మంగళవారం 04 ఆగస్టు 2020
Vikarabad - Jun 22, 2020 , 23:37:14

అందరి ‘బంధువు’

అందరి ‘బంధువు’

అందుతున్న రైతుబంధు సాయం...

రైతుల ఖాతాల్లో జమ 

విడుతల వారీగా  పెట్టుబడి సాయం 

తొలుత ఎకరా వరకు భూమిగల రైతులకు..

ప్రతి  రైతుకూ  రైతుబంధు సాయమందించేందుకు ప్రభుత్వం నిర్ణయం

ఎకరాకు రూ.5 వేల పెట్టుబడి సాయం

రంగారెడ్డి జిల్లాలో 3,04,026 మంది రైతులు అర్హులుగా గుర్తింపు  

వికారాబాద్‌ జిల్లాలో 2,20,445 మంది రైతులకు అందనున్న పెట్టుబడి సాయం

ఈ ఏడాది కొత్తగా 19,119 మందికి లబ్ధి

అన్ని వర్గాల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌ అన్నదాతలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు. రైతును రాజుగా చేయడమే తమ లక్ష్యం అని ప్రకటించడమే కాకుండా ఆ దిశగా వినూత్న పథకాలు అమలు చేస్తూ దేశవ్యాప్తంగా  ప్రశంసలందుకుంటున్నారు. ఏఏ పంటలు వేస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుందో అవగాహన కల్పించిన ప్రభుత్వం పంట పెట్టుబడి కోసం ‘రైతుబంధు’ సాయాన్ని ఎకరానికి రూ.5వేల చొప్పున అందిస్తున్నది. విడుతల వారీగా ఈ సాయాన్ని అందించేందుకు సన్నాహాలు చేసిన అధికారులు మొదట ఎకరాలోపు భూమిగల వారికి ఈ మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు.  సోమవారం సాయంత్రం నుంచి  ఈ  ప్రక్రియ ప్రారంభమైంది. నియంత్రిత సాగు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తరువాతనే ఈ సాయాన్ని అందించాలని మొదట ప్రభుత్వం భావించినప్పటికీ  రైతులకు పంట పెట్టుబడికి ఇబ్బంది  కావొద్దని భావించి సాగుతో సంబంధం లేకుండా ఖాతాల్లో జమ చేస్తున్నది.  వికారాబాద్‌ జిల్లాలో ఈ ఏడాది 2,20,445 మంది పట్టాదారులను పథకానికి అర్హులుగా గుర్తించారు.  గతేడాది 1,88,713 మందికి రైతుబంధు సాయం అందించగా ఈ ఏడాది అదనంగా  19 వేలకుపైగా అర్హుల జాబితాలో చేరారు. రంగారెడ్డి జిల్లాలో 3,04,026 మంది రైతులను అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ వాన కాలంలో 3,99,561 ఎకరాల్లో సాగు చేయనున్నట్టు అధికారులు గుర్తించారు.  వీరికి  పెట్టుబడి సాయం కింద  రూ.370 కోట్లు అందించనున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే పొలం పనుల్లో నిమగ్నమైన అన్నదాతలు తాజా పరిణామాలతో ఉత్సాహంగా నియంత్రిత సాగుదిశగా అడుగులు వేస్తున్నారు.

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: రైతుబంధు పథకం కింద వానకాలం సీజన్‌కుగాను రైతులకు పంట పెట్టుబడి నిమిత్తం అందజేసే ఆర్థిక సాయాన్ని నేటి నుంచి రైతులకు అందించేందుకు ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.5 వేల పెట్టుబడి సాయాన్ని జమ చేయనున్నారు. అయితే రైతుబంధు సాయాన్ని విడుతలవారీగా రైతులకు అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ఎకరాలోపు భూమి ఉన్న రైతులకు రైతుబంధు సాయాన్ని నేటి నుంచి బ్యాంకు ఖాతాల్లో జ మ చేయనున్నారు. అనంతరం వారం, పది రోజుల్లో రెం డో విడుత రైతుబంధు సాయాన్ని రైతులకు అందించేందు కు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అయితే మొదట నియంత్రిత పంటల సాగు విధానం ప్రకారం ప్రభుత్వం సూచించిన పంటలను వేసిన అనంతరం పంటల వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చిన తర్వాతే రైతుబంధు అందించేందు కు నిర్ణయించినప్పటికీ పంటల పెట్టుబడికి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా పంటల సాగుతో సంబంధం లేకుండా రైతుబంధు సాయం అందజేసేందు కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. అయితే అర్హులైన ప్రతి రైతుకూ రైతుబంధు సాయం అందేలా చర్య లు చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది. 

