గురువారం 22 అక్టోబర్ 2020
Vikarabad - Sep 17, 2020 , 01:46:31

ఇంటి అనుమతులు ఇక సులువు

ఇంటి అనుమతులు ఇక సులువు

నాలుగు మున్సిపాలిటీల్లో అమల్లోకి వచ్చిన టీఎస్‌-బీపాస్‌ 

ఇప్పటివరకు 153 దరఖాస్తులు

అనుమతుల్లేకుండా 75 చదరపు గజాల్లోపు భవన నిర్మాణం

పర్యవేక్షించనున్న కలెక్టర్‌ ఆధ్వర్యంలోని కమిటీ

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: టీఎస్‌-బీపాస్‌ విధానంలో భాగంగా ఇప్పటివరకు జిల్లాలో 153 దరఖాస్తు లు వచ్చాయి.  వికారాబాద్‌ మున్సిపాలిటీని పైలట్‌ ప్రా జెక్టుగా ఎంపిక చేసిన దృష్ట్యా వికారాబాద్‌ మున్సిపాలిటీలో 98 దరఖాస్తులు, తాండూర్‌ మున్సిపాలిటీలో ఐదు దరఖాస్తులు, పరిగి మున్సిపాలిటీలో 50 దరఖాస్తులు అందినట్లు సంబంధిత అధికారులు వెల్లడించా రు.  కొడంగల్‌ మున్సిపాలిటీలో ఇప్పటివరకు ఎలాంటి దరఖాస్తులు అందలేదని అధికారులు తెలిపారు.  టీఎస్‌-బీఎస్‌ వెబ్‌సైట్‌లో తలెత్తిన సమస్యతో ప్రజలు గత రెండు నెలలుగా కొంత ఇబ్బందులు ఎదుర్కొగా, వెబ్‌సైట్‌లో తలెత్తిన సమస్యను పరిష్కరించిన అధికారులు వచ్చేనెల మొదటి వారం నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నిర్ణయించారు.  ఈ కొత్త విధానానికి సంబంధించి వికారాబాద్‌, తాండూర్‌, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల్లోని ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మరోసారి నాలుగు మున్సిపాలిటీల్లో టీఎస్‌-బీపాస్‌పై ఈనెలాఖరు వరకు విస్తృత ప్రచారం చేయనున్నారు. 

దరఖాస్తు చేసుకున్న తక్షణమే అనుమతులు...

భవన నిర్మాణ అనుమతులు ఇకపై మరింత సులువు కానుంది. రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన టీఎస్‌-బీపాస్‌తో దరఖాస్తు చేసుకున్న తక్షణమే అనుమతులు మంజూరు కానున్నాయి. ఇకపై భవన నిర్మాణ అనుమతులకై రోజుల తరబడి మున్సిపల్‌ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. భవన నిర్మాణానికి కావాల్సిన అన్ని పత్రాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చి దరఖాస్తు చేసుకుంటే  క్షణాల్లో స్వీయ ధ్రువీకరణ(సెల్ఫ్‌ సర్టిఫికెట్‌) పత్రం జారీ అవుతుంది. సంబంధిత స్వీయ ధ్రువీకరణ పత్రం ఆధారంగా భవన నిర్మాణాన్ని చేపట్టవచ్చు.  గతంలోనూ భవన నిర్మాణ అనుమతులు ఆన్‌లైన్‌ విధానంలోనే జారీ అవుతున్నప్పటికీ ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకున్న అనంతరం 21 రోజుల్లో అనుమతులివ్వాలని నిబంధనలున్నప్పటికీ మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరమే అనుమతులు జారీ చేసేవారు. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు నిర్ణీత సమయానికి రాకపోవడం, ఒకవేళ వచ్చినా ఎదో ఒక కొర్రీలు పెట్టి లంచం డిమాండ్‌ చేయడం వంటివి జరుగుతుండేది. ఇకపై భవన నిర్మాణ అనుమతుల్లో టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల భాగస్వామ్యం లేకుండా నేరుగా భవన నిర్మాణదారులే టీఎస్‌-బీపాస్‌ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని అనుమతులు పొందవచ్చు. 

