బుధవారం 21 అక్టోబర్ 2020
Vikarabad - Sep 29, 2020 , 00:44:17

భూ సర్వే చేయించాలని నిరసన

భూ సర్వే చేయించాలని నిరసన

పెద్దేముల్‌ : తన భూమిని సర్వే చేయించి తనకు ఇప్పించాలని ఒక మహిళ తాసిల్దార్‌ కార్యాలయంలో సోమవారం బైఠాయించింది. ఈ సందర్భంగా బాధిత మహిళ, ఆమె కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మండలంలోని జనగాం గ్రామానికి చెందిన దోరళ్ల లక్ష్మమ్మకు గ్రామంలోని సర్వే నంబర్‌ 139/అ 3లో 2.38 ఎకరాలు, సర్వే నంబర్‌ 144/ఇలో 1.8 ఎకరాలు, ఆమె తల్లి శ్యామలమ్మకు 1.8 ఎకరాలు, ఆమె అన్న అంజిల్‌ రెడ్డికి 1.9 ఎకరాలు మొత్తం 3.25 ఎకరాల వ్యవసాయ భూమి ఉందన్నారు. సర్వే నంబర్‌ 144/ఇలోని మొత్తం 3.25 ఎకరాల భూమి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ సర్వేలో ఆన్‌లైన్‌లో నమోదుకాకపోగా, అందుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన నూతన పట్టా పాసుపుస్తకాలు కూడా వారికి అందలేదు. ఇందుకు సంబంధించి పలుమార్లు రెవెన్యూ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేసినా ఎవరూ పట్టించుకోలేదని, ఈ విషయంలో తమ పట్ల రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారించారని వారు ఆరోపించారు. కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోలేదన్నారు. ఈ భూమి విషయంలో గ్రామస్తులతో గొడవలు జరిగి తమపై పోలీసు కేసులు కూడా నమోదయ్యాయని తెలిపారు. మీ సేవలో సర్వే కోసం డబ్బులు కట్టి, పిటిషన్‌ దాఖలు చేయగా చివరకు అధికారులు 2020 మార్చి 21న సర్వే నోటీసు పంపించి, లాక్‌డౌన్‌ కారణంగా సర్వే చేయడం కుదరదని తెలిపారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఇతర అధికారులకు చెప్పుకుంటూ కన్నీరుపెట్టింది. చివరకు అధికారులు స్పందించి సర్వే చేసి భూమిని చూయిస్తామని చెప్పడంతో ఆమె నిరసనను విరమించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీనివాస్‌, సర్వేయర్‌ నసీర్‌ వివరణ కోరగా వచ్చే నెల 1న దోరోళ్ల లక్ష్మమ్మకు సంబంధించిన భూమిని పూర్తిస్థాయిలో సర్వే చేసి, హద్దులు చూయిస్తామని, ఆమెకు రెండు రోజుల్లో సర్వే నోటీసులు కూడా అందజేస్తామని తెలిపారు.


logo