శనివారం 04 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 12, 2020 , 03:52:29

యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం

యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం

మదనాపురం : ఆటోమెటిక్‌ సైఫన్‌సిష్టం కలిగినటువంటి సరళాసాగర్‌ ప్రాజెక్టుకు గండిపడి నీరంతా దిగువ ప్రాంతానికి వృథాగా పోయిన ఘటన తెలిసినదే. ప్రాజెక్టుకు గండి పడిన విషయాన్ని ఇటీవల సీఎం కేసీఆర్‌ దృష్టికి మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తీసుకెల్లగా, తక్షణమే స్పందించిన సీఎం నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడుతూ ప్రాజెక్టుకు గండిపడిన ప్రాంతానికి త్వరగా మరమ్మతులు చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఈ క్రమంలో శనివారం (ఈఎన్‌సీ) మురళీధర్‌రావు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, సంబంధిత అధికారులతో కలిసి సరళాసాగర్‌ ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టులో గండిపడిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, అధికారులకు తగు సూచనలు చేశారు. అనంతరం ప్రాజెక్టు ప్రాంతంలో ఎడమకాల్వ తూము వరకు నూతనంగా ఏర్పాటు చేస్తున్న కాల్వను పరిశీలించారు. ఈ సందర్భంగా మురళీధర్‌ రావు మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పనులు చేపడతామని అన్నారు. అదే సమయంలో ప్రాజెక్టుకు సంబంధించిన ఎడమకాల్వ ద్వారా రైతుల పంటపొలాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఆయకట్టు పునఃనిర్మాణ పనులలో భాగంగా ప్రాజెక్టు ప్రాంతంలో ఉన్న ఒండ్రుమట్టిని తొలగించి, నీటినిల్వ సామర్థ్యం పెంచాలని ఇంజినీరింగ్‌ అధికారులను కోరగా, అధికారులు సానుకూలంగా స్పందించారు.

 ప్రాజెక్టును పరిశీలించిన వారిలో రాష్ట్ర చిన్ననీటి పారుదల శాఖ ఈసీ అమీద్‌ఖాన్‌, సీఈవో శ్రీనివాసులు, ఎస్‌ఈలు నర్సింగరావు, చంద్రశేఖర్‌, ఏఈలు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జయంతి, జెడ్పీటీసీ కృష్ణయ్య, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు వడ్డెరాములు, ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్‌ హనుమాన్‌రావు, ప్రచార కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి అధికారులు తదితరులు పాల్గొన్నారు.


logo