e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home జిల్లాలు జంతు సం‘రక్షకుడు’

జంతు సం‘రక్షకుడు’

పర్యావరణ ప్రేమికుడు కృష్ణసాగర్‌
ఓవైపు విధులు మరో వైపు మూగజీవాల సంరక్షణ
సాగర్‌ స్నేక్‌ సొసైటీ పేరుతో అభాగ్యులకు అండగా..
సొంత ఖర్చులతో సురక్షిత ప్రాంతాలకు వన్యప్రాణులు
పాము పడితే మొక్క నాటాలన్న నినాదంతో ముందుకు ..

వనపర్తి, జూలై31: పర్యావరణ, జంతు సంరక్షకుడు కృష్ణసాగర్‌. ట్రాఫిక్‌ విభాగంలో హోంగార్డుగా పనిచేస్తూనే మూగజీవాలను రక్షిస్తున్నాడు. సాగర్‌ స్నేక్‌ సొసైటీ పేరిట కొంతమంది యువకులతో కలిసి మూగజీవాలను కాపాడి తర్వాత సొంత ఖర్చులతో వాటిని సురక్షిత, అటవీ ప్రాంతాలకు తీసుకెళ్లి విడిచిపెడుతున్నాడు. పాము పడితే మొక్కలు నాటాలన్న నినాదంతో ముందుకెళ్తున్నాడు. మతిస్థిమితం లేని అభాగ్యులకు అండగా నిలుస్తున్న యువకుడిపై ‘నమస్తే’ ఆదివారం ప్రత్యేక కథనం.

సాధారణంగా పోలీసు అంటేనే మనస్సులో ఏదో ఒక తెలియని భయం. అలాంటి విధానాన్ని రూపు మాపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. పోలీసుశాఖలో ఓ చిన్నపాటి హోంగార్డు ఉద్యోగం చేస్తున్న కృష్ణసాగర్‌ వనపర్తి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్రంలోకూడా అటు శాఖలో ఇటు ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. నిత్యం ట్రాఫిక్‌ కంట్రోల్‌లో విధులను నిర్వహిస్తూనే మరో వైపు పాములను పట్టుకొని తన సొంత ఖర్చులతో సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు పర్యావరణ ప్రకృతి పరిరక్షణ, ప్లాస్టిక్‌ నివారణ దిశగా కృషి చేస్తున్నారు. గత వర్షాకాలం జిల్లా కేంద్రంలోని శ్వేతానగర్‌లో తాళ్లచెరువు అలుగు పొంగిపొర్లుతున్న సమయంలో తన వంతుగా ఎవరూ బయటకు రావద్దంటూ ప్రచారం చేయడంతోపాటు చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రజల మన్ననలు పొందాడు.

- Advertisement -

జిల్లా పరిసర ప్రాంతాల్లో ఎవరి ఇంట్లోనైనా పాము కనిపిస్తే వెంటనే హోంగార్డు కృష్ణసాగర్‌కు సమాచారాన్ని అందిస్తే క్షణాల్లో అక్కడికి చేరుకొని పామును పట్టుకుంటాడు. దీంతోపాటు ఆ ఇంటి యజమానితో విధిగా మూడేసి మొక్కలను నాటించడం ఆయనకు అలవాటుగా మారింది. అటు మూగజీవాల పరిరక్షణ చేయడంతో పాటు ఇటు పర్యావరణాన్ని రక్షించడం చాలా ఆనందంగా ఉందని హోంగార్డు కృష్ణ చెబుతున్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజల్లో తన వంతుగా మార్పును తీసుకొచ్చేందుకుగానూ ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ అవగాహన కల్పించారు.

