మీ వాహనం రంగు మార్చాలనుకుంటున్నారా? పెయింట్ చేసేందుకు సమయం కేటాయించలేకపోతున్నారా? ఎక్కువ మొత్తం డబ్బులు అవుతాయని బాధ పడుతున్నారా? ఇక ఇబ్బంది పడాల్సిన పని లేదు. తక్కువ సమయంలోనే మీ వాహనం.. మీకు ఇష్టమైన రంగులో మార్చుకునే అవకాశం కల్పిస్తుంది వినైల్ రాపింగ్. రాపింగ్ ఇప్పుడు కొత్త ట్రెండ్‌గా మారిపోయింది. చాలా మంది కారు యజమానులు ఖరీదైన పెయింట్ జాబ్‌కు గుడ్‌బై చెప్పి, వినైల్ రాపింగ్ను ఆశ్రయిస్తున్నారు. కారు, బైక్‌లను మనకు నచ్చినట్లుగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నాయి కార్ డెకార్స్. ఢిల్లీ, ముంబై, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఉన్న రాపింగ్ సంస్కృతి ఇప్పుడు మన హైదరాబాద్‌కు వచ్చేసింది.
కార్లు, బైక్‌లను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవాలని చాలా మంది తాపత్రయ పడుతుంటారు. కానీ పెయింటింగ్ అంటే సమయం, డబ్బు వృథా అని మదన పడుతుంటారు. అలాంటి ఇబ్బంది లేకుండా చేసింది వినైల్ రాపింగ్. దేశంలోని ప్రధాన నగరాల్లో సంపన్నుల కార్లను ఆకర్షణీయంగా చేయడానికి కార్ డెకార్స్ నిపుణులు రాపింగ్ను పరిచయం చేశారు. ఇప్పుడు ఈ రాపింగ్ సంస్కృతి హైదరాబాద్‌లో జోరందుకుంది. రాపింగ్తోనే ఎంతో మంది యువకులు జీవనోపాధి పొందుతున్నారంటే దీనికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
రాపింగ్ అంటే….
లక్షలు, కోట్లు పెట్టి కొనే కార్లు ,బైక్‌ల కంపెనీల నుంచి వచ్చే ఫీచర్స్‌తో అదరహో అనిపిస్తాయి. కానీ ఫీచర్స్ ఉంటే సరిపోదన్నట్లుగా కారు లోపల కాకుండా బయట ఆకర్షణీయంగా కనిపించాలని అభిరుచి కలవారూ ఉంటారు. వారి అభిరుచికి తగ్గట్లుగా కార్ల రూపాన్ని అందమైన రంగు, రంగుల కాగితాలతో అద్భుతంగా మలచడమే రాపింగ్. ఈ రాపింగ్తో కంపెనీలు ఇచ్చే సాధారణ రంగులను మార్చేసి సుందరంగా తయారు చేస్తారు. కార్ల శ్రేణిని బట్టి 35వేల నుంచి లక్షా 50 వేల వరకు ఛార్జ్ చేస్తారు. ప్రస్తుతం నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, అమీర్‌పేట్, బేగంపేట్, సికింద్రాబాద్, కోఠి, అబిడ్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, అత్తాపూర్ తదితర ప్రాంతాల్లో కార్ల డెకార్స్, రాపింగ్ నిపుణులు సేవలందిస్తున్నారు. అంతే కాకుండా పలువురు యువకులు యూట్యూబ్‌లో తమ పనితీరును వీడియోల రూపంలో పొందుపరచి ఇండ్ల వద్దనే రాపింగ్ చేస్తూ ఉపాధిని పొందుతున్నారు.
వాహనాలు విభిన్నంగా కనిపించడానికి వేయించుకుంటాం
అందరి వాహనాల మాదిరి కాకుండా విభిన్నంగా కనిపించడానికి రాపింగ్ బాగుంటుంది. రాపింగ్తో కార్లు, బైక్‌లు ప్రత్యేకంగా కనిపిస్తాయి. అందుకే దీనిని చేయించుకుంటాం. ఖర్చుకు వెనుకాడకుండా కార్లకు, బైక్‌లకు రాపింగ్ చేయించుకుంటాం.
-పృథ్వీ
రాపింగ్తో ఉపాధి
ఆధునిక కార్లను ఆకర్షణీయంగా మలచడానికి రాపింగ్ ఎంతో దోహదం చేస్తుంది. రాపింగ్ పనితో ఉపాధిని పొందుతున్నాం. లక్షల రూపాయలతో దుకాణాలను పెట్టుకోలేని వారు తమ పనితీరును వీడియోల రూపంలో యూట్యూబ్‌లో అప్లోడ్ చేసి రాపింగ్ పనిని పొందుతున్నారు. నగరంలో ఎంతో మంది యువకులు రాపింగ్తో స్వయం ఉపాధిని, పేరును సంపాదిస్తున్నారు.
ఇవీ కూడా చదవండీ..
టీఆర్ఎస్లో చేరిన బీజేపీ నాయకులు
మావోయిస్టు కార్యకలాపాలపై నిఘా కొనసాగింపు : వరంగల్ సీపీ
క్వారంటైన్ పూర్తైన ఆనందంలో ‘మూన్‌వాక్’ చేసిన క్రిస్‌గేల్