e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home వికారాబాద్ ప్రతి పల్లె పచ్చగుండాలి..

ప్రతి పల్లె పచ్చగుండాలి..

ప్రతి పల్లె పచ్చగుండాలి..
  • సీజనల్‌ వ్యాధులు రాకుండా చూడాలి
  • పెద్దఎత్తున మొక్కలు నాటాలి
  • పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించిన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
  • పాల్గొన్న ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు పౌసుమిబసు, అమయ్‌కుమార్‌

పరిగి/షాద్‌నగర్‌, జూన్‌ 16 : సీజనల్‌ వ్యాధులు తలెత్తకుండా గ్రామాలు, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం పనులు పక్కాగా నిర్వహించేలా చూడాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జిల్లా కలెక్టర్‌లకు సూచించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా పెద్దఎత్తున మొక్కలు నాటాల్సిందిగా పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రెటరీ సందీప్‌కుమార్‌ సుల్తానియా, రాష్ట్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ సెక్రెటరీ రిజ్వీ, రాష్ట్ర అటవీ శాఖ చీఫ్‌ కన్జర్వేటర్‌ శోభ, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా అటవీ శాఖాధికారులతో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామాలు, మున్సిపాలిటీల్లో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాల నిర్వహణకు గ్రామం, మండలంవారీగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ చేపట్టాలన్నారు. ఏ రోజు చెత్త ఆ రోజే తొలగించాలన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ సమన్వయంతో పెద్ద మొక్కలు నాటాల్సిందిగా మంత్రి పేర్కొన్నారు. వైకుంఠధామాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలని, ప్రహరీలు తప్పనిసరిగా నిర్మించాలని సూచించారు. వాటి ఆవరణల్లో పూలమొక్కలతో పచ్చదనం పెంపొందించాలని చెప్పారు. గ్రామసభల్లో గుర్తించిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా మంత్రి ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారులు, మండల పంచాయతీ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పడు పరిశీలించాలన్నారు. చెత్తా చెదారం రోడ్లపై కనిపించకుండా ట్రాక్టర్ల ద్వారా తరలించాలని సూచించారు. హరితహారంలో నాటిన మొక్కలను కాపాడుకోవాలని, గత సంవత్సరం నాటిన మొక్కల పరిస్థితిపై ఈ సంవత్సరం పరిశీలించుకోవాలని మంత్రి పేర్కొన్నారు.
పచ్చదనం, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిసారించండి

- Advertisement -

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌
గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, పచ్చదనం వంటి ముఖ్య కార్యక్రమాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లకు నూతన వాహనాలను అందించామని, అలాగే అత్యవసర నిధుల కింద రూ.25లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల పట్ల జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు క్షేత్రస్థాయిలో తనిఖీలు జరపాలని సూచించారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ విస్తరణాధికారులు క్షేత్ర స్థాయిలో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి మండలంలో పల్లె ప్రకృతి వనం కోసం 10 ఎకరాలు, పట్టణాల్లో అర్బన్‌ పార్కులకు స్థలాలకు భూసేకరణ వెంటనే చేపట్టాలన్నారు. నర్సరీల ద్వారా ప్రతి ఇంటికి ఆరు మొక్కలు అందించేలా కార్యాచరణ తయారు చేయాలన్నారు. మల్టీ లెవెల్‌ అవెన్యూ ప్లాంటేషన్‌ కింద జిల్లాల్లోని అన్ని రోడ్లలో ఎక్కువ వరుసల్లో మొక్కలు నాటాల్సిందిగా సూచించారు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలకు కేటాయించిన బడ్జెట్‌లో పది శాతం బడ్జెట్‌ను తప్పనిసరిగా గ్రీన్‌ బడ్జెట్‌ కింద వినియోగించేలా చూడాలన్నారు. ఈ సంవత్సరం హరితహారం కార్యక్రమంలో 50వేల నర్సరీల ద్వారా 30కోట్లకు పైగా మొక్కలు రాష్ట్రవ్యాప్తంగా నాటుతున్నట్లు ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ యార్డుల ఏర్పాటుకు స్థల సేకరణ వెంటనే పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. ధరణిలో పెండింగ్‌ లేకుండా దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, భూ సమస్యల దరఖాస్తులను క్లియర్‌ చేయాలన్నారు. హై రిస్క్‌ ఉన్నవారందరికీ వ్యాక్సిన్‌ అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి, రాత్రి సమయంలో అక్కడే బసచేసి పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. స్థానిక సంస్థల నిర్వహణ, తెలంగాణ హరితహారం, ధరణి, కరోనా టీకాల పంపిణీ వంటి అంశాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రభుత్వ అటవీ ప్రాంతాలతో పాటు జిల్లాలోని రహదారుల వెంట మల్టీలెవల్‌ ఎవెన్యూ ప్లాంటేషన్‌, పట్టణాల్లోని ప్రభుత్వ స్థలాల్లో, ఖాళీ స్థలాల్లో, జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌లో మొక్కలు నాటాలన్నారు. ప్రతి మండల కేంద్రంతో పాటు జిల్లాలోని మరో మూడు ప్రాంతాల్లో 10 లక్షల చొప్పున మొక్కలను నాటి పెంచాలని, అందుకోసం స్థలాలను గుర్తించాలని తెలిపారు. మొక్కలను నాటేందుకు గుంతలను తవ్వడంతోపాటు పల్లె ప్రకృతి వనాల ఏర్పాటును పూర్తిచేయాలని సూచించారు.