వానకాలం సీజన్‌కు 2,20,445మంది అర్హులు...

నేటి నుంచి రైతుబంధు సాయం రైతుల బ్యాంకు ఖా తాల్లో ఎకరాకు రూ.5వేల చొప్పున జమకానుంది. ఇప్పటికే ఎకరా భూమిగల రైతులకు సంబంధించి బిల్లులు కూ డా పూర్తి కావడంతో మంగళవారం సాయంత్రం వరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ కా నున్నాయి. జిల్లాలో ఈ ఏడాది 2,20,445 మంది పట్టాదారులను రైతుబంధు పథకానికి అర్హులుగా గుర్తించారు. సం బంధిత రైతులందరికీ విడుతలవారీగా రైతుబంధు సాయమందనుంది. అయితే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రైతుబంధు పథకానికి సంబంధించిన రైతుల సంఖ్య పెరిగింది. గతేడాది 1,88,713మంది రైతులకు రైతుబంధు అందించగా ఈ ఏడాది రూ.19వేల మందికిపైగా రైతులు అర్హుల జాబితాలో చేరారు. అయితే ఇప్పటివరకు 87శాతం మం ది రైతులకు సంబంధించిన పంటల సాగు వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. 2.20లక్షల మంది రైతులకుగాను ఇప్పటివరకు 1,81,203మంది రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. రైతుబంధు పథకం కింద రెండేండ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.875కోట్లను పెట్టుబడి నిమిత్తం అందజేశారు. 2018 వానకాలం సీజన్‌లో చెక్కు ల రూపంలో ఎకరాకు రూ.4వేల ఆర్థిక సాయాన్ని అందించగా, 2018యాసంగి సీజన్‌ నుంచి రైతులకు నేరుగా ఆన్‌లైన్‌ ద్వారా బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. గతేడాది నుంచి రైతుబంధు కింద రైతులకు అందించే పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.5వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. 2018 వానకాలం సీజన్‌లో 1,94,833మంది రైతులకుగాను రూ.220కోట్లు, 2018 యాసంగిలో 1,79,899మంది రైతులకు రూ.206కోట్లు, 2019వానకాలం సీజన్‌లో 1,88,713మంది రైతులకుగాను రూ.255కోట్లు, 2019 యాసంగి సీజన్‌లో 1,71,824 మంది రైతులకుగాను రూ.194కోట్ల పెట్టుబడి సాయాన్ని రైతులకు ఎకరాకు రూ.5 వేల చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. 

కొత్తగా 19,119మందికి రైతుబంధు...

ఈ ఏడాది కొత్తగా 19,119మందికి పట్టాదారు పాసు పుస్తకాలు జారీ అయ్యాయి. వీరందరికీ ఈ వానకాలం సీజన్‌ నుంచే రైతుబంధు సాయమందనుంది. కొత్త పట్టాదారు పాసు పుస్తకాలకు సంబంధించి ఇప్పటివరకు 60 శాతం మంది రైతుల బ్యాంకు ఖాతా వివరాలను సంబంధిత అధికారులు సేకరించారు. కొత్త పాసుపుస్తకాలు జారీ అయిన వారిలో మోమిన్‌పేట్‌, నవాబుపేట్‌, పూడూర్‌, పరిగి మండలాలకు సంబంధించిన వారు హైదరాబాద్‌లో ఉండగా, కులకచర్ల, దోమ, బొంరాసిపేట్‌ మండలాలకు చెందిన వారు కరోనాతో ముంబైలోనే ఉండడంతో వ్యవసాయాధికారులు బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించలేకపోయారు. దీంతో ఇప్పటివరకు కొత్తగా పాసుపుస్తకాలు పొందిన రైతుల్లో 10వేల మంది రైతుల వివరాల రైతుల బ్యాంకు ఖాతా, ఆధార్‌ వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. విడుతలవారీగా రైతులకు రైతుబంధు సాయమందనుంది కాబట్టి ఆలోగా బ్యాంకు ఖాతా, ఆధా ర్‌ వివరాలను అందించని రైతులు సంబంధిత అధికారులకు అందజేసినట్లయితే రైతుబంధు సాయమందనుంది.

