ముగ్గురు సభ్యులు కూడా ఉపసంహరణ చేసుకోవడంతో టీఆర్‌ఎస్‌కు కలిసి వచ్చింది. ఇక ఆ వార్డు నుంచి శాంతి అనే మహిళ ఒక్కరే రంగంలో మిగలడంతో టీఆర్‌ఎస్‌ పార్టీలో చెప్పలేని ఆనందం నిండుకున్నది.

ప్రజల ఆశీస్సులు టీఆర్‌ఎస్‌కే

మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులు టీఆర్‌ఎస్‌ పార్టీకే ఉన్నాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి చెప్పారు. జిల్లా కేంద్రంలోని 5వ వార్డులో ఏకైక టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మిగిలిన శాంతిని మంత్రి నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్ష్యంలో అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాల అమలులో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని అన్నారు. పార్టీలకు అతీతంగా పథకాలను ప్రజలకు అందిస్తూ.. అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనిస్తున్నట్లు మంత్రి చెప్పారు. సాగునీటి వసతులు సమకూర్చడం వల్ల నేడు పల్లెల స్వరూపం మారిపోయిందని, రాబోయే నాలుగేళ్లలో మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని మంత్రి భరోసాగా ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజల కోసం పని చేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విదానాలకు ప్రజలకు వివరించి ప్రజల మద్ధతు కోరాలని పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకే ఉంటాయని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ ఎన్నారై యూత్‌ ప్రెసిడెంట్‌ అభిలాశ్‌, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు గట్టుయాదవ్‌, మాజీ కౌన్సిలర్లు రమేశ్‌గౌడ్‌, వాకిటి శ్రీధర్‌, పాకనాటి కృష్ణయ్య, ప్రమీలమ్మ, లక్ష్మీనారాయణ, తిరుమల్‌, గిరి, నాయకులు పాల్గొన్నారు.


logo
>>>>>>