గురువారం 29 అక్టోబర్ 2020
Vikarabad - Sep 28, 2020 , 01:08:50

తాండూరులో పందుల బెడద

తాండూరులో పందుల బెడద

తాండూరు: తాండూరు మున్సిపల్‌ పరిధిలోని 36 వార్డుల్లో ఎక్కడ చూసిన పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పందుల వల్ల మెదడువాపుతో పాటు విషజ్వరాలు సోకుతాయి. అయితే అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో వందల సంఖ్యల్లో ఉన్న పందులు తాండూరు పట్టణంలో వేల సంఖ్యలోకి పెరిగాయి. నిత్యం మురుగు కాలువలు, చెత్తల్లో ఉండే ఈ పందులకు తగ్గట్లు పట్టణంలో ఓపెన్‌ డ్రైనేజీలు, ఖాళీ స్థలాల్లో అపరిశుభ్రత ఉండడంతో ఎక్కువ సంఖ్యలో పందులు జీవించుటకు కారణంగా కనిపిస్తోంది. శివారు కాలనీల్లో పందుల బెడద మరింత ఎక్కువగా ఉంది. అపరిశుభ్రతతో ఉన్న తాండూరు వార్డులను పరిశుభ్రంగా మార్చుటకు, పందులు, దోమలు, ఈగల బెడద నుంచి ప్రజలు రక్షణ పొందేందుకు మున్సిపల్‌ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ చేపడితేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని స్థానికులతో పాటు వైద్యులు చెబుతున్నారు.

పాతకుంటలో పందుల మాంసం...

పందుల యజమానులు వారంలో రెండు సార్లు మున్సిపల్‌ పరిధిలోని పాత కుంట సమీపంలోని కట్టమైసమ్మ దేవాలయం సమీపంలో పందులను కోసి మాంసం తయారు చేస్తుండడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. పందుల వ్యర్థాలను రోడ్డు పక్కనే వేయడంతో కాలనీలో కంపు వాసన వెదజల్లుతోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, నేతలు స్పందించి వెంటనే పందుల పెంపకం దారులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.  

జనావాస ప్రాంతాలకు దూరంగా పెంచాలి

ప్రజల ప్రాణాలకు హాని చేకూర్చే పందులను జనావాస ప్రాంతాలకు దూరంగా పెంచాలి. ఓపేన్‌ డ్రైనేజీలు, ఖాళీ స్థలాల్లో అపరిశుభ్రత ఉండడంతో పందులు, ఈగలు, దోమలతో  చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా స్పందించడం లేదు. ఇప్పటికైనా మున్సిపల్‌ అధికారులు, పాలక వర్గం స్పందించి సరైన చర్యలు తీసుకోవాలి. - కోట్రిక శ్రీకాంత్‌, తాండూరుlogo