టీఎస్‌-బీపాస్‌ నిబంధనల ప్రకారం

75 చదరపు గజాలలోపు స్థలంలో నిర్మించే భవన నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి నామమాత్రంగా ఒక్క రూపాయిని చెల్లిస్తే సరిపోతుంది. అదే 75 చదరపు గజాల నుంచి 200 చదరపు గజాల వరకుగల స్థలంలో భవన నిర్మాణాలు చేపట్టే వారు బిల్డింగ్‌ ప్లాన్‌ను టీఎస్‌-బీపాస్‌ వెబ్‌సైట్‌లో పొందుపర్చిన వెంటనే ఆన్‌లైన్‌ ద్వారా అనుమతులు మంజూరవుతాయి. తదనంతరం జిల్లా కలెక్టర్‌ నియమించే స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం(ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు) క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహిస్తారు.  వాస్తవాలను తప్పుగా పేర్కొని నిర్మాణాన్ని చేసినట్లయితే ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే సదరు నిర్మాణదారులకు జరిమానా విధించడంతోపాటు భవన నిర్మాణాన్ని కూలగొట్టడం లేదా స్వాధీనపర్చుకోనున్నారు. అదేవిధంగా 500 చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణంలోని ప్లాట్లలో నిర్మించే భవన నిర్మాణాలకు సింగిల్‌ విండో విధానం ద్వారా 21 రోజుల్లో అనుమతులు మంజూరుకానుంది. అయితే 240 చదరపు గజాల కంటే ఎక్కువ, 500 చదరపు గజాల వరకు ఉండే భవనాలకు స్వీయ ధ్రువీకరణ పత్రం ఆధారంగా స్వాధీన ధ్రువీకరణ పత్రా న్ని తక్షణమే అందజేయనున్నారు. 500 చదరపు గజాలపైగల భవనాలకు స్వీయ ధ్రువీకరణ దరఖాస్తు ఆధారంగా 15 రోజుల్లో స్వాధీన ధ్రువపత్రం జారీ చేయనున్నారు. గతంలో మాదిరిగా అగ్నిమాపక, నీటి పారుదల తదితర శాఖలకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా టీఎస్‌-బీపాస్‌లో దరఖాస్తు చేసుకుంటే చాలు ఒకేచోట అన్ని అనుమతులు జారీ కానున్నాయి. అన్ని ధ్రువీకరణ పత్రాలు సరిగ్గా ఉండి దరఖాస్తు చేసుకున్నా 21 రోజుల్లో అనుమతి రానట్లయితే 22వ రోజున అనుమతిచ్చినట్లుగా సమాచారం  భవన నిర్మాణదారుడికి పంపించనున్నారు. 

కలెక్టర్‌ ఆధ్వర్యంలో కమిటీ

కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటయ్యే కమిటీ భవన నిర్మాణ అనుమతులను పర్యవేక్షించనుంది. వాస్తవాలను తప్పుగా ఆన్‌లైన్‌లో పొందుపర్చినట్లయితే భవనాలను కూల్చివేయడంతోపాటు భవన యజమాని నుంచి కూల్చివేత ఖర్చులు వసూలు చేయనున్నారు. రిజిస్ట్రేషన్‌ విభాగం ద్వారా నిర్ణయించిన స్థలం, భవన క్యాపిటల్‌ విలువలో 25 శాతం వరకు జరిమానా విధించనున్నారు. 50 శాతం కంటే తక్కువ కాకుండా జరిమానా విధించడంతోపాటు మూడేళ్ల జైలు శిక్ష విధించనున్నా రు. కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటయ్యే జిల్లాస్థాయి కమిటీ చట్ట విరుద్ధమైన భవన నిర్మాణాలను గుర్తించి, పర్యవేక్షించి సంబంధిత నిర్మాణాలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టనున్నారు.

సమాచారం ఇస్తే ఏడురోజుల్లో చర్యలు

అక్రమ నిర్మాణాలకు సంబంధించి సమాచారమిచ్చే వారిని ప్రోత్సహించడంతోపా టు ఏడు రోజుల్లోగా చర్య లు తీసుకోనున్నారు.  నూతన విధానం ప్రకారం కేవ లం పార్కింగ్‌ కోసం ప్రత్యేకంగా కేటాయించే ప్రాంతా న్ని పార్కింగ్‌కు కాకుండా వేరొక విధంగా వాడుకున్నట్ల యితే నిబంధనల ఉల్లంఘన కింద యజమానికి స్థలం విలువతోపాటు భవన క్యాపిటల్‌ విలువలో 25 శాతం జరిమానా విధించడం జరుగుతుంది.  మున్సిపాలిటీ పరిధిలో పార్కింగ్‌ ఉల్లంఘనలను గుర్తించడంతోపాటు పర్యవేక్షించి నియంత్రించేందుకుగాను జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను నియమించనున్నారు. కొత్త విధానం ప్రకారం ప్రతీ లేఅవుట్‌లో పార్కింగ్‌కు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించాల్సి ఉంటుంది, లేఅవుట్‌ పూర్తైన తర్వాత ఖాళీ స్థలాలను రోడ్లకు కేటాయించిన భూమిని మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్‌ చేసిన తర్వాత కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటయ్యే లేఅవుట్‌ ఆమోద కమిటీ తాత్కాలిక లేఅవుట్లను పరిశీలించి సరిగ్గా ఉన్నట్లయితే సంబంధిత కమిటీ శాశ్వత అనుమతిని ఆన్‌లైన్‌లో జారీ చేయనున్నారు. 75 చదరపు గజాల కంటే తక్కువ స్థలంలో నిర్మించే జీ, జీప్లస్‌1 నివాస భవనాలకు ఆస్తి పన్ను మినహాయించనున్నారు. రిజిస్ట్రేషన్‌పై మ్యూటేషన్‌ తక్షణమే చేయనున్నారు. భవన యజమాని తప్పుడు వివరాలిచ్చినట్లయితే ఆస్తిపన్ను 25 రెట్లు జరిమానా (వన్‌టైం పెనాల్టీ)ను విధించనున్నారు. 








logo