శనివారం 24 అక్టోబర్ 2020
Vikarabad - Sep 26, 2020 , 01:05:03

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేద్దాం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేద్దాం

మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి

పరిగి: ఎన్నికలు ఏవైనా విజయం టీఆర్‌ఎస్‌దేనని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పరిగిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ సన్నాహక సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజలు ప్రతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పడుతున్నారని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోను టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. గ్రామాలలో ఎంతమంది పట్టభద్రులు ఉన్నారనేది మొదట జాబితా తయారుచేసి, వారందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాధ్యమైనంత ఎక్కువగా ఉద్యోగాల భర్తీకి కృషి చేస్తుందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని ప్రకటించగా కోర్టుకు వెళ్లి అడ్డుకుంటున్నారని, ఏదైనా మంచిపని చేద్దామనుకుంటే కోర్టులకు వెళ్లి అడ్డుపడుతున్నారని విమర్శించారు. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు భద్రత లేదని, వారి భద్రత కోసం చట్టం రూపకల్పనకు సీఎం కేసీఆర్‌ ఆలోచిస్తున్నారని తెలిపారు.   పరిశ్రమల ఏర్పాటు ద్వారా స్థానికులకు ఉద్యోగావకాశాలు కలుగుతాయని మంత్రి పేర్కొన్నారు. తదనంతంరం ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకుంటే మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుందన్నారు. గత ఎన్నికల్లో పరిగి నియోజకవర్గంలో 4,800 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారని, వేలాదిమంది పట్టభద్రులుండగా ఓటరుగా నమోదు చేయించుకోలేదని చెప్పారు. పార్టీ శ్రేణులు ముందుగా తమ కుటుంబాలలోని పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించాలని సూచించారు. గతంలో గెలుపొందిన ఎమ్మెల్సీలు మళ్లీ కనిపించలేదని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఓటరును కలిసి పార్టీ అభ్యర్థికి మద్దతు కోరాలన్నారు. గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు. ఎమ్మెల్యే కొప్పులు మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ అందరం ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యా మౌళిక వసతుల కల్పన సంస్థ చైర్మన్‌ జీ.నాగేందర్‌గౌడ్‌, డీసీసీబీ చైర్మన్‌ బుయ్యని మనోహర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు కొప్పుల అనిల్‌రెడ్డి, పరిగి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అజారుద్దీన్‌, పరిగి మున్సిపల్‌ చైర్మన్‌ ముకుంద అశోక్‌, ఎంపీపీలు కె.అరవిందరావు, మల్లేశం, సత్యమ్మ, మాధవి, జెడ్పీటీసీలు మలిపెద్ది మేఘమాల, శ్రీనివాస్‌రెడ్డి, రాందాస్‌నాయక్‌, పరిగి పీఏసీఎస్‌ చైర్మన్‌ కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు ఆర్‌.ఆంజనేయులు, శ్రీనివాస్‌, హన్మంతు, లక్ష్మీనారాయణ, మహిపాల్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల కో-ఆర్డినేటర్‌లు మేడిద రాజేందర్‌, బి.లక్ష్మయ్య, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.


logo