రంగారెడ్డి జిల్లాలో 3,04,026మంది రైతులకు సాయం

షాబాద్‌ : రైతును రాజు చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమం త్రి కేసీఆర్‌ అమలు చేస్తున్న రైతుబంధుతో జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వానకాలంలో జిల్లా వ్యాప్తంగా 3,99,561 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేసేందుకు అధికారులు టార్గెట్‌ పెట్టుకున్నారు. జిల్లాలో మొత్తం 3,04,026మంది రైతులు రైతుబంధుకు అర్హులుగా గుర్తించారు. మక్కజొన్న సాగు చేయకూడదని ప్రభుత్వం సూచించడంతో రైతులు పత్తి, కంది, వరి, జొన్న పం టలతో పాటు కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు. రైతులు అప్పులు చేసి పంటలు సాగు చేయవద్దని ప్రభు త్వం రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు రూ.5వేలు పంట పెట్టుబడి సాయం అందిస్తున్నది. ఎకరం భూమి ఉన్న రైతులకు సోమవారం నుంచే రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమ అవుతున్నాయి. 

జిల్లాలో 3,04,026 మంది రైతులు...

జిల్లావ్యాప్తంగా 3,04,026 మంది రైతులున్నారు. వానకాలం సాగుకు ప్రభుత్వం వీరికి రూ. 370 కోట్లతో పంట సాయం చేయనుంది. ఇప్పటికే అధికారులు 2,52,466మంది రైతుల బ్యాంకు వివరాలు సేకరించా రు. అందులో 2,27,615మంది రైతుల వివరాలు ట్రెజరీకి పంపించారు. త్వరలో వారి ఖాతాల్లో డబ్బులు కానున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు డబ్బులతో అన్నదాతలు సంతోషంగా విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయనున్నారు. 

అర్హుల వివరాలను పొందుపర్చాం...

- గోపాల్‌, వికారాబాద్‌ జిల్లా వ్యవసాయాధికారి
రైతుబంధు పథకానికి సం బంధించి వానకాలం సీజన్‌కుగా ను అర్హుల వివరాలను ఆన్‌లైన్‌ లో పొందుపర్చాం. నేటి నుం చి రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు డబ్బులు నేరుగా జమ కానున్నది. అదేవిధంగా కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు జారీ అయిన వారిలో కొందరు ఇతర ప్రాం తాల్లో ఉండడంతో బ్యాంకు ఖాతా వివరాలను సేకరించలేదు. వారందరూ బ్యాంకు ఖాతా వివరాలను అందించినట్లయితే రైతుబంధు సాయమందుతుంది.

రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

- గీతారెడ్డి, రంగారెడ్డి జిల్లా వ్యవసాయశాఖ అధికారి
వానకాలం పంటల సాగుకు రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా  3,04,026 మంది రైతులు ఉండగా అందు లో ఇప్పటికే 2,52,466మంది రైతుల బ్యాంకు వివరాలు సేకరించాం. 2,27,615మంది రైతుల వివరాలు ట్రెజరీకి పంపిం చాం. ఎకరం ఉన్న రైతులకు సోమవారం నుంచే డబ్బులు జమ అవుతున్నాయి. మిగతా రైతులకు త్వ రలో పెట్టుబడి సాయం వారి ఖాతాల్లో పడుతుంది. 


logo