శనివారం 24 అక్టోబర్ 2020
Vikarabad - Sep 27, 2020 , 01:35:11

పక్కా వ్యూహంతో ముందుకెళ్దాం

పక్కా వ్యూహంతో ముందుకెళ్దాం

ప్రతి గ్రాడ్యుయేట్‌ను ఓటరుగా నమోదు చేయించే బాధ్యత తీసుకోండి

ఒకటో తేది నుంచి ఓటరు నమోదు కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి

లక్షా50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి...

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యం

ప్రతిపక్షాల దుష్ప్రచారాలను గట్టిగా తిప్పికొట్టండి

టెలీ కాన్ఫరెన్స్‌లో పార్టీ శ్రేణులతో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ/వికారాబాద్‌ రూరల్‌: ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో ఓటరు నమోదు ఇన్‌చార్జీలతో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కే.తారకరామారావు శనివారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడిన కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒక వ్యూహంతో పార్టీగా ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా అర్హత ఉన్న ప్రతి గ్రాడ్యుయేట్‌ని ఓటరుగా నమోదు చేయించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. అక్టోబర్‌ 1 నుంచి ప్రారంభమయ్యే ఓటరు నమోదు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ తొలిరోజే తమతో పాటు కుటుంబసభ్యులను ఓటరుగా నమోదు చేయించుకోవాలని అన్నారు. ఇందుకు సంబంధించి ప్రతి కార్యకర్త అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. తాను కూడా ఒకటవ తేదీన ఓటరుగా నమోదు చేయించుకుంటానని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేసుకుంటూ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తూ ముందుకు పోతుందన్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపైన, వాటి వల్ల ప్రజలకు అందుతున్న ప్రతిఫలాలపైన ఓర్వలేనితనంతో ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు చేస్తున్న చిల్లర ప్రయత్నాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉద్యోగాల కల్పనలో ప్రతిపక్షాలు చేస్తున్న అవాస్తవాలను ప్రజలకు తెలియజెప్పి వాస్తవాలను గణాంకాలతో సహా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం లక్షా 50వేల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించిందని మరోవైపు టీఎస్‌ఐపాస్‌  ద్వారా సుమారు 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలను చూపించిందన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు వినూత్నమైన సంస్కరణలకు సర్కార్‌ పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగానే నూతన పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, రెవెన్యూ చట్టాలను తీసుకువచ్చామన్నారు. రైతుబంధు, రైతుబీమా వంటి కార్యక్రమాలతో పాటు రైతు పండించిన ప్రతి గింజను కొన్నామన్నారు. త్వరలోనే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుకు పోతున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌ జిల్లాల్లో బలమైన శక్తిగా ఉన్నదని, ఇప్పటిదాక జరిగిన అన్ని ఎన్నికల్లో తన బలాన్ని చాటుకున్నదని కేటీఆర్‌ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తే పార్టీకి మద్దతిచ్చేందుకు వారు ఏమాత్రం వెనుకాడరని అన్నారు. 

కౌన్సిలర్‌కు కేటీఆర్‌ ఫోన్‌...

ఈ టెలికాన్ఫరెన్స్‌లో వికారాబాద్‌ మున్సిపాలిటీ 32వ వార్డు కౌన్సిలర్‌ నవీన్‌తో కేటీఆర్‌ సంభాషణ ఈ విధంగా సాగింది. 

కేటీఆర్‌ : గుడ్‌ ఆఫ్టర్‌నూన్‌ నవీన్‌కుమార్‌.

నవీన్‌కుమార్‌ : గుడ్‌ ఆఫ్టర్‌నూన్‌ సార్‌.

కేటీఆర్‌ : మీరు ఏం చదువుకున్నారు ? ఎప్పుడు పూర్తి చేశారు.?

నవీన్‌కుమార్‌  : 2011లో డిగ్రీ పూర్తి చేశాను సర్‌. 

కేటీఆర్‌ : వార్డులో మీ లెక్క ప్రకారం ఎంత మంది ఓటర్లు ఉన్నారు.?

నవీన్‌కుమార్‌ : ప్రస్తుతానికి 75 మంది పట్ట్టభద్రుల వివరాలు, వారి ధ్రువపత్రాలు తీసుకున్నాం. మరో 10 మంది వివరాలు రావాల్సి ఉంది.

కేటీఆర్‌ : మరీ ఆ 10 మందితో కూడా సీరియస్‌గా చేయిస్తారా బ్రదర్‌.?

నవీన్‌కుమార్‌ : సీరియస్‌గా తీసుకొని తప్పకుండా చేస్తాం సార్‌. 

కేటీఆర్‌ : సమావేశాలు ఏమైనా జరిగాయా.?

నవీన్‌కుమార్‌ : మూడు సమావేశాలు జరిగాయి. రెండు సార్లు ఎమ్మెల్యే ఆనంద్‌ ఆధ్వర్యంలో, ఒకటి పట్టణ కమిటీ సభ్యులతో జరిగింది.

కేటీఆర్‌ : ఏమైనా సందేహాలు, సమస్యలు ఉన్నాయా.?

నవీన్‌కుమార్‌ : ఎలాంటి సమస్యలు లేవు సార్‌ .

కేటీఆర్‌ : ఓకే థాంక్యూ నవీన్‌ ఇదే విధంగా కృషి చేయండి.

నవీన్‌కుమార్‌ : ఓకే సార్‌ థాంక్యూ.

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యేలు

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/షాబాద్‌ : జీహెచ్‌ఎంసీ పరిధిలో వివిధ కాలనీల్లో సంవత్సరాలుగా పేరుకుపోయిన రెవెన్యూ సమస్యలపైన రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాజేంద్రనగర్‌ జీహెచ్‌ఎంసీ కార్యాలయం నుంచి జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ గడ్డం రంజిత్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, డిప్యూటీ కమిషనర్‌ ప్రదీప్‌, స్థానిక కాలనీ సంఘాల ప్రతినిధులు వారి సమస్యలను మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. భవిష్యత్తులో అన్ని రిజిస్ట్రేషన్‌లు ధరణి పోర్టల్‌ ఆధారంగానే జరుగుతాయని ఎంపీ రంజిత్‌రెడ్డి స్పష్టం చేశారు. అదేవిధంగా రంగారెడ్డి-హైదరాబాద్‌-మహబూబ్‌నగర్‌ జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య వేర్వేరుగా పాల్గొన్నారు.


logo