శనివారం 24 అక్టోబర్ 2020
Vikarabad - Sep 27, 2020 , 01:40:01

కులవృత్తులకు పూర్వ వైభవం

కులవృత్తులకు పూర్వ వైభవం

ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి

మత్స్యకారులకు చేపపిల్లల పంపిణీ 

కొడంగల్‌ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కులవృత్తులకు పూర్వ వైభవం వచ్చిందని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం కొడంగల్‌, దౌల్తాబాద్‌ మండలాల్లోని మత్స్యకారులు చేపప్లిలను పంపిణీ చేయడంతోపాటు వాటిని చెరువుల్లో వదిలారు. ఈ సందర్భంగా మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కులవృత్తులను పట్టించుకోలేదన్నారు. అంతరిస్తున్న కులవృత్తుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. చెరువులు, కుంటల పూడికతీయడంతో చేపల సంతతి గణనీయంగా పెరిగిందన్నారు. గొల్లకురుమలకు గొర్రెపిల్లలు, మత్స్యకారులకు చేపపిల్లలు ఉచితంగా అందిస్తూ ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నారన్నారు. కొడంగల్‌ పెద్ద చెరువులో బొచ్చ, బంగారుతీగ, రౌట చేపపిల్లలను వదులుతున్నట్లు తెలిపారు. సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయన్నారు. గతేడాది కొడంగల్‌, బొంరాస్‌పేట, దౌల్తాబాద్‌ మండలాల పరిధిలోని చెరువుల్లో 10లక్షలకు పైగా చేపపిల్లలను వదిలినట్లు తెలిపారు. కోరిన మేరకు చేపపిల్లలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. త్వరలో రెండో విడుత గొర్రెపిల్లల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఫిషరీస్‌ అధికారి కీర్తి, కొడంగల్‌, బొంరాస్‌పేట మండలాల పీఏసీఎస్‌ అధ్యక్షులు కంటకం శివకుమార్‌, విష్ణువర్ధన్‌రెడ్డి, దౌల్తాబాద్‌ జడ్పీటీసీ కోట్ల మహిపాల్‌, దౌల్తాబాద్‌ ఎంపీపీ విజయ్‌కుమార్‌, మాజీ జడ్పీ వైస్‌ చైర్మన్‌ కృష్ణ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాంరెడ్డి, టీఆర్‌ఎస్‌ శ్రేణులు, గంగపుత్ర సహకార సంఘం సభ్యులు పాల్గొన్నారు.  

మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి 

దౌల్తాబాద్‌ : మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, అందులో భాగంగానే 100 శాతం ఉచితంగా చేప పిల్లను పంపిణీ చేస్తున్నదని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని కుదురుమళ్ల, ఈర్లపల్లి, నందారం, చెల్లాపూర్‌, దౌల్తాబాద్‌ తదితర చెరువుల్లో శనివారం చేపపిల్లలను వదిలారు. నందారంలో అక్కల్‌రెడ్డి చెరువు నిండి అలుగు పారుతున్న నేపథ్యంలో రోడ్డుపై రాకపోకలు పూర్తిగా స్తంభించడంతో ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారులు చేపలను తరలించేందుకు ప్రభు త్వం రాయితీపై వాహనాలు పంపిణీ చేసిందన్నారు. అనంతరం చెల్లాపూర్‌లో రైతువేదిక భవనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయ్‌కుమార్‌, జడ్పీటీసీ కోట్ల మహిపాల్‌, వైస్‌ ఎంపీపీ మహిపాల్‌రెడ్డి,  సర్పంచ్‌లు శిరీషరమేష్‌, కిష్టమ్మబాల్‌రాజ్‌, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

 ప్రజలను అప్రమత్తం చేయాలి

భారీ వర్షాలు కురుస్తున్నందున అధికార యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. పురాతన ఇండ్ల నుంచి కుటుంబాలను ఖాళీ చేయించాలన్నారు.  వర్షంతో నష్టపోయినవారికి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. logo