శనివారం 24 అక్టోబర్ 2020
Vikarabad - Sep 24, 2020 , 01:25:15

ఎక్కడివి అక్కడే..

ఎక్కడివి అక్కడే..

భవననిర్మాణ రంగంలో కూలీల కొరత

లాక్‌ డౌన్‌ సమయంలో స్వస్థలాలకు వెళ్లి  అక్కడే ఆగిపోయిన పరిస్థితి..

తిరిగొచ్చిన వారు 40 శాతం మాత్రమే

ఇతర రాష్ర్టాల మేస్త్రీలు, కూలీలే అధికం

పెరిగిన ఇసుక, సిమెంట్‌, స్టీల్‌ ధరలు 

వ్యయం పెరగడంతో తలపట్టుకుంటున్న బిల్డర్లు, సామాన్యులు

యంత్రాలు వస్తే కార్మికులకు ఇబ్బందే..

మిషనరీ వైపు ఎక్కువ మంది బిల్డర్ల దృష్టి

విల్లాస్‌ నిర్మాణాలకు ఫుల్‌ స్టాప్‌ .. 

నెల రోజుల నుంచి మొదలైన పనులు

రంగారెడ్డి/ వికారాబాద్‌,నమస్తే తెలంగాణ: జిల్లాలో భవన నిర్మాణ రంగం ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నది. ఆరేడు నెలలుగా స్తంభించిన భవన నిర్మాణ పనులు పదిహేను రోజులుగా మొదలయ్యాయి. అయితే లాక్‌డౌన్‌కు ముందు ఒప్పందం కుదుర్చుకున్న పనులే  ప్రస్తుతం కొనసాగుతుండగా, కూలీల కొరతతో అవి కూడా నత్తనడకన సాగుతున్నాయి. మరో పక్క చాలామంది రియల్టర్లు, బిల్డర్లు పెద్ద మొత్తంలో బ్యాంకులు, ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి అప్పులు తీసుకువచ్చి నిర్మాణాలు చేపట్టడంతో వారిపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్‌, చేవెళ్ల, కందుకూరు డివిజన్ల పరిధిలో నిర్మాణాలు నెల రోజుల నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లాలో పనిచేసే కార్మికులు అత్యిధిక శాతం ఇతర రాష్ర్టాల వారే కావడం.. వారంతా లాక్‌డౌన్‌ సమయంలో స్వస్థలాలకు వెళ్లి తిరిగిరాకపోవడంతో కూలీల సమస్య తీవ్రంగా ఉంది. వికారాబాద్‌ జిల్లాలోని కొడంగల్‌ మినహా వికారాబాద్‌, తాండూర్‌, పరిగి నియోజకవర్గాల్లో మెజార్టీ భవన నిర్మాణ కాంట్రాక్టర్లు, మేస్త్రీలు, కూలీలు అధికంగా ఆంధ్ర ప్రాంతంవారే ఉన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో వీరంతా సొంత ప్రాంతాలకు వెళ్లి కేవలం 40 శాతం మాత్రమే తిరిగి చేరుకోవడంతో కూలీల సమస్య ఏర్పడింది. కూలీల కొరతతో పెద్ద పెద్ద భవన నిర్మాణాలు స్తంభించగా, వ్యక్తిగత గృహ నిర్మాణాలు మాత్రమే కొంతమేర కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులను స్థానికంగా ఉన్న ఇటుక, ఇసుక, స్టీలు, సిమెంట్‌ వ్యాపారస్తులు  ఆసరాగా చేసుకుని ఇష్టానుసారం ధరలు పెంచడంతో ఇల్లు కట్టాలంటే సాధారణ, మధ్య తరగతి ప్రజలు జంకుతున్నారు.

వెంటాడుతున్న కూలీల కొరత...

వికారాబాద్‌ జిల్లాలో భవన నిర్మాణ పనులకు కూలీల కొరత ఏర్పడింది. వికారాబాద్‌, తాండూర్‌, పరిగి నియోజకవర్గాల్లోని భవన నిర్మాణ పనుల్లో ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, శ్రీకాకుళం తదితర జిల్లాలకు చెందిన వారు కూలీలుగా పనిచేస్తూ వస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో సొంతూళ్లకు వెళ్లిన కూలీల్లో కేవలం 40 శాతం మంది మాత్రమే తిరిగి రావడంతో వ్యక్తిగత గృహ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. అదేవిధంగా కొత్త వారు కూడా వచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తుండడంతో ఉన్న వారితోనే పనులు చేస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు ఒక మేస్త్రీ వద్ద 12 మంది కూలీలు పనులు చేయగా, ప్రస్తుతం నలుగురు పనులు చేస్తున్నారు. కాగా, కూలీలకు ఒప్పందం మేరకు ముందే డబ్బులు చెల్లించినప్పటికీ తిరిగి రాకపోవడంతో కాంట్రాక్టర్లు కూలీల కోసం వెతికే పరిస్థితి ఏర్పడింది. అయితే, గతంలో ఏడాదిలో 6 నుంచి 8 భవనాలను నిర్మించే పరిస్థితి ఉండగా, ప్రస్తుతం 3 నుంచి 4 భవనాలు నిర్మించే అవకాశాలున్నాయంటున్నారు కాంట్రాక్టర్లు. తాండూరు నియోజకవర్గంలో నెలరోజులుగా భవన నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ఒప్పందం గడువు ముగుస్తుండడం, ఇంటి యజమానులు కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెస్తుండడంతో స్థానికంగా ఉన్న కూలీలతో పనులు చేస్తున్నారు. మరోవైపు కొడంగల్‌ నియోజకవర్గంలో మాత్రం పరిగి ప్రాంతానికి చెందిన మేస్త్రీల ఆధ్వర్యంలోనే పనులు జరుగుతున్నాయి. ఇక్కడ  ఎక్కువగా వ్యక్తిగత గృహ నిర్మాణాలే కాబట్టి ఈ ప్రాంత ప్రజలు స్థానికంగా ఉన్న మేస్త్రీలకే ప్రాధాన్యనిస్తున్నారు. కూలీలుగా తండాల ప్రజలు పనిచేస్తున్నారు. 

పనిలేక ఇబ్బంది..

రంగారెడ్డి  జిల్లాలో కరోనాకు ముందు  దాదాపు 3 లక్షలకుపైగా కార్మికులు ఉండగా లాక్‌డౌన్‌ సమయంలో అంతా స్వస్థలాలకు వెళ్లిపోయి అక్కడే ఏదో పనిలో స్థిరపడ్డారు. అందులో సగం మంది మాత్రం తిరిగి మళ్లీ పనికి వచ్చినా పనులు జరగకపోవడంతో తల పట్టుకుంటున్నారు. కొంతమందికి పని దొరికినా పది మంది పని చేయాల్సిన చోట నలుగురితో చేయిస్తుండడంతో  కూలి పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ పరిణామం గృహనిర్మాణ దారులు, బిల్డర్లకు అధిక భారంగా మారినట్లు  తెలుస్తున్నది. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం సమయంతో ఉన్న రేట్లకు ఇప్పటి రేట్లకు వ్యత్యాసం పెరగడంతో తమపై మరింత భారం పెరిగిందని బిల్డర్లు వాపోతున్నారు.  జిల్లాలోని రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, శంషాబాద్‌, ఆదిభట్ల, నానక్‌రాంగూడ, పుప్పాలగూడ, మణికొండ, నార్సింగి, కోకాపేట, మహేశ్వరం, గండిపేట, శంకర్‌పల్లి, ఇబ్రహీంపట్నం, అబ్దూల్లాపూర్‌మెట్‌, హయత్‌నగర్‌, ఎల్బీ నగర్‌, షాద్‌నగర్‌, ఆమనగల్లు, కందుకూరు, జల్‌పల్లి, మీర్‌పేట్‌, బండ్లగూడ, కడ్తాల, కొత్తూరు, ఫరూఖ్‌నగర్‌, చేవెళ్ల, మొయినాబాద్‌ తదితర ప్రాంతాల్లో అధికంగా భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక్కడ రెండు తెలుగు రాష్ర్టాలకు చెందిన కూలీలతో పాటుగా బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, ఒరిస్సా, గుజరాత్‌ తదితర రాష్ర్టాలకు చెందిన కూలీలు ఎక్కువగా పనులు చేయడానికి వస్తుంటారు. కరోనా కాలంలో వారంతా స్వస్థలాలకు వెళ్లిపోవడంతో తిరిగి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని నిర్మాణ రంగ నిపుణులు అంటున్నారు. 

పెరిగిన మెటీరియల్‌ ధరలు...

 భవన నిర్మాణ పనులు స్తంభించేందుకు కూలీల కొరత ఓ సమస్యకాగా నిర్మాణ రంగం మెటీరియల్‌ ధరలు పెరగడం కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. స్టీల్‌, సిమెంట్‌, ఇసుక, ఇటుక తదితర ధరలు పెరగడంతో  నిర్మాణ రంగం కుదేలైంది. గతంలో ఇసుక టన్నుకు రూ.1700లు ఉండగా ప్రస్తుతం రూ.2600, సిమెంట్‌ బస్తా గతంలో రూ.290 ఉండగా ప్రస్తుతం రూ.350, స్టీల్‌ గతంలో టన్నుకు రూ.200లు ఉండగా ప్రస్తుతం రూ.300, ఇటుక ఒక్కటి గతంలో రూ.4 ఉండగా ప్రస్తుతం రూ.5లకు పెరుగడంతో భవన నిర్మాణాలను చేపట్టేందుకు బిల్డర్లు, కాంట్రాక్టర్లు, సాధారణ ప్రజలు వెనుకంజ వేస్తున్నారు. అలాగే, గతంతో కూలీలకు రోజుకు రూ.500లు ఇవ్వగా, ప్రస్తుతం రూ.550లు, మేస్త్రీలకు  రూ.700లు ఇవ్వగా ప్రస్తుతం రూ.1100 వరకు చెల్లిస్తున్నారు. అలాగే మహిళలకు రూ.400లు ఉంటే..ప్రస్తుతం రూ.800లు పెంచారు. 


ఏడాదికి 6 నుంచి 8 భవన నిర్మాణాలు చేపట్టేవాళ్లం

లాక్‌డౌన్‌ ముందు ఒప్పదం కుదుర్చుకున్న భవనాల పనులే కొనసాగుతున్నాయి. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత రెండు కొత్త భవనాలు నిర్మాణం చేపట్టడానికి ఒప్పుకున్నాను. ఎప్పటి లాగానే ఈ సంవత్సరంలో కూడా 6 నుంచి 8 భవనాలు నిర్మిచాలని అనుకున్నా. లాక్‌డౌన్‌ సమయంలో మా దగ్గర పనిచేసే మనుషులు సొంతూర్లకు వెళ్లి తిరిగి రాలేదు. ఒప్పదం ప్రకారం వారికి ముందుగానే డబ్బులు చెల్లించాం. పనులు పూర్తికాకముందే వారు వెళ్లిపోయారు. కొత్త వారు వచ్చేందుకు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. 


నాతోపాటు 12 మంది పనులు చేసుకునేవారు...

మా మేస్త్రీ దగ్గర నాతో పాటు 12 మంది పని చేసేవారం. ప్రస్తుతం నలుగురితోనే నెట్టుకొస్తున్నాం. మిగతా వాళ్లు కరోనాకు భయపడి ఇండ్లనుంచి బయటకు రావడం లేదు. బస్సుల్లో వచ్చేందుకు వారు ఆసక్తి చూపడం లేదు. ప్రైవేటు వాహనాల్లో రావాలంటే ఖర్చు అధికమవుతుంది. కరోనాతో కూలీ బతుకులు ఆగమైనయ్‌. 

- ఏసు.. కూలీ.. ఒంగోలు


కరోనా వల్ల భవన నిర్మాణాల ప్లానింగ్‌ తగ్గిపోయాయి

కొవిడ్‌ 19 కంటే ముందు నెలకు 10 భవనాలకు ప్లానింగ్‌ చేసి ఇచ్చేవాడిని. కరోనా ప్రభావం నా వృత్తిపై చాలా పడింది. రెండు నెలల నుంచి 5 ప్లాన్లు మాత్రమే ఇచ్చాను. ఈ లోటు నుంచి కోలుకునేందుకు చాలా సమయం పట్టేట్టు ఉంది. బిల్డర్లు కూడా నిర్మాణాలు చేసేందుకు ముందుకొస్తలేరు.

- మల్లేశం.. ప్రైవేటు ఇంజినీర్‌

నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం

ఇటుక దగ్గర నుంచి సిమెంట్‌ వరకు అన్నీ రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. 8 మంది పనిచేసే దగ్గర ముగ్గురే పనిచేయాల్సి వస్తుండడంతో ధర అధిమవుతున్నది. కూలీలకు డిమాండ్‌ ఉండడంతో కూలి పెంచుతున్నారు.  కంపెనీలు సైతం సామాగ్రి ధరలు పెంచుతున్నాయి. నిర్మాణ రంగానికి  సరఫరా చేసే వాహనాల అద్దెలతో పాటు వాటిని నడిపే డ్రైవర్లు, లోడింగ్‌ ఆన్‌లోడింగ్‌ చేసే కూలీలు ధరలు పెంచారు. సిమెంట్‌, స్టీల్‌ ఫ్యాక్టరీలు సైతం ధరలు పెంచాయి. రానున్న రోజుల్లో డబ్బులు లేని వారు ఇళ్లు కట్టుకోవాలంటే భారంగానే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో భవన నిర్మాణ కార్మికులకు సమస్యలు రానున్నాయి. విల్లాస్‌ నిర్మాణాలు అగిపోయాయి. దీని వల్ల కూడా భవిష్యత్తులో యంత్రాలు వస్తే కార్మికులకు ఇబ్బందే. బిల్డర్లు లేబర్‌ లేని మిషనరీ వైపు ఎక్కువ దృష్టి పెడుతున్నారు. కెమికల్స్‌ ఎక్కువ వచ్చాయి. కెమికల్స్‌తో నేరుగా ప్లాస్టిక్‌ చేయడం ఇసుక, సిమెంట్‌, నీళ్లు అవసరం లేకుండా లిక్విడ్‌ అప్లయ్‌ చేసుకుని నిర్మాణాలు చేపట్టే పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. 

-రాంమోహన్‌, భవన నిర్మాణ రంగం జిల్లా అధ్యక్షుడు


logo