యుద్ధప్రాతిపదికన మొక్కలు నాటాలి
వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ పౌసుమిబసు
ప్రతి రోడ్డుకు ఇరువైపులా రెండు వరుసలుగా యుద్ధప్రాతిపదికన మొక్కలు నాటాలని కలెక్టర్‌ పౌసుమిబసు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో మెగా నర్సరీలు ఏర్పాటు చేయాలని, నర్సరీల్లో ఖాళీ బ్యాగులు, చిరిగిపోయిన నెట్‌లు లేకుండా, ఆకర్షణీయంగా ఉంచాలని సూచించారు. మొక్కల వివరాలు తెలిపే రిజిస్టర్లు, మొక్కల పేర్లు తెలిపే బోర్డులు ఏర్పాటు చేయించాలన్నారు. ప్రతిరోజు అధికారులు తప్పనిసరిగా నర్సరీలను పరిశీలించాలని ఆదేశించారు. గ్రామ కార్యదర్శులను నర్సరీ పనుల్లో పూర్తి భాగస్వాములను చేయాలని కలెక్టర్‌ చెప్పారు. పల్లె ప్రకృతి వనాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. పారిశుద్ధ్య పనులను ఎప్పటికప్పుడు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్‌, చంద్రయ్య, జిల్లా అటవీ శాఖ అధికారి వేణుమాధవరావు, డీఆర్‌డీఓ కృష్ణన్‌, జిల్లా పంచాయతీ అధికారి రిజ్వానా, ఆర్‌అండ్‌బీ ఈఈ లాల్‌సింగ్‌, పంచాయతీరాజ్‌ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా వైద్యాధికారి సుధాకర్‌షిండే పాల్గొన్నారు.

అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవు
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మాణాలు చేపడితే శాఖాపరమైన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం తన కార్యాలయంలో జిల్లా ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించిన సందర్భంగా మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణల్లో మొక్కలను విస్తృతంగా నాటాలని సూచించారు. ఆర్‌అండ్‌బీ, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో హరితహారం ద్వారా దారులకు ఇరువైపులా రెండు, మూడు వరుసల్లో మొక్కలను నాటాలని ఆదేశించారు. ఎండిన మొక్కల స్థానంలో నూతనంగా మొక్కలను నాటాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించాలని కోరారు. గ్రామాల్లో మురుగు కాలువల శుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, ముండ్ల పొదల తొలగింపు వంటి సమస్యలపై పంచాయతీల కార్యదర్శులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఎట్టిపరిస్థితిల్లోనూ నిర్లక్ష్యం వహించరాదని అన్నారు. మండల ప్రత్యేక అధికారులు తమ మండలాల్లో విస్తృతంగా పర్యటించాలని చెప్పారు. మున్సిపాలిటీల్లో సమీకృత వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్‌ నిర్మాణాలకు స్థలాలను తక్షణమే గుర్తించాలని ఆయా మున్సిపాలిటీల కమిషనర్లకు సూచించారు. పట్టణాల్లోన్ని అన్ని దారుల వెంట పచ్చదనం ఉండాలని చెప్పారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి, అటవీ శాఖ అధికారి జానకీరాం, జిల్లా పంచాయతీరాజ్‌ శాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రతి పల్లె పచ్చగుండాలి..
ప్రతి పల్లె పచ్చగుండాలి..
ప్రతి పల్లె పచ్చగుండాలి..

ట్రెండింగ్‌

Advertisement