ఆసక్తి ఇలా ..
‘తొమ్మిది సంవత్సరాల కిందట తమకు ఉన్న కొద్దిపాటి పొలంలో తల్లిదండ్రులతోపాటు వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించేవాళ్లం. వాళ్లకు మధ్యాహ్న సమయంలో భోజనం చేసే సమయంలో అక్కడ పరిసర ప్రాంతాల్లో తరచూ పాములు కనబడేవి. అవి ఏమైనా చేస్తాయనే ఉద్దేశంతో పాములను చంపే ప్రయత్నం చేసేవాణ్ని. ఆ క్రమంలోనే నాకు పెద్దపాము కరిచింది. వెంటనే ప్రభుత్వ దవాఖానకు వెళ్లగా అక్కడి డాక్టర్లు ఏ పాము అని గుర్తించకపోవడంతోపాటు యాంటిస్నేక్‌ వీనమ్‌ అనే ఇంజెక్షన్‌ను ఇచ్చారు.. ఇంజక్షన్‌ తీసుకున్న తరువాత ఆ పాము విషపూరితం కాదని తెలిసింది. దీంతో శరీరం మొత్తం రియాక్షన్‌కు గురైంది. వెంటనే విరుగుడు ఇంజెక్షన్‌ ఇచ్చి 48 గంటలు పర్యవేక్షణలో ఉంచారు. అప్పుడు పాములన్నీ విషపూరితంగా ఉంటాయా లేదా అన్న అనుమానంతో పూర్తి స్థాయిలో విశ్లేషించి పలువురు వైద్యులను, టీవీ చానల్‌, పత్రికల ద్వారా తెలుసుకొన్నాను. వాటిపై ప్రేమతో ఉంటూ చంపొద్దు, విషపూరితం కాని పాముల వల్ల ఎలాంటి హాని జరుగదని తెలుసుకొని అప్పటి నుంచి ప్రజలకు పాముల్లో విషపూరితం, విషపూరితం కానివి ఏమిటో అవగాహన కల్పిస్తున్నాను. గాయాలైన వన్యప్రాణులకు తన నివాసంలోనే వైద్యాన్ని అందించి గాయం మానిన తరువాత వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నా’ అని కృష్ణసాగర్‌ తెలిపారు.

సొంత ఖర్చులతో ..
కొంతమంది ఉత్సాహవంతులైన యువకులతో కలిసి సాగర్‌ స్నేక్‌ సొసైటీ అనే సంస్థను స్థాపించి వారికి అన్ని రకాలుగా అవగాహనతో శిక్షణ ఇచ్చాడు. తాను అందుబాటులో లేని సమయంలో వారితో పట్టించి వన్యప్రాణులైన పాములు, కొండచిలువలు, మొసళ్లు, జింకలు, నెమళ్లు, గుడ్లగూబలతోపాటు వివిధ రకాలైన పక్షులను పట్టుకొని జూరాల ప్రాజెక్టులో మొసళ్లు, కొండచిలువలు, పాములు, శ్రీశైలం నల్లమల అడవిలో, నెమళ్లను తిరుమలయ్యగుట్ట, బుద్ధారం అటవీ ప్రాంతంలో వదిలి పెట్టడం జరుగుతుంది.

అవార్డులు..
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ దిశగా, సామాజిక సేవలపై రెండు పర్యాయాలు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కలెక్టర్లు శ్వేతామొహంతి, షేక్‌ యాస్మిన్‌ బాషా, ఎస్పీ అపూర్వారావు చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందుకున్నారు.
ఐస్టార్‌ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా రాష్ట్ర సేవా రత్న 2020లో హైదరాబాద్‌లో అవార్డు, ప్రశంసాపత్రాలను అందుకున్నారు.
వనపర్తిలో పలు సామాజిక వేత్తలు, పర్యావరణ ప్రేమికులు, అధికారులు, స్వచ్ఛందసంస్థలు పలు మార్లు సత్కరించారు.
పర్యావరణాన్ని ప్రేమించాలి
పర్యావరణానికి మనం ఏది ఇస్తామో అది తిరిగి మనకు ఇవ్వడం పర్యావరణానికి అలవాటు. తమ ఇండ్లలో ఎవరికైనా వన్యప్రాణులు, మూగజీవాలు, పాములు వంటివి కనిపిస్తే వాటిని చంపకుండా తమకు సమాచారాన్ని అందిస్తే వాటిని సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నాం. పాములు పట్టుకున్న సమయంలో విధిగా మొక్కలను నాటించాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నాం. అందుకు ప్రజలు, ఇటు పోలీసు ఉన్నతాధికారులు సైతం సహకరించడం చాలా ఆనందంగా ఉంది. అత్యవసరమైతే 9985545526 నెంబర్‌ను సంప్రదించాలి.

  • కృష్ణసాగర్‌, హోంగార్డు, పర్యావరణ ప్రేమికుడు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana